Monday, December 23, 2024

నోట్ల రద్దుకి ఎనిమిదేళ్ళు

- Advertisement -
- Advertisement -

నేటికి నోట్ల రద్దు నిర్ణయం వచ్చి ఎనిమిది ఏళ్ళు గడిచింది. 2016 నవంబరు 8వ తారీఖున రాత్రి 8 గంటలకు ప్రధాన మంత్రి జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ప్రకటన వచ్చినప్పుడు అందరూ విషయం ఏమిటా అని ఆసక్తిగా చూశారు. ఆ చారిత్రక ప్రసంగంలో చావుకబురు చల్లగా చెప్పారు. ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తరువాత ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు చెల్లవు అని! ప్రజలకు అప్పుడు అర్ధమైందో లేదో కానీ తెల్లవారి పత్రికలు చూశాక విషయం అర్ధమైంది. అప్పటి దాకా చెలామణీ లో వున్న ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు ఇకపై చెల్లు బాటు కావు అని అర్ధమైనాక బీద బిక్కి చేసిన ఆర్తనాదాలు నేడుకూడా చెవుల్లో మార్మోగుతున్నాయి. ప్రధాన మంత్రి ముచ్చటగా మూడు కారణాలు చెప్పారు ఆ నిర్ణయం తీసుకోవడానికి. ఒకటి అవినీతిని అరికట్టడం, రెండు నల్లధనాన్ని నియంత్రించడం, మూడు ఉగ్రవాదాన్ని రూపుమాపడం. నోట్ల రద్దు ప్రభావం తెలుసుకోవడానికి కేవలం 50 రోజుల వ్యవధి ఇవ్వమని ప్రజలను అడిగారు ప్రధాన మంత్రి. ఆ కాలంలో ఆయన చెప్పిన మార్పులు రాకపోతే ఏదో చెయ్యమన్నారు. అటువంటి 50 రోజులు ఈ ఎనిమిది ఏళ్లలో యాభైకి పైనే గడిచినవి.

అదేయో చిత్రమో గానీ 2016 నవంబరు 8వ తేదీ తరువాత గురించి గానీ, నోట్ల రద్దు నిర్ణయం గురించి గానీ, దాని వలన దేశానికి ఒనగూడిన ప్రయోజనాలు గురించి గానీ ఒక్కటంటే ఈ ఎనిమిది ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రస్తావించ లేదు ప్రధాన మంత్రి గానీ, మరెవరైనా గానీ. దేశాన్ని కుదిపేసింది ఈ ఆకస్మిక నిర్ణయం. అంగట్లో అన్నీ వున్నా అల్ల్లుడు నోట్లో శని అన్నట్లుగా మార్కెట్‌లో వస్తువులున్నవిగానీ కొనుక్కోవడానికి చేతిలో చిల్లిగవ్వలేక పేదప్రజలు అన్నమో రామచంద్రా అని చేసిన ఆర్తనాదాలు ఇప్పటికీ బాగా గుర్తు చాలా మందికి. అంత హృదయ విదారకంగా మారిపోయినాయినాటి పరిస్థితులు. అప్పటి వరకూ చేస్తున్న పనులన్నీ ఒక్కసారిగా ఆగిపోయినవి. భవన నిర్మాణాలైతేనేమి, ఇళ్ల కొనుగోలైతేనేమి, వాహన కొనుగోలైతేనేమి, ప్రయాణాలైతేనేమి, నిత్యావసర వస్తువుల కొనుగోలైతేనేమి అన్నీ ఆగిపోయినవి బండికి గనుక సడెన్ బ్రేకు పడినట్లు. రాజకీయ పార్టీలు ఆందోళన చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి.

డబ్బులు ఇవ్వనిదే ఎవరు వచ్చి ఆందోళన చేస్తారు మన దేశంలో. ఈ వేదికలోనే గతంలో అనుకున్నాం రాజకీయ పార్టీలు ఆందోళనలు చేసేది అద్దెకి తెచ్చిన వారితోనే అని. మరి అద్దెకు వచ్చిన వారు ఆ రోజు సాయంత్రానికి చేతిలో డబ్బులు పడాలని కోరుకుంటారు కదా! ఇంత పెద్ద సంచలన నిర్ణయం, కోట్లాది మంది ప్రజల జీవితాలను తారుమారు చేసిన నిర్ణయం గురించి మీడియా గానీ, అకాడెమియా గానీ, రాజకీయ పార్టీలు గానీ, పౌర సంఘాలు గానీ ఏ విధమైన విశ్లేషణ చేయలేదు. అవినీతి అంతమొందిందా? నల్లధనం నశించిందా? ఉగ్రవాదం అదుపులోకి వచ్చిందా? ఏవీ ఈ ప్రశ్నలకు సమాధానాలు? కనీసం ఎన్నికల ప్రచారంలో కూడా దాని ప్రస్తావన రావడం లేదు. ఇవ్వడానికి ఏ పార్టీ వద్ద డబ్బులు లేవాయే. పైగా చెల్లుబాటయ్యే డబ్బుల కోసం గంటల తరబడి బ్యాంకుల ఎదుట నిలబడవలసి పరిస్థితి కూడా వుందాయె. గుర్గావ్‌లో ఓ వృద్ధుడు రోజు మొత్తం లైన్లో నిలుచున్నా డబ్బు అందక బిగ్గరగా ఏడ్చిన ఏడుపు అందరినీ కలచివేసింది ప్రభుత్వాన్ని నడిపే నాయకులను మినహా.

