Monday, December 23, 2024

మసీదుల తవ్వకంపై కేంద్రం వైఖరి?

- Advertisement -
- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే వారం దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకోవడానికి బిజెపి శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా దేశంలో అభివృద్ధి గతినే మార్చివేశామని అంటూ తమ ప్రభుత్వ విజయాలపై, ముఖ్యంగా ప్రధాని మోదీ ౠఅసాధారణ’ నాయకత్వ లక్షణాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
అయితే ఈ సందర్భంగా కీలకమైన పలు సున్నితమైన అంశాలపై, దేశాన్ని వేధిస్తున్న పలు సమస్యలపై, రాగాల ప్రమాదాలపై ఈ ప్రభుత్వం కప్పదాటు వైఖరి వేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. ఆర్థికపరమైన సంక్షోభాన్ని అటుంచితే, ఆర్టికల్ 370 రద్దు చేసి, రాష్ట్ర హోదాను తీసివేసి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అంటూ ప్రభుత్వ ఘనవిజయాలతో ఒకటిగా పేర్కొంటున్నారు.
అయితే అక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా ౠలక్షిత దాడులు’ వరుసగా జరుగుతున్నాయి. నేరుగా బాధ్యత వహించవలసిన ప్రధాని గాని, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గాని అటువంటి దాడులపై పెదవి విప్పడం లేదు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని చెప్పుకొంటున్నా మరింత బలంగా పాతుకు పోయే ప్రయత్నం జరుగుతూ ఉండడం, కాశ్మీర్ లోయను ౠతాలిబన్ వాదం’తో ముంచెత్తే ప్రయత్నం జరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ఒక విధంగా ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. కేవలం భద్రతాదళాలుకు అప్పగించి కళ్లప్పగించి చూస్తున్నది. గతంలో రాజీవ్ గాంధీ నుండి మన్మోహన్ సింగ్ వరకు కేంద్ర మంత్రివర్గంలో సీనియర్ మంత్రి ఒకరిని కాశ్మీర్ వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేకంగా కేటాయించేవారు. కానీ ఇప్పుడు కొందరు రిటైర్డ్ అధికారులకు బాధ్యతలు అప్పజెప్పడం వల్లనే అక్కడ పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని గ్రహించాలి. ఇటువంటి జటిల సమస్యలకు రాజకీయ పరిష్కారాలు మాత్రమే మార్గం చూపగలవు.
ఇదే సమయంలో, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్టెక్స్‌లో జరిపిన సర్వేలో శివలింగం కనిపించినట్లు జరుగుతున్న ప్రచారం దేశంలో మతపరమైన ఉద్రిక్తలకు దారితీస్తుంది. ఈ విషయంలో తమ వైఖరిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వహిస్తూ ఉండడం గమనిస్తే ఉద్దేశ్యపూర్వకంగా 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే భావోద్వేగాలను పెంపొందించేందుకు అవకాశం కల్పిస్తున్నారా? అనే అనుమానాలు పలు వర్గాలలో కలుగుతున్నాయి.
ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు చేస్తున్న ప్రసంగాలు గమనిస్తే ఈ ప్రభుత్వంకు ఓ స్పష్టమైన విధానం ఉందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. “దేశంలో 36 వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను కట్టారు. ఏ మసీదును తవ్వినా శివలింగాలు బయటపడుతున్నాయి. కాశీలోని మసీదులోనూ ఇదే జరిగింది. తెలంగాణలోనూ మసీదులను తవ్వితే శివలింగాలు కనిపిస్తాయి. ఆ తవ్వకాల్లో శివలింగం కనిపిస్తే ఆ ప్రాంతం మాది (హిందువులది). శవాలు కనిపిస్తే మీది (ముస్లింలది). మసీదులు తవ్వేందుకు సిద్ధమేనా” అంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు.
