నేడు సచివాలయంలో మంత్రిగా బాధ్యతల స్వీకరణ
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖల మంత్రిగా నేడు సోమవారం ఉదయం 10 గంటలకు మంత్రి కొండా సురేఖ బాధ్యతలు చేపట్టనున్నారు. డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410) ఆమె పూజలు చేసి బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్ హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో పర్యావరణం, అడవుల రక్షణకు, పచ్చదనం మరింతగా పెంచేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. అంతకు ముందు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఇతర అధికారులు, పండితులు కూడా మంత్రి కొండా సురేఖ దంపతులను కలిసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.