ఒక్క రోజే 89 వేలకు పైగా కేసులు, 714 మరణాలు
మహారాష్ట్రలోనే సగానికి పైగా కేసులు
అయిదు రాష్ట్రాల్లోనే 86 శాతం మరణాలు
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. శుక్రవారం ఒక్క రోజే 89 వేలకు పైగా కేసులు నమోదు కాగా .. వీటిలో 81.42 శాతం కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా 47,913 కేసులు నమోదు కాగా, కర్నాటకలో 4,991 కేసులు, చత్తీస్‌గఢ్‌లో 4,174 కేసులు, ఢిల్లీ 3594కేసులు, తమిళనాడు 3,290, ఉత్తరప్రదేశ్ 2953, పంజాబ్ 2,873, మధ్యప్రదేశ్ 2,777 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కేంద్రప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు 6, 58,909 యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో 3.91 లక్షల కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉండడం గమనార్హం. ఇక్కడ ఫిబ్రవరి నాటికి 42,830గా ఉన్న యాక్టివ్ కేసులు ఏప్రిల్ 3 నాటికి తొమ్మిది రెట్లు పెరిగాయి. అలాగే కర్నాటకలో ఆరు రెట్లు, చత్తీస్‌గఢ్‌లో 8 రెట్లు, పంజాబ్‌లో 12 రెట్లు, ఢిల్లీలో10 రెట్లు ఎగబాకాయి. మరోవైపు క్రియాశీల కేసుల్లో 77.3 శాతం కేసులు మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌గఢ్, కేరళ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 59.36 శాతం కేసులు ఉన్నాయి.
యాభైశాతం క్రియాశీల కేసులు 10 జిల్లాల్లోనే
దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో 50 శాతం కేవలం పది జిల్లాల్లోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల్లో 10.75 శాతం పుణెలో ఉండగా, ముంబయి 8.75 శాతం, నాగ్‌పూర్ 7.71 శాతం, ఠానే 6.83 శాతం, నాసిక్ 5.66 శాతం, బెంగళూరు అర్బన్ 3.73 శాతం, ఔరంగాబాద్ 2 శాతం, ఢిల్లీ 1.82 శాతం, అహ్మద్‌నగర్ 1.74 శాతం, నాందేడ్ 1.67 శాతం కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
13 రాష్ట్రాల్లో మరణాలు లేవ్
మరో వైపు భారత్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 714 మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇవి కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితం కావడం ఉపశమనం కలిగించే అంశం. కొత్తగా నమోదైన మరణాల్లో 86 శాతం మరణాలు కేవలం 5 రాష్ట్రాల్లోనే ఉండడం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 481 మరణాలు నమోదు కాగా, పంజాబ్‌లో 57, చత్తీస్‌గఢ్‌లో 43, యుపి, మధ్యప్రదేశ్‌లలో 16 చొప్పున మరణాలు నమోదయ్యాయి. మరో వైపు 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదు.
ఈ జాబితాలో ఒడిశా, అసోం, లడఖ్, దాద్రా, నాగర్ హవేలి, దామన్, డయ్యు, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, సిక్కిం, లక్షద్వీప్, మిజోరం, అండమాన్, నికోబార్ దీవులు, అరుణాచల్‌ప్రదేశ్ ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 24,69,59,192 శాంపిళ్లను పరీక్షించగా, 1,23,92,260 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 1,15,69,241 మంది కోలుకోగా, 1,64,110 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 6,58,909 క్రియాశీల కేసులున్నాయి. దేశంలో రికవరీ రేటు 93.36 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.32 శాతంగా ఉంది. శుక్రవారం ఒక్క రోజే 10,46,605 శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసిఎంఆర్ తెలిపింది. మరో వైపు దేశంలో ఇప్పటివరకు 7.3 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Eight States Account 81.42 Percent Covid Cases