Saturday, November 23, 2024

అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల లొల్లి

- Advertisement -
- Advertisement -

సరఫరాదారులపై నియంత్రణ లేకే ఈ అక్రమాలు
నాసిరకం గుడ్లతో పౌష్టికాహార సరఫరాకు తూట్లు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా నాసిరకం కోడిగుడ్లు, తక్కువ బరువు ఉన్నవి, నిల్వ అయిన కోడిగుడ్లను సరఫరా జరుగుతోంది. ఉన్నత స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పర్యవేక్షణ లోపం కారణంగా ఇలా నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయని తెలుస్తోంది. గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లను నియంత్రించలేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సిబ్బంది వాపోతున్నారు. మంచి పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు. అంగన్ వాడీల్లో పౌష్టికాహారం అందని ద్రాక్షలాగే మారుతోంది.

ఉన్నతాధికారు పర్యవేక్షణ లేక తక్కువ పరిమాణం కలిగిన గుడ్లు సరఫరా చేస్తూ కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కోడిగుడ్ల సరఫరాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. జిల్లాలో ఐసీడీఎస్ విభాగం కింద పని చేసే అధికారులు ఎక్కువ మంది ఇన్‌చార్జులే ఉండడం వల్ల నాసిరకం గుడ్లు సరఫరా చేసినా పట్టీపట్టనట్లు వారు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కోడిగుడ్లు పెద్ద సైజ్ వస్తుంటే, అంగన్వాడీలకు సరఫరా చేసే కోడిగుడ్లలో చిన్న సైజు రావడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. అధికార వర్గాల పరిశీలన సమయంలో పెద్ద సైజు కోడిగుడ్లకు ఆమోదం తెలిపినా, ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రాలకు చేరే సమయానికి చాలా చిన్న సైజు గుడ్లు వస్తున్నాయని తెలుస్తోంది.

దీనికి కారణం అధికారులు, కాంట్రాక్టర్ల లాలూచీ వ్యవహరమేనని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు చిన్నవి రావడమే కాకుండా అవి ఉడకబెట్టే సమయానికి లోపల చెడిపోయి దుర్వాసన వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇందుకు అధికారులను నిందించాలా..? లేక కోడిగుడ్లు సరఫరా కాంట్రాక్టర్‌ను నిందించాలా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పెద్ద చిన్న కోడి గుడ్లు కలిపి పంపిణీ జరుగుతోందని పలువురు చెబుతున్నప్పటికీ వాస్తవం మరోలా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కోడిగుడ్లు గ్రేడింగ్ చేసిన తర్వాత పెద్దగా ఉండేవి ఒక రేటు, చిన్నవి తక్కువగా రేటుగా ఉండడంతో ఎక్కువ శాతం చిన్న సైజు కోడిగుడ్లను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత శాఖలో కీలకంగా వ్యవహరించే కొందరు అధికారుల అండదండలతోనే కాంట్రాక్టర్లు నాణ్యతలేని చిన్న సైజు కోడిగుడ్లను సరఫరా చేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి.
గుడ్డు బరువు 45 నుంచి 50 గ్రాములు ఉండాలి

అంగన్వాడీల ద్వారా పంపిణీ చేసే కోడిగుడ్లు వాస్తవానికి ఒక్కోటి 45 గ్రాముల నుండి 50 గ్రాముల బరువు ఉండాలి. అంటే ఒక ట్రేలో ఉండాల్సిన 30 కోడిగుడ్లు 1350 గ్రాముల నుండి 1500 గ్రాముల బరువు ఉండాల్సి ఉంది. కానీ సగటున ఒక్కో గుడ్డు 40 గ్రాములు ఉండగా ట్రే బరువు 1200 గ్రాములు దాటడం లేదని తెలుస్తుంది. కొన్ని ట్రేలు దాదాపు 1500 గ్రాములు అంటే కిలోన్నర బరువుకు కొంచెం అటు ఇటు ఉన్నా చాలా వరకు తక్కువ బరువుతోనే వస్తున్నాయని చెబుతున్నారు. నాణ్యతలేని తక్కువ బరువు ఉన్న గుడ్లను పంపిణీ చేయడం ద్వారా కావాల్సిన స్థాయిలో పోషకాలు గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో అమ్ముడుపోని గుడ్లను అంగన్వాడీ కేంద్రాలకు తరలించి వాటిని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారని తెలిసింది.