దేశాన్ని పాలించిన మొఘలులు 36,000 దేవాలయాల్ని కూల్చివేశారని, బిజెపి ప్రభుత్వం వాటన్నిటినీ తిరిగి స్థాపిస్తుందని కర్ణాటకలో అవినీతి ఆరోపణలతో మంత్రి పదవి కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి కేఈ ఈశ్వరప్ప చెబుతున్నారు. టిప్పు సుల్తాన్ రాజధానిగా చేసుకున్న మాండ్యలోని జామియా మసీదు అంశాన్ని లేవనెత్తారు కేఈ. హనుమంతుడి గుడి ఉన్న ప్రాంతంలో విగ్రహాలను పక్కకు జరిపి మసీదు కట్టారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటి? అయోధ్యలో రామాలయం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన దశాబ్దాల కాలంలో బిజెపి అగ్ర నాయకులతో పాటు దేశంలో హిందూ సంస్థల నాయకులు ఓ మాట అనేవారు. హిందువులకు అయోధ్య, కాశి, మధుర ముఖ్యమైన ప్రార్థన స్థలాలని, ఆ మూడు చోట్ల తమను దేవాలయాలు నిర్మించుకోదలిస్తే మిగిలిన మసీదుల జోలికి వెళ్ళమని భరోసా ఇస్తూ వచ్చారు.
వాస్తవానికి మధురలో హిందూ – ముస్లింల మధ్య సయోధ్య స్వతంత్రం వచ్చిన కొత్తలోనే కుదిరి, మసీదు ఆధీనంలో ఉన్న స్థలంలోనే ఆలయం నిర్మించుకున్నారు. మధుర విషయమై కోర్టు వివాదం విషయంలో సహితం ఆర్ ఎస్ ఎస్ అధినేత డా. మోహన్ భాగవత్ తమ వైఖరిని స్పష్టం చేశారు. అయోధ్య ఉద్యమంతో తమ సంస్థ సుదీర్ఘకాలం కలసి పనిచేసిన నేపధ్యం వేరని, మధుర విషయంలో ఆ విధంగా జరగదనే సంకేతం ఇచ్చారు.
చరిత్రలో అనేక అకృత్యాలు జరిగాయి. వాటన్నింటిని ఇప్పుడు తిరగదోడుతూ ఉంటె ముందడుగు వేయడం కష్టం కాగలదు. అయోధ్యలో సహితం నాటి రాజకీయ పక్షాలు అనుసరించిన ముస్లిం సంతుష్టి ధోరణుల కారణంగానే హిందువులలో అసహనం చెలరేగి పరిస్థితులు తీవ్రతను సంతరింప చేసుకున్నాయి. హిందువులు శాంతియుత పరిష్కారమే కోరుకున్నారు. పివి నరసింహారావు హయాంలో ౠవివాదం’ను సుప్రీం కోర్టుకు నివేదించి, కోర్ట్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని హిందూ, ముస్లిం పక్షాలు అంగీకరించాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వం సమస్యను సుప్రీం కోర్టుకు నివేదించింది. అయితే ఇంతలో స్వార్థపర రాజకీయాలు ప్రవేశించి, ఉద్రిక్తలు సమసిపోతే తమ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతినగలవని భావించి, పరిస్థితుల తీవ్రతకు కారణమయ్యారు.
కోర్టుకు నివేదించడాన్ని ముస్లింలు వ్యతిరేకించేటట్లు చేయడంతో, కేంద్ర ప్రభుత్వం వత్తిడులకు లొంగి కోర్టు నుంచి తమ అఫిడవిట్ ను ఉపసంహరించుకుంది. ఈ పరిణామం హిందువులలో ఆగ్రవేశాలు కలిగించింది. వారిలోని నిస్సహాయత ఒక విధంగా తీవ్రమైన చర్యలకు దారితీసింది. చివరకు 1991 డిసెంబర్ 6 నాటి సంఘటనలకు దారితీసింది.
కానీ ఇప్పుడు కేంద్రంలో ఒక బలమైన ప్రభుత్వం ఉంది. చొరవ తీసుకొని సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించే సామర్థ్యం ఉంది. కానీ అటువంటి ప్రయత్నం జరగడం లేదు. దేశంలో 36 వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారని అంటున్నారు. చారిత్రక వాస్తవాలను ఇప్పటి వరకు కప్పిపుచ్చే ప్రయత్నం ఉద్దేశ్య పూర్వకంగా జరిపి, వాస్తవాలు ప్రజలకు తెలియకుండా చేసే ప్రయత్నం జరిగింది.
