ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్షలు విధించడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ కేసు ఏడాదికి పైగా నడుస్తున్నదే. అయినప్పటికీ వీరికి ఉరి శిక్ష విధిస్తారని ఎవరూ ఊహించలేదు. ఈ ఎనిమిది మంది తమ ప్రాధాన్య అంశాలలో వున్నారని విదేశాంగ మంత్రి జైశంకర్ గత డిసెంబర్‌లో పార్లమెంటుకు హామీ ఇచ్చారు. సున్నితమైన వ్యవహారమైనందున ఓర్పు వహించాలని కోరారు. శిక్షలు పడిన తర్వాత స్పందించినప్పుడు కూడా విదేశాంగ శాఖ ఆచితూచి మాట్లాడింది. అయితే ఖతార్‌తో మనకు వున్నాయనుకొని భావిస్తున్న మంచి సంబంధాల నేపథ్యంలో వీరికి ఇంత పెద్ద శిక్షలు పడతాయని ఎవరూ అనుకోకపోడం సహజం. అక్కడి దహ్రా గ్లోబల్ టెక్నాటజీస్ అండ్ కన్సల్టెన్సీ అనే ప్రైవేటు సంస్థలో వీరు పని చేస్తూ వుండేవారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రధాన వ్యాపకం అని తెలుస్తున్నది. ఏ కారణమూ చెప్పకుండానే వీరిని 2022 ఆగస్టు 30న అరెస్టు చేసి తీసుకు వెళ్ళారు. ఈ విషయం గత ఏడాది సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అక్టోబర్‌లో అక్కడి మన రాయబారి జైల్లో వీరిని కలుసుకొన్నట్టు సమాచారం. జైల్లో ఒక్కొక్కరిని ఏకాంత ఖైదు చేయడం వారిపై గల ఆరోపణల తీవ్రతను తెలియజేస్తున్న అంశం.
బయటకు పొక్కిన సమాచారం ప్రకారం వీరు ఇజ్రాయెల్ తరపున గూఢచార కార్యకలాపాలకు పాల్పడ్డారనేది ప్రధాన అభియోగం. ఖతార్ నిర్మిస్తున్న ఒక జలాంతర్గామికి సంబంధించిన సమాచారాన్ని వీరు ఇజ్రాయెల్‌కు అందజేస్తూ వచ్చారన్నది వీరిపై మోపిన నేరారోపణగా భావిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. అయితే ఏ ఒక్కరి విషయంలోనో అటువంటి అభియోగం వుండడం వేరు, మొత్తం 8 మంది మీద ఈ ఆరోపణ విరుచుకుపడడం వేరు. ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వాల మధ్య వుండే సంబంధాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇటువంటి ఆరోపణల్లోని నిజానిజాలేమిటో కూడా స్పష్టంగా నిర్ధారించడానికి తగిన అవకాశాలు వుండవు. విదేశాల్లోని భారతీయుల రక్షణకు బాధ్యత వహించే విదేశాంగ శాఖ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ 8 మంది విడుదలకు కృషి చేయవలసి వుంది, సాధించవలసి వుంది కూడా. ఈ శిక్షలు పడతాయనే సంకేతాలు విదేశాంగ శాఖకు ఇంత వరకు అందకపోడం విడ్డూరమే. అలాగే గూఢచర్యం అభియోగం విషయం కూడా దానికి ఇప్పుడే తెలిసిందంటే ఆశ్చర్యపోవలసిందే. కాని ఏ కారణం వల్లనో అది గోప్యాన్ని పాటిస్తున్నది.
ఆచరణలో తగిన ఫలవంతమైన కృషి చేసి వీరి విడుదలను పొందగలిగితే అది చాలు. ఖతార్ జన సంఖ్య దాదాపు 27 లక్షలు. అందులో ఇంచుమించు 7 లక్షల మంది భారతీయులు. అంటే గణనీయమైన సంఖ్యలో వున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వున్న భారతీయులు ఖతార్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యులనే విషయం ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. అలాగే వీరు అక్కడి నుంచి పంపించే విదేశీ మారక ద్రవ్యం మనకు ఎంతో అవసరమైనది. ఈ రీత్యా రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడం కూడా ప్రధానం. ఖతార్ నుంచి మనం 14.9 బిలియన్ డాలర్ల ఆయిల్‌ను ఏటా దిగుమతి చేసుకొంటున్నాము. అలాగే ప్లాస్టిక్స్‌ను 700 మిలియన్ డాలర్ల మేరకు అక్కడి నుంచి తెచ్చుకొంటున్నాము. మన దగ్గరి నుంచి విలువైన వజ్రాలు మున్నగు వాటిని ఖతార్ దిగుమతి చేసుకొంటున్నది. యంత్ర పరికరాలు, అణు రియాక్టర్లను కూడా పొందుతున్నది. ఎలెక్ట్రికల్, ఎలెక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేస్తున్నది. ఇంత చక్కటి సంబంధాలున్న ఈ రెండు దేశాల మధ్య ఈ 8 మంది అధికారుల ఉరి శిక్ష అంశం అమృతంలో చిందిన విష బిందువు కాకూడదు.
అయితే తాజా పరిణామాల దృష్టా ఖతార్‌తో మనకు ఏ కొంచెమైనా విభేదాలు తలెత్తి వుంటాయా అనే ప్రశ్నకు ఆస్కారం కలుగుతున్నది. పాలస్తీనా విషయంలో తలెత్తిన ఇటీవలి పరిణామాల్లో ఇండియా వహించిన పాత్రను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవలసి వుంది. ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన అపూర్వమైన, అసాధారణమైన దాడి సందర్భంగా మన ప్రధాని మోడీ వ్యవహరించిన తీరు అరబ్ దేశాలకు అణుమాత్రమైనా అసంతృప్తిని కలిగించి వుంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయన హమాస్ దాడిని ఉగ్ర దాడిగా పరిగణించి తీవ్రంగా ఖండించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనతో మాట్లాడినప్పుడు ఆయనకు మద్దతు తెలిపారు. అయితే స్వతంత్ర పాలస్తీనా కోసం రెండు వైపుల వారు చర్చలు జరపాలనే తమ పూర్వపు వైఖరికి కట్టుబడి వున్నామని ఇండియా ప్రకటించింది. ఈ పరిణామాలు పాలస్తీనా సమస్య పట్ల భారత దేశం పాటిస్తూ వచ్చిన స్థిరమైన వైఖరికి భిన్నంగా వున్నాయి. అదేమైనప్పటికీ ఇచ్చిపుచ్చుకొంటున్న దేశంగా ఖతార్‌తో మనకున్న సంబంధాలను ఉపయోగించి ఈ 8 మంది అధికారులను కాపాడడానికి మన ప్రభుత్వం గట్టిగా కృషి చేయవలసి వుంది.