Wednesday, January 22, 2025

సిసోడియా అరెస్టును ఖండిస్తూ మోడీకి ఎనిమిది ప్రతిపక్షాల లేఖ!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సహా తొమ్మిది ప్రతిపక్షాల నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర సంస్థలను ప్రతిపక్షాలపై ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. లేఖపై సంతకాలు చేసిన వారిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్(ఆర్జెడి), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, శివసేన(యుబిటి) నాయకుడు ఉద్ధవ్ థాక్రే, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఉన్నారు.
లేఖలో వారు ‘ప్రతిపక్ష పార్టీ సభ్యులపై కేంద్ర సంస్థలను దుర్వినియోగపరుస్తున్నారు. మనం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వానికి పయనించినట్లుగా ఉన్నది. కేంద్ర సంస్థలను, గవర్నర్‌లను దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ఖండనీయం, ప్రజాస్వామ్యానికి మంచిదికాదు’ అని పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయంటూ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు చేయడాన్ని వారు హైలైట్ చేశారు. ఆప్ నాయకుడిపై పెట్టిన ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ కుట్రపూరితమైనవని వారు పేర్కొన్నారు. ఢిల్లీ పాఠశాల విద్యను మార్చినందుకు సిసోడియా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని వారు పేర్కొన్నారు. బిజెపి నిరంకుశ ధోరణి కారణంగా భారత్‌లో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయని వారు ఆరోపించారు. బిజెపిలో చేరిపోయిన ప్రతిపక్ష రాజకీయవేత్తల విషయంలో దర్యాప్తు నెమ్మదించిపోతుందన్నారు. అందుకు ఉదాహరణగా వారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, టిఎంసి నాయకులు సువేందు అధికారి, ముకుల్ రాయ్ విషయాన్ని పేర్కొన్నారు.

2014 నుంచి సిబిఐ, ఇడి దాడులు పెచ్చరిల్లాయని, ప్రతిపక్ష నాయకులను వేధించడానికి మాత్రమే వాటిని చేపడుతున్నారని, ఉదాహరణకు లాలూ ప్రసాద్ యాదవ్(ఆర్‌జెడి), సంజయ్ రౌత్(శివసేన), ఆజం ఖాన్(సమాజ్‌వాదీ పార్టీ), నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్(ఎన్‌సిపి), అభిషేఖ్ బెనర్జీ(టిఎంసి)లను పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల వైఖరి అనుమానస్పదంగా ఉంటోందన్నారు. వాస్తవానికి కేంద్ర పరిశోధన సంస్థలను దుర్వినియోగం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.

కేంద్ర పరిశోధన సంస్థలు చేయల్సింది చేయకుండా దృష్టిని మళ్లిస్తున్నాయని, ఓ సంస్థ కారణంగా షేర్ మార్కెట్‌లో ఎస్‌బిఐ, ఎల్‌ఐసి దాదాపు 78000 కోట్లు నష్టపోయాయని వారు ఆరోపించారు. తమిళనాడు, మహారాష్ట్ర,పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీలో గవర్నర్లు వారి అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని కూడా ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. గవర్నర్లు రాజ్యాంగ విరుద్ధంగా కొన్నిసార్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News