నేడు భూమిపై వాతావరణం శీఘ్రగతిన మార్పులకు లోనవుతోంది. వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత అనేవి ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు. ఆధునిక మానవుడు ప్రకృతిపై పట్టుసాధించే క్రమంలో సృష్టిస్తున్న సహజ వనరుల విధ్వంసం, కాలుష్యాలు హానికర కర్బన ఉద్గారాలు, చమురును ఇష్టానుసారంగా మండించడం, అడవులను, కొండలను నాశనం చేయడం వంటి పలు వికృత చర్యలతో భూవాతావరణంతో పాటు సముద్రాలలో సైతం ప్రమాదకరమైన మార్పులు సంభవిస్తున్నాయి. గత 150 సంవత్సరాల కాలంలో మానవ కార్యకలాపాల కారణంగా వాతావరణంలో 30% కార్బన్ డై ఆక్సైడ్ పెరిగింది. ప్రపంచంలో సంపన్న దేశాలతో పాటు భారత్ సహా అభివృద్ది చెందుతున్న దేశాలు సుమారు 70% పెట్రోలియం చమురు ఉత్పత్తులు, బొగ్గు, డీజిల్, గ్యాస్ లాంటి సాంప్రదాయ శిలాజ ఇంధన వనరులను వినియోగించడం జరుగుచున్నది. బొగ్గు అధిక వాడకంతో కర్బన ఉద్గారాలు పెరిగి గా లికాలుష్యం, భూమి వేడెక్కడం వల్ల వాతావరణ ప్రతికూల మార్పులు జరిగి మానవాళి మనుగడ ప్రమాదంలో పడుతోంది.
వాతావరణ అసాధారణ మార్పుల వల్ల ప్రస్తుతం సంభవిస్తున్న భూతాపం కరువులు తుఫానులు, పెనువరదలు భూకంపాలు, వడగాడ్పులు శీతలగాడ్పులు ఎల్‌నినో- లానినా పరిస్థితులు, సుడిగాలులు, ధ్రువాలవద్ద మంచుకరగడం, కొండచరియలు విరిగిపడటం, సముద్రమట్టాల పెరుగుదల, కార్చిచ్చులు, కరోనా వంటి మహమ్మారి వ్యాధుల విజృంభణ తదితర ఉత్పాతాల రూపంలో భూమి చేస్తున్న ఆక్రందనలు తీవ్ర వాతావరణ సంక్షోభానికి (క్లైమేట్ క్రైసిస్) అద్దం పడుతున్నాయి. భూమికి మనిషికి చేసినట్లే వార్షిక హెల్త్ చెకప్ చేయిస్తే భూమి ఆరోగ్యం పూర్తిగా దిగజారిందని, కీలక అవయవాలన్నీ దాదాపు మూలకు పడ్డాయనే రిపోర్ట్ వస్తుందని ప్రముఖ అమెరికన్ క్లైమేట్ సైంటిస్ట్ ఎర్త్ కమిషన్ సహ అధ్యయన కర్త డాక్టర్ క్రిష్టి ఎబీవాపోయాడు. 20వ శతాబ్ది మధ్యకాలం నుండి ఉష్ణోగ్రతల పెరుగుదలకు ముఖ్యకారణం మానవుడే అని వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్న ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ 5వ అసెస్‌మెంట్ నివేదికలో పేర్కొన్న విషయం విదితమే.
వాతావరణ అసాధారణ మార్పులతో సంభవించే ఈవిపరిణామాలను తప్పించేందుకు మానవాళికి ఇంకా ఒక అవకాశం మిగిలే ఉందని, అందుకు ప్రధానంగా కర్బన ఉద్గారాలు బాగాతగ్గించి శిలాజ ఇంధనాల వాడకాన్ని మూడింట రెండు వంతులు 2035 నాటికి తగ్గించవలసి వుందని ఇటీవల మార్చి 2023లో బెర్లిన్‌లో జరిగిన సమావేశంలో యుఎన్‌ఒ శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది. ఈ విపరీత వాతావరణ సంక్షోభ పరిస్థితుల మధ్య మానవాళితో పాటు సమస్త జీవరాశుల పరిరక్షణకు గాను శిలాజ ఇంధనాల వినియోగం తగ్గింపు, శుద్ధ, హరితశక్తి వినియోగాన్ని పెంచడం ఒక్కటే ఏకైక మార్గంమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిద్దాం,- అసాధారణ వాతావరణ మార్పులను నియంత్రిద్దాం అంటూ తాజాగా 2023 నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు రెండు వారాల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరిగిన ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సమావేశం (కాప్-28) నినదించింది. వాతావరణ మార్పులపై 1995 నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్) పేరున ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సదస్సు జరుగుతుంటుంది. 1995 లో బెర్లిన్‌లో మొట్టమొదటి కాప్ సదస్సు జరుగగా గత సంవత్సరం ఈజిప్టుల్లో కాప్ -27 సదస్సు జరిగింది.
వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 సెంటీగ్రేడ్ డిగ్రీలకు పరిమితం చేయడం, 2050 నాటికి శూన్య కర్బన ఉద్గారాల సాధన, పారిస్ ఒప్పందంలోని అంశాల అమలు, వాతావరణ అసాధారణ మార్పుల వల్ల నష్టపోయే పేద దేశాలకు సహాయం చేయటం అనేవి ఈ సదస్సు ముఖ్య లక్ష్యాలు. ఈ సమావేశంలో భారత్‌తో సహా సుమారు 200 దేశాలు, 70 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమైన శిలాజ ఇంధనాల వాడకం తగ్గింపు కోసం ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పటిష్టమైన నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని కాప్-28 సదస్సు పిలుపునిచ్చింది.