కానీ దేశంలో వేలకొలది బౌద్ధ ఆరామాలను కూడా ధ్వంసం చేసి దేవాలయాలు నిర్మించిన ఆరోపణలు ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన పూరిలోని స్వామి జగన్నాధ ఆలయం ఓ బౌద్ధ ఆరామం అని స్వయంగా స్వామి వివేకానంద తన గ్రంధాలలో వ్రాసారు. ఆ విధంగా దేశంలో అనేక ఆలయాలపై ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు బౌద్దులు ఎవ్వరు ఆ విధంగా దేవాలయాలను ధ్వంసం చేసి బౌద్ధ ఆరామాలను పునరుద్దరించాలని కోరుకోవడం లేదు.
కీలక పదవులలో ఉన్న రాజకీయ నాయకులు ఇటువంటి ధార్మిక పరమైన అంశాలకు దూరంగా ఉండడం ద్వారానే ఈ విధమైన సమస్యలకు శాంతియుత పరిష్కారం సాధింపగలరు. అయోధ్య అంశంలో రాజకీయ ప్రయోజనం పొందేందుకు బిజెపి ప్రయత్నించడం వల్లనే అక్కడ ఆలయ నిర్మాణం కనీసం దశాబ్దకాలం ఆలస్యం అయిందని ఈ సందర్భంగా గ్రహించాలి.
అయోధ్యలో ఆలయం కోసం విశ్వహిందూ పరిషత్ దశాబ్ద కాలం పాటు జాతీయ స్థాయిలో ఉధృతంగా ఉద్యమం జరిపినప్పుడు బిజెపి ఏనాడూ మద్దతు ప్రకటించ లేదు. కానీ ఆ ఉద్యమం పతాకస్థాయికి చేరుకున్న సమయంలో నాటి బిజెపి అధ్యక్షుడు ఎల్ కె అద్వానీ రథయాత్ర చేపట్టడంతో ఆ ఉద్యమంకు రాజకీయ రంగు ఏర్పడింది. అప్పటివరకు దేశంలో రాజకీయాలకు అతీతంగా ఆలయ ఉద్యమంపై ప్రజలు మద్దతు ప్రకటిస్తూ రావడం గమనార్హం. చాలామంది అద్వానీ రథయాత్ర జరపడం వల్లననే అక్కడ రామాలయం నిర్మాణం జరుగుతున్నదని ఇప్పుడు భావిస్తున్నారు. కానీ రథయాత్ర ద్వారా ఓ ప్రజా నాయకుడిగా ఎదిగే ప్రయత్నం అద్వానీ చేశారు. ప్రధాన మంత్రి పదవికి తాను బలమైన అభ్యర్థిని అనే సంకేతం ఇచ్చారు.
వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు శాంతియుతంగా పరిష్కారం కనుగొనడం కోసం జయేంద్ర సరస్వతి స్వామి నేతృత్వంలో హిందూ- ముస్లింల మధ్య సమాలోచనలు జరిపించారు. అయితే పరిష్కారం కుదిరితే వాజపేయికి ఎక్కడ పేరొచ్చి, తనకు ప్రధాని అయ్యే అవకాశం పోతుందో అనే భయంతో అద్వానీ హోమ్ మంత్రిగా స్వామీజీల మధ్యనే చీలికలు వచ్చేటట్లు చేసి, ఆ చర్చలు విఫలం అయ్యేందుకు తన వంతు పాత్ర పోషించారు.
ములాయం సింగ్ యాదవ్ సహితం ఇంత ఘోరంగా వ్యవహరిమ్చలేదని అంటూ ఆ సమయంలో ఓ ప్రముఖ నేత ఆగ్రహాన్ని వ్యక్తిగత సంభాషణలలో వ్యక్తం చేశారు. దేశ స్వతంత్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న సమయంలో సంకుచిత రాజకీయాలు మరోమారు మత ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించడం ద్వారా స్పష్టమైన విధానం రూపొందించాలి. అంతేగాని ఎక్కడికక్కడ ఉద్రిక్తలు కలిగేందుకు అవకాశం కల్పించరాదు. నేడు కాశ్మీర్ లోయాలో తాలిబన్ వాదం బలపడేందుకు జరుగుతున్న ప్రయత్నం రాగాల ప్రమాదకర ధోరణులను హెచ్చరిస్తున్నదని గ్రహించి, మేల్కొనాలి.

-చలసాని నరేంద్ర

Eight years of BJP Govt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News