Monday, December 23, 2024

ఎల్‌నినోతో భారత్‌లో కరవు తప్పదా?

- Advertisement -
- Advertisement -

పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించగా దీని ప్రభావం వల్ల లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.వాతావరణంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుతుపవనాల రాకకు ఇంకా మూడు నెలల సమయం వున్నప్పటికీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఒక రకమైన కాలానుగుణ మార్పు. ఈ ఎల్‌నినో వల్ల శీతాకాలాలు కూడా వెచ్చగా ఉంటాయి. వర్షం లేకుండా వేసవి కాలం మరింత వేడిగా మారనుంది. ఇక అవి మాత్రమే కాదు, దాని వల్ల రుతుపవనాలు కూడా బలహీనంగానే ఉన్నాయి. గత 20 ఏళ్లలో సంభవించిన కరవులన్నీ ఎల్‌నినో సంవత్సరాల్లోనే సంభవించాయని ఎంకె గ్లోబల్ పరిశోధనా నివేదిక చెబుతోన్న క్రమంలో ఈ సంవత్సరం వ్యవసాయోత్పత్తులు తక్కువగా ఉండవచ్చని అంటున్నారు.

ఈ క్రమంలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని పరిశోధన నివేదికలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ మధ్య ఎల్‌నినో ప్రభావం 55 నుండి 60 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. ఎల్‌నినో, లానినా అనేవి వాతావరణ పరిస్థితులకు సంబంధించినవి అనే సంగతి చాలా మందికి తెలుసు. కానీ అవి నిర్దిష్టంగా ఎందుకు ఏర్పడుతాయనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి శాస్త్రవేత్తలకు కూడా పూర్తిగా వీటి గురించి క్లారిటీ లేదనడం అతిశయోక్తి కాదు. ఎల్‌నినో అంటే వర్షాభావ పరిస్థితి కాగా, లానినా అంటే విపరీతంగా వర్షాలు కురిసే పరిస్థితి అనే ఒక్క మాటలో చెప్పే వివరణ.ఎల్‌నినో అంటే పెరూ తీరంలో ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకోసారి పసిఫిక్ జలరాశి అనూహ్యంగా వేడెక్కే స్థితి. ఎల్‌నినో అనేది ఒక స్పానిష్ (లాటిన్) పదం. లాటిన్ భాషలో ఎల్‌నినో అంటే క్రీస్తు శిశువు జననం. దీని కారణంగా భారత, ఆగ్నేయ ఆసియా దేశాల్లో రుతుపవన వ్యవస్థ దెబ్బతిని వర్షపాత పరిమాణం తగ్గుతుంది.

గత మూడేళ్ళుగా పసిఫిక్‌పై వరుసగా లానినో పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ లానినో గత ఏడాది సెప్టెంబర్‌తో పూర్తయిపోయింది. ఇప్పుడు ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో భారత్‌లోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని ఇచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ ఎల్‌నినో 2027 వరకు కొనసాగుతుందని ఐరాస వాతావరణ విభాగం హెచ్చరించింది. దీని వల్ల భారత్ సహా చాలా దేశాల్లో కరవు పరిస్థితులు ఏర్పడవచ్చని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని హెచ్చరించింది.ఎల్‌నినో పరిస్థితి ఎన్నడూ ఒకేలా ఉండదు. ప్రతి ఎల్‌నినో విభిన్నమైందే. ఒక్కోటి ఒక్కోలా ప్రభావం చూపుతుంది. ఎల్‌నినోతో వరదలు, కరవులు సంభవించడమే కాదు వాతావరణం వేడెక్కడం మరో సమస్య. పసిఫిక్ ఉపరితలం అధికంగా వేడెక్కడం వల్ల వాతావరణంలోకి పెద్ద మొత్తంలో శక్తి విడుదలవుతుంది. ఫలితంగా తాత్కాలికంగా ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఎల్‌నినో సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణమిదే.

భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ఇది నిజంగా కలవరం కలిగించేదే. ఎల్‌నినో ఏర్పడినప్పుడు పగడపు దీవులకు తీవ్రనష్టం వాటిల్లుతుంది. 1998లో ఏర్పడిన ఎల్ నినో కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 16% పగడపు దీవులు నశించాయని అంచనా. 2015- 16లో వచ్చిన ఎల్‌నినో సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 75 -99 శాతం పగడాలు నశించాయి. ఎల్‌నినోతో కార్చిచ్చులు చెలరేగడం ఎక్కువవుతాయి. మహాసముద్రాలు వేడెక్కడం వల్ల నైరుతి రుతుపవనాల కదలికలు మందగించవచ్చు. ఫలితంగా వర్షాలు పడటం తగ్గుతుంది. గతంలో ఎల్‌నినో సంభించినప్పుడు కొన్నిసార్లు తీవ్ర క్షామం ఏర్పడింది. దీంతో పంటలకు నష్టం కలిగింది. ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. దేశంలో 2001- 20 మధ్య కాలంలో ఎల్‌నినో సంవత్సరాలను ఎదుర్కొంది. వీటిలో నాలుగు ఎల్‌నినో సంవత్సరాల్లో కరవు ఏర్పడింది. దీర్ఘకాల సగటు వర్షపాతంలో 90% తక్కువగా వర్షాలు కురిశాయి. ఈ సంవత్సరాల్లో ఖరీఫ్‌లో పంట దిగుబడి 16%, 8%, 10%, 3% చొప్పున తగ్గాయి. ద్రవ్యోల్బణానికి దారితీశాయి. దేశ వార్షిక ఆహార సరఫరాలో సుమారు సగం వాటా ఖరీఫ్ కాలంలో పండిన పంటలదే.

ఎల్‌నినో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ నమూనాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది సాధారణంగా ఆస్ట్రేలియాలో కరవు, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో వరదలు, అట్లాంటిక్ మహాసముద్రంలో పెరిగిన హరికేన్ కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉంటుంది. భారతలో ఎల్‌నినో దశలు సాధారణంగా, సాధారణం కంటే పొడిగా ఉండే నైరుతి రుతు పవనాలతో సంబంధం కలిగి ఉంటాయి. దేశ వ్యాప్తంగా వేడి గాలులు, కరవులు పెరిగాయి. వాతావరణంపై ఇటువంటి ప్రభావాలు పంటలు, పశువులకు నష్టం కలిగించవచ్చు. ఆహార కొరత, ద్రవ్యోల్బణం ఇవన్నీ భారత దేశ ఆర్థిక వ్యవస్థపై పరోక్షంగా ప్రభావం చూపుతాయి.ఎల్‌నినో పరిణామాలను ట్రాక్ చేయడానికి వాతావరణ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించడం, ముందస్తు ఉపశమన చర్యలు తీసుకోవడం, కరవు, హీట్‌వేవ్‌లు, ఇతర వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆకస్మిక ప్రణాళికలను అభివృద్ధి చేయడం, కొరతను ఎదుర్కొనే అవకాశం ఉన్న ప్రాంతాలకు ఆహారం, నీటిని పంపిణీ చేయడం, సంబంధిత నష్టాలు, సంసిద్ధతపై ప్రజలకు అవగాహన కల్పించడం భారత దేశం ఎల్‌నినోకు సిద్ధం కావడానికి కొన్ని మార్గాలు.

ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య విస్తరించి ఉండే పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ప్రత్యేక సముద్ర పవనాలు ఈ ఎల్‌నినో, లానినాలకు కారణం అవుతాయని అంచనా. పసిఫిక్ మహాసముద్రంలో, సాధారణ పరిస్థితుల్లో, గాలులు భూమధ్యరేఖ ద్వారా పశ్చిమంగా వీస్తాయి. అలా జరగడం వలన దక్షిణ అమెరికా నుండి వెచ్చని నీరు ఆసియా వైపు వస్తుంది. సముద్రపు లోతుల నుండి పైకి వచ్చే చల్లటి నీరు వెచ్చని నీటితో ప్రవహించే ఖాళీ స్థలాన్ని నింపుతుంది. అలాంటి ప్రాసెస్‌ను అప్‌వెల్లింగ్ అంటారు. ఎల్ నినో సహా లానినా ఈ పరిణామాన్ని నాశనం చేస్తాయి. మన దేశానికి లానినా ప్రభావం మంచిసూచన, అదే ఎల్‌నినో ప్రభావం ఉంటే జూన్ అక్టోబర్ మధ్య భారత దేశంలో రుతుపవనాలు ప్రభావితమవుతాయని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News