భూమి దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం, భూమిని మరింత నివాసయోగ్యంగా మార్చడం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశం ఇటీవల గ్రీన్ క్రెడిట్ పోగ్రామ్, మిషన్ లైఫ్ అను రెండు వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు పరుస్తున్నది. 2030 నాటికి ఉద్గారాల తీవ్రతను 45% తగ్గించడం, శుద్ధ, పునరుత్పాదక ఇంధనాల వినియోగ వాటాను 50% పెంచాలని, ప్రజల భాగస్వామ్యంతో కార్బన్ సింక్స్ రూపొందించే ఉద్దేశ్యంతో కాప్ -28 సదస్సులో తాజాగా భారత్ గ్రీన్ క్రెడిట్ ఇన్షియేటివ్ పోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది.
అదే విధంగా వాతావరణ మార్పులపై 2021లో జరిగిన గ్లాస్గో సదస్సు (కాప్-26)లో లైఫ్ స్టైల్ ఫర్ ది ఎన్విరాన్‌మెంట్- లైఫ్ అనే ప్రపంచ పర్యావరణ ఉద్యమ భావనకు భారత దేశం అంకురార్పణ చేసింది. ఇందులో భాగంగా పర్యావరణ స్పృహతో కూడిన జీవనశైలిని అవలంబించడానికి, ప్రజలను ప్రభావితం చేయడానికి, విద్యావేత్తలు, పర్యావరణ నిపుణులు ప్రజల నుండి సానుకూల ఆలోచనలను ఆహ్వానిస్తూ ‘లైఫ్ గ్లోబల్ కాల్ ఫర్ పేపర్స్’ అనే కార్యక్రమం ఆరంభమైంది. ప్రజలలో ప్రొ ప్లానేట్ పీపుల్ (పి3) భాగస్వామ్య నిబద్ధతను పెంపొందించడం, పర్యావరణ అనుకూల ప్రవర్తనలను బలోపేతం చేయడం అనేవి లైఫ్ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశాలు. ఇలాంటి పర్యావరణహిత ప్రజా భాగస్వామ్య కార్యక్రమాల అమలు వల్ల సహకారం (కోఆపరేషన్) భాగస్వామ్యం (కొలాబరేషన్) ఏకాభిప్రాయం (కన్సెన్సస్) అనే 3-సి తాత్విక జీవన ప్రవర్తనాంశాలు ప్రజలలో పెంపొంది భూగ్రహానికి హాని కలిగించని జీవితాన్ని గడపడానికి వ్యక్తిగతంగా కానీ లేదా సామూహికంగా కానీ కర్తవ్యాల నిర్వహణలో ముందుంటారని చెప్పడంలో సందేహం లేదు.
సుస్థిర పర్యావరణ అభివృద్ధి లక్ష్యాల సాధనకు పర్యావరణ ఉద్యమ ఉద్దేశాలకు తగ్గట్టుగా ప్రజల, విద్యార్థుల ప్రవర్తనలో మార్పుల కోసం వారిని క్లైమేట్ లిటరేట్స్‌గా మార్చడం, భారీగా వాతావరణ నిధులను సమీకరించడం, హరిత సాంకేతికత బదిలీ అంశాల పై దృష్టి సారించడం వంటి చర్యలతో ప్రభుత్వాలు పౌర సమాజం సమిష్టిగా వాతావరణ న్యాయం ( క్లైమేట్ జస్టిస్) కోసం కృషి చేయవలసిన అవసరం వుంది. శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించడానికి కాప్ -26లో భారత్ ప్రతిపాదించిన పంచామృతం సూత్రాలను నిబద్ధతతో ప్రపంచ దేశాలు అనుసరించాలి. జి-20 సమ్మిట్ న్యూడిల్లీ డిక్లరేషన్- 2023లో పేర్కొన్న విధంగా నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడానికి సంపన్న దేశాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఈ సమ్మిట్లోనే రూపుదిద్దుకున్న అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి లక్ష్యాల సాధనకు కట్టుబడాలి. సాంప్రదాయేతర పునరుత్పత్తి ఇంధన వనరులైన సౌరశక్తి, పవనశక్తి అలల శక్తితో పాటు హైడ్రోజన్ ఇంధనం బయోమాస్ శరీర ఉష్ణం వ్యర్థ ఆల్కహాల్ వంటి వనరులను వినియోగించి అధిక హరితశక్తి (గ్రీన్ ఎనర్జీ) ఉత్పత్తికి అడుగులు వేయాలి.
ముఖ్యంగా వ్యర్థాలను తగ్గించడం, పునర్వినియోగం, పునఃచక్రీయంలపై ప్రజలు ఆచరణాత్మక సాధనకు పూనుకోవాలి. పాతుకుపోయిన పాత అలవాట్లను విడిచిపెట్టి నూతన హరిత ఆవిష్కరణల వైపు పయనించాలి. వన మహోత్సవం, హరితహారం లైఫ్ కార్యక్రమాల స్ఫూర్తితో సానుకూల వాతావరణ ఆశయ సాధనకై ప్రజలందరూ పాటుపడాలి. భూమి మనది కాదు, మనం భూమికి చెందిన వారం అని చాటి చెప్పిన కాప్-28 సదస్సు ప్రకటన స్ఫూర్తిగా ప్రపంచ మానవాళి తమ పర్యావరణ జీవనశైలిలో అనుకూలమార్పులు చేసుకుంటూ వాతావరణ సంక్షోభ నివారణకు పాటు పడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది నేటి అవసరం, అవశ్యం, అనుసరణీయం కావాలి.