మొత్తం ట్రే గుడ్ల బరువు 1200 గ్రాములకు మించి రావడం లేదని, కానీ రికార్డుల్లో మాత్రం అంతా సరిగానే ఉన్నట్లు చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలావుంటే కోడిగుడ్లు బాగా నిల్వ ఉండడం, ముఖ్యంగా వేడి వాతావరణం ఎక్కువ కావడం వల్ల త్వరగా కోడిగుడ్లు చెడిపోతున్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటే సమాధానం దొరకడం లేదని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. కోడి గుడ్లు స్టాక్ పాయింట్ల వద్ద నుంచి కేంద్రాలకు చేరే సరికి సమయం ఎక్కువ కావడం వల్ల చాలా కోడి గుడ్లు చెడిపోతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా వందల సంఖ్యలో కోడిగుడ్లను నెలలో రెండు మూడుసార్లు లబ్దిదారులకు సరఫరా చేసే వరకు వాటిని నిల్వ ఉంచేందుకు ఎటువంటి ఫ్రీజర్లు లేకపోవడం వల్ల గుడ్లు పాడవుతున్నాయని అంగన్వాడీ నిర్వాహకులు చెబుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు.

కోడి గుడ్లకు ప్రత్యేక రంగులు

అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్ల విషయంలో గత తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కోడి గుడ్లకు ప్రత్యేక రంగుతో కూడిన ముద్రను వేయాలని నిర్ణయించింది. గుడ్లు పక్కదారి పట్టకుండా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. చిన్నారులు, గర్బిణీ స్త్రీలకు పోష్టికాహారం అందించేందుకు ఈ ప్రత్యేక చర్యలు చేపడుతున్న క్రమంలో కోడి గుడ్లపై వస్తున్న ఆరోపణలకు కట్టడి చేసేందుకు రంగులు వేసి అంగన్వాడీ గుడ్లు అనేవిధంగా కనిపించేలా చర్యలు తీసుకుంది. గుడ్లు పక్కదారి పట్టకుండా ఉండేందుకు, రంగుల ముద్రలు వేయాలని నిర్ణయం తీసుకుంది. జోన్ నెంబర్‌తో ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగులను గుడ్లకు వేసేలా ఏర్పాట్లు చేసింది. నెలలో మూడు దఫాలుగా ఈ గుడ్లకు రంగులు వేసి పంపిణీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జోన్ల పరిధిలో కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించారు.

తొలి 10 రోజుల్లో పికాక్ బ్లూ, రెండో 10 రోజుల్లో రెడ్, మూడో 10 రో జుల్లో గ్రీన్ రంగుల ముద్రలు వేయాలని చెప్పింది. గుడ్డు బరువు, ఎత్తు, పొడవులకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను పేర్కొన్నది. ఆగ్మార్క్ నిబంధనలకు అనుగుణంగా గుడ్డు బరువు 45 నుంచి 52 గ్రాములు ఉండాలని స్పష్టం చేసింది. 10 గుడ్లను ఒక యూనిట్‌గా పరిగణిస్తే వాటి బరువు 450 గ్రాముల నుంచి 525 గ్రాములు ఉండాలని పేర్కొంది. గుడ్డు పగలకుండా తెలుపులో ఉండాలని సూచించింది. గుడ్డు 16 మిల్లీమీటర్ల డయామీటర్, 3 మిల్లీమీటర్ల ఎత్తు ఉండాలని స్పష్టం చేసింది. గుడ్లను సరఫరా చేసే సంస్థ గోదాముల్లో గుడ్డు నాణ్యతను తెలిపే ల్యాబ్ ఉండాలని.

ఎప్పటికప్పుడు పంపిణీ ప్రొటోకాల్‌కు అనుగుణమైన రిజిస్టర్లను నిర్వహించాలని సూచించింది. తక్కువ బరువు, నాణ్యత లేని గుడ్డును సరఫరా చేసే ఏజెన్సీ టెండర్‌ను రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికీ ఈ నిబంధనలన్నీ అమలు జరుగుతున్నా, నాసిరకం గుడ్లు రావడం వెనుక కారణాలు ఏమిటనే చర్చ జరుగుతోంది. కొన్ని చోట్ల స్టాపు వేసిన కోడి గుడ్లు బహిరంగ మార్కెట్‌లోకి వస్తున్నాయనే ప్రచారం జరిగింది. ఇంత పకడ్భంధీగా ప్రభుత్వం నిబంధనలు అమలు చేస్తున్నా నాసిరకం, చిన్న సైజు కోడి గుడ్లు రావడంపై లోతుగా దర్యాప్తు చేసి అంగన్వాడీల ద్వారా బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందించాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News