Thursday, November 21, 2024

కాటారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
  • మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్

కాటారం : మంథని నియోజకవర్గంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాటారం మండలాన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పి.వి.ఆర్ ఫ్లాజా ఫంక్షన్‌హాల్‌లో మంథని నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జీ పుట్ట మధూకర్ అధ్యక్షతన జరిగిన మంథని నియోజకవర్గ స్థాయి కార్యకర్తల శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి హాజరైన మంత్రిపై విధంగా స్పందించారు.

బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ మాట్లాడుతూ గులాబీ దండులా కదిలి వచ్చి ప్రస్తుత పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును మంథని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడమే లక్షంగా కార్యకర్తలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే నియోజకవర్గంలోని భూపాలపల్లి జిల్లాలో ఉన్న మహాముత్తారం, పలిమెల, మహాదేవపూర్, మల్హార్‌రావు మండలాలకు కేంద్ర బిందువుగా ఉన్న కాటారం మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని శ్రీహర్షిణీ మంత్రి ఈశ్వర్‌ను కోరారు.

స్పందించిన మంత్రి కొన్ని మండలాలు భూపాలపల్లి జిల్లాలో కొన్ని మండలాలు పెద్దపల్లి జిల్లాలో ఉన్నది వాస్తవమేనని, ఐదు మండలాలకు సెంట్రల్ పాయింట్‌గా ఉన్న కాటారంను రెవెన్యూ డివిజన్‌గా చేయాలనేది న్యాయమైన కోరికని, ప్రజల సౌకర్యార్ధం సీఎం కేసీఆర్ కాటారంను రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజల కోరికను కాదనడని అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండు జిల్లాల జెడ్పీ చైర్మన్‌లతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కాటారం రెవెన్యూ డివిజన్‌పై ప్రస్తావిస్తానని అన్నారు.

అయితే మంథని నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలు కళ్ల ముందు ఒక్కటే లక్షం కనిపించాలని అది బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించి మంథనిలో బీఆర్‌ఎస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కాటారం రెవెన్యూ డివిజన్‌పై వెంటనే స్పందించిన మంత్రికి జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి కాటారం, మహాదేవపూర్, మల్హార్, పలిమెల, కాటారం మండలాల నుండి బీఆర్‌ఎస్ నాయకులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News