టన్నెల్ బోరింగ్ సమయంలో 9మీటర్ల మేర కూలిన పైకప్పు ప్రమాదానికి
సీపేజ్ వాటరే కారణం సురక్షితంగా బయటపడిన 42మంది కార్మికులు
సొరంగంలో చిక్కుపడిన వారిలో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దర మిషన్ ఆపరేటర్లు,
నలుగురు కూలీలు వీరంతా యుపి, జార్ఖండ్, జమ్మూకశ్మీర్‌కు చెందిన వారు
సొరంగం లోపల 14కి.మీ దూరంలో దుర్ఘటన క్లిష్టంగా మారిన సహాయక
చర్యలు సిఎం ఆదేశాలతో హుటాహుటిన ఘటన స్థలికి చేరిన మంత్రులు
ఉత్తమ్, జూపల్లి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలతో రెస్కూ ఆపరేషన్
రంగంలోకి దిగిన రెండు బృందాలు త్వరలో మరో 150మంది
నిపుణుల రాక సిఎం రేవంత్‌కు ప్రధాని ఫోన్ అన్నిరకాల సహాయం
అందిస్తామని హామీ ప్రమాదానికి సిఎందే బాధ్యతన్న కెటిఆర్
టన్నెల్‌లో చిక్కుకున్న వారిలో జయప్రకాష్ అసోసియేట్ కంపెనీకి చెందిన ప్రాజెక్టు ఇంజినీర్, ఉత్తరప్రదేశ్ , బంగర్‌మావు గ్రామానికి చెందిన మనోజ్ కుమార్, పర్సంద్ మోహన్పూర్ మాటి గ్రామానికి చెందిన ఫీల్డ్ ఇంజనీర్ శ్రీనివాస్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు మేఘక్సెన్, అనూజ్ సాహు, సం తోష్ సాహు, రాబిన్స్ కంపెనీకి చెందిన జనరల్ ఆపరేటర్ జమ్మూ కాశ్మీర్ వాసి సన్నీ సింగ్, అదే కంపెనీకి చెందిన పంజాబ్ రా ష్ట్రానికి చెందిన గురుప్రీత్ సింగ్ అనే ఆపరేటర్ తదితరులు ఉన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, దోమలపెంట వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బిసి) టన్నెల్ నిర్మాణంలో శనివారం ఉదయం అపశృతి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం ఉదయం 50 మంది కార్మికులు ప్రాజెక్టు ఇంజనీర్లు ఫీల్డ్ ఇంజినీర్లు 14 కిలోమీటర్ల దూరంలోని సొరంగంలోకి బోరింగ్ టన్నెల్ పనుల నిమిత్తం వెళ్లారు. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు వెళ్లిన కార్మికులు, ఇంజినీర్లు టన్నెల్ బోరింగ్ మిషన్‌ను స్టార్ట్ చేసి పనికి ఉపక్రమించిన కొద్ది సేపటికే టిబిఎం మిషన్ వెనకాల సిఫేస్ వాటర్ కారణంగా మట్టి పిల్లలు జారుతున్న విషయాన్ని టిబిఎం మెషీన్ టెక్నికల్ ఇంజనీర్, ఆపరేటర్లు గుర్తించారు.
వెంటనే వెనకాల ఉన్న కార్మికులు ఇతర సిబ్బందిని హెచ్చరించడంతో వారు పరుగులు పెట్టారు. కొద్దిసేపటికే సుమారు తొమ్మిది మీటర్ల మేర సొరంగం కూలిపోవడంతో టన్నెల్ బోరింగ్ మిషన్ వద్ద పనిచేస్తున్న ఎనిమిది మంది చిక్కుకున్నారు. ఆ సమయంలో మట్టిపెళ్లలు ఊడిపడడం, దుమ్ము, ధూళితో సొరంగ మార్గం అంతా కార్మికులు, సిబ్బంది హా..హా..కారాలతో మిన్నంటింది. ఎలాగోలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 42 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది పరిస్థితి పైనే సర్వత్రా ఆందోళన నెలకొంది.
సొరంగంలో చిక్కుకున్న వారు వీరే ..
టన్నెల్ బోరింగ్ సమయంలో చిక్కుకున్న వారిలో జయప్రకాష్ అసోసియేట్ కంపెనీకి చెందిన ప్రాజెక్టు ఇజినీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బంగర్‌మావు గ్రామానికి చెందిన మనోజ్ కుమార్, ఫర్శన్డ్ మోహన్పూర్ మాటి గ్రామానికి చెందిన ఫీల్డ్ ఇంజనీర్ శ్రీనివాస్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు మేఘక్సెన్, అనూజ్ సాహు, సంతోష్ సాహు, రాబిన్స్ కంపెనికి చెందిన జనరల్ ఆపరేటర్ జమ్మూ కాశ్మీర్ వాసి సన్నీ సింగ్, అదే కంపెనీకి చెందిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన గురుప్రీత్ సింగ్ అనే ఆపరేటర్ కూడా సొరంగంలో చిక్కుకున్న వారిలో ఉన్నారు.
ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలతో రెస్కూ ఆపరేషన్
జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలతో సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. శనివారం సాయంత్రం నాటికి రెండు బృందాలతో రెస్కూట టీం సభ్యులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. శనివారం రాత్రికి మరో 150 మందితో కూడిన బృందం ఘటనా స్థలానికి చేరుకుంటుందని అధికారులు, మంత్రులు తెలిపారు. సంఘటనా స్థలానికి అధునాతన అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచారు.
