- యువజనులకు కని విని ఎరగని అవకాశాలకు ఇదే తరుణం
- 15వ రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోడీ
- రిక్రూట్లకు 51 వేల పైచిలుకు నియామక పత్రాలు పంపిణీ
న్యూఢిల్లీ : ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాల వృద్ధి కొనసాగేలా తన ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నదని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో రిక్రూట్లకు 51 వేలకు పైగా నియామక పత్రాలు పంపిణీ చేసిన అనంతరం 15వ రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, యువజనులకు కనివిని ఎరగని అవకాశాల కల్పనకుఇదే తరుణమని అన్నారు. భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చెప్పిందని, ప్రతి రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని మోడీ తెలియజేశారు. ఆటోమొబైట్, పాదరక్షల పరిశ్రమల్లో ఉత్పత్తి, ఎగుమతి కొత్త రికార్డులు సృష్టించాయని, భారీ సంఖ్యలో ఉపాధి కల్పించాయని మోడీ వెల్లడించారు. తన ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పుల గురించి ప్రధాని ప్రస్తావిస్తూ, దేశీయ జల మార్గాల ద్వారా సరకుల రవాణా 2014లోని 18 మిలియన్ టన్నుల నుంచి 145 మిలియన్ టన్నులకు పెరిగిందని, జాతీయ జలమార్గాలు ఐదు నుంచి పదికి, వాటి నిడివి 2700 కిమీ నుంచి 5000 కిమీకి చేరుకున్నాయని తెలియజేశారు. వృద్ధి సమ్మిళితం కావడమే భారీ హైలైట్ అని, మహిళల భాగస్వామ్యం ప్రతి రంగంలో పెరిగిందని ప్రధాని చెప్పారు. ఈ ఏడాది యుపిఎస్‌సి పరీక్షలో ఐదుగురు అగ్రశ్రేణి అభ్యర్థుల్లో ముగ్గురు మహిళలని, 90 లక్షల స్వయంసహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జిలు)లో పది కోట్ల మందికి పైగా మహిళలు పని చేస్తున్నారని ఆయన తెలిపారు. భారత మహిళా శక్తి అధికార యంత్రాంగం నుంచి రోదసి, వైజ్ఞానిక రంగాలలో కొత్త పుంతలు తొక్కుతున్నదని, గ్రామీణ మహిళల సాధికారతపై కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోందని ఆయన చెప్పారు. ఈ దశాబ్దంలో టెక్నాలజీ, డేటా, ఆవిష్కరణల రంగాల్లో భారత వృద్ధికి యువత దోహదంచేసిందని, రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీల్లో దేశం అగ్రగామిగా ఉందని మోడీ తెలియజేశారు. దేశ నిర్మాణానికి యువత చురుకుగా తోడ్పడుతుండగా దేశం శీఘ్రగతిన అభివృద్ధి చెందుతున్నదని, ప్రపంచ వేదికపై గుర్తింపు పొందుతోందని ఆయన తెలిపారు. దేశంలోని యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు వృద్ధి చెందేందుకు తన ప్రభుత్వం ప్రతి ఒక్క చర్యా తీసుకుంటున్నదని మోడీ చెప్పారు. స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాల గురించి ప్రధాని ప్రస్తావిస్తూ, అవి యువతకు కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయని, వారి ప్రతిభ ప్రదర్శనకు బహిరంగ వేదిక అవుతున్నాయని తెలిపారు.