నిరసనోద్యమంలో పాల్గొంటున్న రైతులు ఢిల్లీకి తమ పాదయాత్రను శుక్రవారం నిలుపుదల చేసినట్లు, భద్రత సిబ్బంది ప్రయోగించిన బాష్పవాయు గోళాల వల్ల కొందరు రైతులు గాయపడిన తరువాత పాదయాత్రను సస్పెండ్ చేసినట్లు పంజాబ్ రైతు నాయకుడు ఒకరు వెల్లడించారు. ‘కొద్ది మంది రైతులు గాయాలకు గురైన దృష్ట్యా శుక్రవారానికి ‘జాతా’ను వెనుకకు పిలిపించాం’ అని శంభులో సర్వన్ సింగ్ పాంధెర్ తెలియజేశారు. హర్యానా భద్రత సిబ్బంది ప్రయోగించిన బాష్పవాయు గోళాల వల్ల నిరసనకారులైన ఐదారుగురు రైతులు గాయపడినట్లు రైతు నాయకుడు తెలిపారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి), రైతు రుణ బకాయీల మాఫీ, పెంచిన విద్యుత్ చార్జీల నుంచి రక్షణతో సహా వివిధ కోర్కెల సాధనకై రైతులు ‘ఢిల్లీ చలో’కు ఉపక్రమించారు. కాని పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభు వద్ద సమీకృతమైన రైతులపై బాష్పవాయువు ప్రయోగించారు.
ఈ సంఘటనలో ఇద్దరు రైతులు గాయపడ్డారు. ఒక ఆంగ్ల వార్తా సంస్థ పంచుకున్న వీడియోలో పోలీస్ బారికేడ్ వద్ద గందరగోళ దృశ్యాలు కనిపించాయి. బాష్పవాయు గోళాల నుంచి వెలువడిన తెల్ల పొగ నిరసనకారులైన రైతులను ఆవహించడం 73 సెకన్ల వీడియోలో కనిపించింది. బాష్పవాయువు ప్రభావానికి గురైన ఒక వృద్ధ రైతుకు తోటి నిరసనకారులు సపర్యలు చేశారు. రైతు సంఘాల రెండు ఫోరాలు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా (కెఎంఎం) ఒక సమావేశం అనంతరం తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తాయని ఆయన చెప్పారు. 101 మంది రైతుల ‘జాతా’ శుక్రవారం శంభు సరిహద్దు వద్ద తమ నిరసన ప్రదేశం నుంచి ఢిల్లీకి పాదయాత్ర ప్రారంభించింది. కానీ, హర్యానా భద్రత సిబ్బంది ఏర్పాటు చేసిన బహుళ అంచెల బారికేడ్ల వల్ల కొన్ని మీటర్ల దూరంలోనే జాతాను నిలిపివేశారు. నిరసనకారులైన రైతులను చెదరగొట్టేందుకు భద్రత సిబ్బంది అనేక రౌండ్లు బాష్పవాయు గోళాలు ప్రయోగించి, వారిని తమ నిరసన ప్రదేశానికి తిరిగి వెళ్లేలా చేశారు.
ముందుకు సాగవద్దని నిరసనకారులైన రైతులను హర్యానా పోలీసులు కోరి, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 163 కింద విధించిన నిషేధపు ఉత్తర్వును ఉటంకించారు. జిల్లాలో ఐదు, అంతకు మించి వ్యక్తులు చట్టవిరుద్ధంగా గుమిగూడడాన్ని అంబాలా జిల్లా అధికార యంత్రాంగం నిషేధించింది. ఇది ఇలా ఉండగా, రైతులు తమ పాదయాత్ర ప్రారంభించడానికి కొన్ని నిమిషాల ముందు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, రైతుల ఉత్పత్తులను ఎంఎస్‌పికి కొనుగోలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.