ప్రధాని మోడీ పిలుపు
ముంబయి: ఈ ఏడాది వ్యవసాయ దిగుబడి అధికంగా ఉన్న నేపథ్యంలో దేశంలో పంట చేతికి వచ్చిన అనంతరం రైతులకు అధిక లాభాలు సాధించేలా విప్లవాత్మక మార్పులు రావలసిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఊహించని రీతిలో కొవిడ్ మహమ్మారి కారణంగా అనేక పవాళ్లు ఎదురైనప్పటికీ రైతులు తాము పండించిన పంటలలో అధిక దిగుబడిని సాధించారని ఆయన చెప్పారు. నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రధాని పంపిన ఒక సందేశంలో రైతులు తాము పండించిన పంటలకు అధిక లాభాలు సంపాదించేలా ఒక విప్లవం రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీన్ని సాధించేందుకు తాము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. రైతులకు సాగునీరు అందించడం దగ్గర నుంచి విత్తడం, పంట కోతలు, మార్కెటింగ్ తదితర అన్ని అంశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారి సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా సమగ్రమైన చర్యలు చేపడుతున్నామని ప్రధాని అన్నారు.