Thursday, January 23, 2025

డ్రగ్స్‌ను అడ్డుకునేందుకు కృషి చేయాలి

- Advertisement -
- Advertisement -

పోలీసులు, ప్రజలు కలిసి పనిచేయాలి
డ్రగ్ ఫ్రీ ఏరియాలుగా ప్రకటించాలి
మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిహెచ్‌ఎంసి కార్పొరేటర్ల సమావేశం
నయా సవేరా కార్యక్రమం ప్రారంభిస్తాం
రాచకొండ సిపి మహేష్ భగవత్

మనతెలంగాణ, సిటిబ్యూరో: డ్రగ్స్‌ను అడ్డుకోవడానికి ప్రజలు, పోలీసులు కలిసి పనిచేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిహెచ్‌ఎంసి కార్పొరేటర్లతో నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం సిపి మహేష్ భగవత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ ఫ్రీ ఏరియాలను ప్రకటించేందుకు అందరూ సహకరించాలని కోరారు. డ్రగ్స్ వల్ల యువత మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడి యువత, పిల్లలు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌పై చాలా సీరియస్‌గా ఉందని, దానిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతారని అన్నారు.

డ్రగ్స్ తీసుకునేవారు, విక్రయించే వారిని పట్టుకుంటామని కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ లేకుండా చూస్తామని తెలిపారు. డ్రగ్స్ తీసుకునే వారిని బాధితులుగా చూస్తామని, వారికి అవసరమైన చికిత్స చేయించి తిరిగి వారి జీవితాన్ని కొనసాగించేలా చేస్తామని తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో డ్రగ్స్ బాధితుల కోసం ‘నాయా సవేరా’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. డ్రగ్స్ తీసుకునేవారు ట్రాన్స్‌పోర్టేషన్, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజాప్రతినిధులు డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు చెప్పాలని కోరారు. కాలనీల్లో కమ్యూనిటీ సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. స్థానికులు వారి ఇళ్లల్లో కూడా సిసిటివిలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. సిసి కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలు జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడం సులభమవుతుందని అన్నారు. మహిళలు, పిల్లలు, పెద్దల భద్రత కోసం పోలీసులు మరింత పనిచేస్తారని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు తమ ఏరియాలో డ్రగ్స్ గురించి వివరించారు. కార్యక్రమంలో డిసిపి రక్షితమూర్తి, ఎసిపి జావిద్,శివకుమార్, ఎడిసిపి అరుణ్‌కుమార్, రవీందర్ రావు, ఎసిపిలు, ఎస్‌హెచ్‌ఓలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News