ఎస్‌ఎల్‌బిసి ఘటన దురదృష్టకరం ః మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్‌లో జరిగిన ఘటన దురదృష్టకరమని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అన్నారు. సొరంగంలో ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు దోమలపెంట వద్దకు చేరుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఎస్‌ఎల్‌బిసి పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల కలెక్టర్‌లు వివిధ శాఖల అధికారులు, టన్నెల్ బోరింగ్ పనులు చేపడుతున్న రాబిన్ ఇండియా, జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ కంపెనీల ప్రతినిదులు, ఇంజనీర్లతో సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. రెస్కూ ఆపరేషన్ వెంటనే చేపట్టే విధంగా అధికారులతో కలిసి దిశానిర్దేశం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..
ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌లో ఈ తరహా సంఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ తవ్వకాలలో ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకుని హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్నారు. సంఘటన స్థలిని పరిశీలించడంతో పాటు లోపల చిక్కుకున్న వారిని కాపాడడం కోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకుగాను దోమలపెంటలోని జెపి గెస్ట్ హౌస్‌లో సహచర మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి అగ్నిమాపక, రిస్కూ టీం డిజి నారాయణ రావు, ఐజి సత్యనారాయణ నాగర్‌కర్నూల్ కలెక్టర్‌తో పాటు రాబిన్ సంస్థకు చెందిన లెన్ మైనార్టీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సొరంగంలో చిక్కుకున్న మిగిలిన 8 మందిని సురక్షితంగా కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తోందన్నారు.
అందుకోసం ఇప్పటికే సింగరేణికి చెందిన రెస్కూ టీంలు రంగంలోకి దిగాయని, ఆర్మీకి చెందిన రెస్కూ టీంలతో తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడామని, ఈ రాత్రి వరకు ఆ టీం ఇక్కడికి చేరుకుంటుందని వెల్లడించారు. అంతేకాకుండా టన్నెల వద్ద ప్రమాదాలు సంభవించినప్పుడు రంగంలోకి దిగి కాపాడే టీంలతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. ఈమధ్యకాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ తరహా సంఘటన చోటుచేసుకున్నప్పుడు రంగంలోకి దిగి ప్రాణాప్రాయం లేకుండా కాపాడిన టీంను కూడా రంగంలోకి దింపనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలతో పాటు ఉన్నత స్థాయి ప్రభుత్వ యంత్రాంగం ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తూ సమష్టి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. అగ్నిమాపక డిజి నారాయణ రావు ఆధ్వర్యంలో రెస్కూ టీం పనిచేస్తుండగా ఐజి సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయని అన్నారు. ఇప్పటికే వైద్య బృందం అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచామన్నారు.
నీటి పారుదల శాఖాధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారికి కాపాడేందుకు చేపడుతున్న చర్యలను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. కాగా, వెంటిలేషన్‌కు ఇబ్బంది లేదన్నారు. టన్నెల్ తవ్వకంలో రాబిన్ సంస్థ ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్నదని అన్నారు. లోపల చిక్కుకున్న ఆ 8 మందిని సురక్షితంగా కాపడడమే ప్రభుత్వం ముందున్న సవాల్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న ఆ 8 మందిలో ప్రాజెక్టు ఇంజినీర్, సైట్ ఇంజనీర్‌తో పాటు ఇద్దరు మిషన్ ఆపరేటర్లు నలుగురు వర్కర్లు ఉన్నారని వివరించారు. వారి వివరాలను ఆయన మీడియాకు అందించారు. మనోజ్ కుమార్ (పిఈ) ఉత్తరప్రదేశ్, శ్రీనివాస్ (ఎఫ్‌ఈ) ఉత్తరప్రదేశ్, సందీప్ సాహు (కార్మికుడు) జార్ఖండ్, జటాక్స్ (కార్మికుడు) జార్ఖండ్, సంతోష్ సాహు (కార్మికుడు) జార్ఖండ్, అనూజ్ సాహు (కార్మికుడు) జార్ఖండ్, సన్నీ సింగ్ (కార్మికుడు) జమ్మూ కాశ్మీర్, సన్నీ సింగ్ (కార్మికుడు) పంజాబ్ టన్నెల్ తవ్వకాలు మొదలు పెట్టిన ఏజెన్సి నిర్వాహకులు చెప్పే కథనం ప్రకారం..
అకస్మాత్తుగా లోపటికి నీరు, మట్టి 8 కిలోమీటర్ల మేర రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని భావించాల్సి ఉందన్నారు. రోజు వారీగా పని మొదలు పెట్టినట్లే ఈ ఉదయం 8 గంటలకు పని మొదలు పెట్టిన 30 నిమిషాలలోపే ఈ సంఘటన ఉత్పన్నమవడంతో వెంటనే నిర్వాహకులు పనిని నిలిపివేసి బయటకు రావడంతో పాటు వీలున్నంత వరకు సిబ్బందిని బయటకు తీసుకువచ్చారన్నారు. ఏదైతే టన్నెల్ బోరు మిషన్ టన్నెల్ బోరింగ్ మిషన్ వద్ద పని మొదలు పెట్టారో అక్కడికి నీరు, మట్టి చేరుతుండడంతో పాటు ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో మిషన్ మీద ఉన్న వారు వెనుక భాగంలో ఉన్న వారు బయటికి రాగలిగారని మిషన్ ముందు భాగంలో ఉన్న వారు అందులో చిక్కుకున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యల్లో వేగం పెంచాలి. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. సహాయక చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సహాయక చర్యల కోసం వెంటనే ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని పంపిస్తాం. అవసరమైన అన్ని రకాల సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.
సిఎంకు ఫోన్‌లో మోడీ