కర్నాటక గవర్నర్‌గా కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లోట్
మధ్యప్రదేశ్‌కు మంగూభాయ్ పటేల్
మిజోరాం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు
దత్తాత్రేయ హర్యానాకు బదిలీ
న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గ పునర్వవస్థీకరణ త్వరలో జరగనుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్న తరుణంలో మంగళవారం 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులైనారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించగా, మరో నలుగురు గవర్నర్లను బదిలీ చేశారు. కేంద్రమంత్రి థావర్‌చంద్ గెహ్లోట్‌ను కర్నాటక గవర్నర్‌గా నియమించారు. 2014నుంచి రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న వజూభాయ్ వాలా స్థానంలో గెహ్లోట్‌ను నియమించారు. కాగా ఆంధ్రప్రదేశ్ బిజెపి సీనియర్ నాయకుడు కంభంపాటి హరిబాబును మిజోరాం గవర్నర్‌గా నియమించారు. మిజోరం గవర్నర్‌గా ఉన్న పిఎస్ శ్రీధరన్ పిళ్లైను గోవా గవర్నర్‌గా బదిలీ చేశారు.
అలాగే మధ్యప్రదేశ్‌కు మంగూభాయ్ ఛగన్‌భాయ్‌పటేల్, హిమాచల్‌ప్రదేశ్‌కు రాజేంద్రన్ విశ్వనాథ్ అర్లేకర్‌ను గవర్నర్లుగా నియమించారు. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హిమాచల్ గవర్నర్‌గా ఉండిన బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్‌గా బదిలీ చేశారు. హర్యానా గవర్నర్‌గా ఉండిన సత్యదేవ్ నారాయణ్ ఆర్యను త్రిపుర గవర్నర్‌గా బదిలీ చేశారు. ఇప్పటివరకు త్రిపుర గవర్నర్‌గా ఉండిన రమేశ్ బైన్స్‌ను పదవీ కాలం పూర్తయిన ద్రౌపది ముర్ము స్థానంలో జార్ఖండ్ గవర్నర్‌గా బదిలీ చేశారు. గవర్నర్లుగా నియమితులైన వారు బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి వారి నియామకాలు అమలులోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది.
దత్తన్నకు హర్యానా సిఎం ఖట్టర్ అభినందనలు
హర్యానా గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అభినందనలు తెలియజేశారు. దత్తాత్రేయ మార్గదర్శకత్వంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని, ప్రజలు, సుఖ సంతోషాలతో జీవిస్తారన్న ఆశాభావాన్ని ఖట్టర్ వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు.