న్యూయార్క్: ఒంటెజాతి జీవి లామాలో ఉండే అతిసూక్ష్మ యాంటీబాడీలు, వివిధ కరోనా వేరియంట్ల నుంచి సమర్ధంగా రక్షణ కల్పించగలవని తేలింది. రాక్‌ఫెల్లర్ యూనివర్శిటీ, సీటెల్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ మేరకు పరిశోధన సాగించారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ కొత్త ఔషధాన్ని కనుగొనడం విశేషం. పరిశోధకులు కరోనా వైరస్/కొవిడ్ టీకాలు ఇవ్వడం ద్వారా లామాల్లో పలురకాల యాంటీబాడీలను అభివృద్ధి చేశారు.ఇవన్నీ అత్యంత సూక్ష్మంగా ఉండడంతో వీటిని నానోబాడీలుగా పిలుస్తున్నారు. తరువాత వీటిలో కొన్నింటిని కలిపి వుహాన్, డెల్టా రకం వైరస్‌లపై ప్రయోగించారు.
దీంతో వైరస్ స్పైక్ ప్రొటీన్లు నియంత్రణ లోకి వచ్చాయి. నానోబాడీలను ఈస్ట్ లేదా బ్యాక్టీరియాలో సులభంగా ఉత్పత్తి చేయవచ్చు. ఇవి అత్యంత చురుగ్గా, ఇతర ప్రభావాలకు లోనుకాకుండా స్థిరంగా ఉంటాయి. లామాల్లోని రకరకాల నానోబాడీలను సమ్మిళితం చేసి సమర్ధ కొవిడ్ ఔషధాన్ని తయారు చేయవచ్చని పరిశోధన కర్తలు మైకేల్ రౌత్, బ్రియాన్ చైత్‌లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఒమిక్రాన్‌పై ప్రయోగాలు జరుగుతున్నాయని త్వరలోనే ఈ ఫలితాలు అందుబాటు లోకి వస్తాయని తెలిపారు. భవిష్యత్తులో తలెత్తే వేరియంట్ల నుంచి లామా నానోబాడీలు రక్షణ కల్పించగలవని వారు ఆశాభావం వెలిబుచ్చారు.
Effective treatment with Llama nanobodies for Corona