మన ప్రజాస్వామ్య వ్యవస్థ అంత ప్రజల వెతల పట్ల స్పందించే శక్తిని కాపియిందన్న విషయం అప్పుడు అర్ధమైంది ప్రజలకు. అతను పూర్వం ఎమెర్జెన్సీ సమయంలో చూసి వుంటారు అటువంటి పరిస్థితిని. ఏ ఎటిఎంలో డబ్బులు లేవు. అన్నీ ఖాళీ డబ్బాలే! బ్యాంకుల్లో డబ్బులు కొద్ది మొత్తంలోనే ఇచ్చేవారు మన అకౌంట్‌లో అంత డబ్బు వున్నప్పటికీ. ఉన్నవారు, లేనివారు అన్న తేడా లేకుండా అందరూ నానావస్థలు పడ్డారు డబ్బులకు. మనం ఎవరినైనా సహాయం అడగాలంటే దీనస్థితిలో వున్నట్లు కనిపించాలి ఎదుటివారు జాలిపడే విధంగా. దీనస్థితి అంటే జుట్టు సరిగ్గా దువ్వుకోక, బట్టలు సరైనవి వేసుకోక, మోహంలో విచారం కొట్టొస్తున్నట్లు కనిపించటం అన్నమాట. ఆ సందర్భం లో నాకు ఒక వింత అనుభవం ఎదురైంది. అప్పుడు నేను ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాను. హైదరాబాదులో ఇల్లాలేమో మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు అర్జెంటుగా ఇరవై వేలు డబ్బులు పంపించమని హుకుం జారీ చేశారు.

బ్యాంకుకి చెక్కు పంపించాను రూ. 20 వేలు తీసుకు రమ్మని. చెక్కు తీసుకొని పోయిన మనిషి 6 వేల రూపాయల కంటే ఇవ్వటం లేదు అని చెక్కు తీసుకొని వెనుకకు వచ్చాడు. అవి చలిరోజులు. ఢిల్లీలో సూటు బూటు వేసుకునే సీజను. సరే చేసేదేమీ లేక నేను కూడా సూటు బూటు వేసుకొని బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లి కూర్చున్నాను. ఈయనెవరో పెద్ద మనిషిలా వున్నాడే అని బ్యాంకు మేనేజరు అనుకోవాలి, తగిన హావభావాలు ప్రదర్శిస్తూ ఆయన ముందు కూర్చున్నా. అప్పటికే ఆయన చుట్టూ చాలా మంది జనం గుమికూడి వున్నారు. ఆ జన ప్రవాహం కాస్త తగ్గాక మేనేజరు నా వైపు చూశారు. మళ్ళీ అలవాటు లేని హావభావాలను ప్రదర్శిస్తూ కాస్త నాజూకైన ఇంగ్లీషు భాషలో విషయం బయట పెట్టా. నాకు అవసరంగా రూ. ఇరవై వేలు కావాలని. సూటు బూటు, భాష పని చేసినట్లున్నవి. రూ. 20 వేలు ఇచ్చాడు కాస్త నసుగుతూనే. సరే వచ్చిన పని అయ్యింది గదా అని వెయ్యి ఏనుగుల బలంతో తిరిగి వచ్చా కార్యాలయం గదికి.

ఆ రోజు స్నేహితుడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ వస్తుంటే అతని చేతికి ఇచ్చా రూ. 20 వేలు. సికింద్రాబాదులో మనిషి కలుస్తాడు రూ. ఇరవై వేలు ఇవ్వమ్మని. మనిషి సికింద్రాబాదులో రైలు పెట్టె వద్దకు వచ్చి నేను చెప్పిన సీటులో కూర్చున్న మనిషిని అడిగాడు డబ్బులు ఇవ్వండి పలానా మనిషి పంపాడు అని. పెట్టెలో మనిషి చికాకు పడుతూ ఏమి డబ్బులు, ఎవరు పంపారు, నాకేమీ తెలియదు పో అని కసురుకొంటూ చెప్పాడు! ఈ విషయం విని నేను నిర్ఘాంతపోయాను. స్నేహితుడు అటువంటి వాడు కాదే అని. బాగా తెలిసిన మనిషి. బహుశా వేరే సీటులో ఏమైనా కూర్చున్నాడేమో అని ఫోను చేశా. మరో పది నిమిషాలు పడుతుంది సికింద్రాబాదు చేరడానికి అన్నాడు డబ్బు తీసుకొస్తున్న స్నేహితుడు. అప్పుడు అర్ధమైంది సంగతి.

హైద్రాబాదు నుంచి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ దగ్గరకు వెళ్లి నేను చెప్పిన సీటులో మనిషిని డబ్బులు అడిగాడు స్టేషన్‌కు వచ్చిన మనిషి అదే ఢిల్లీ నుంచి వస్తున్న రైలు అనుకొని! ఢిల్లీ నుంచి వచ్చే రైలు 12 గం. ఆలస్యం కావడం చేత రెండు రైళ్ళూ దాదాపు ఒకే సమయానికి సికింద్రాబాదు చేరుకున్న పరిస్థితి. చిత్రమేమిటంటే ఉత్తరప్రదేశ్‌లో ప్రభు త్వం ఏర్పడిన రోజే ఎటిఎంల నుంచి డబ్బులు తీసుకోవడానికి విధించిన పరిమితిని ఎత్తివేసి ఎప్పటిలాగే రూ. 40 వేలు తీసుకునే వీలు కల్పించారు.

2016 నవంబరు 8 నుంచి నేటికి 8 ఏళ్ళు గడిచినా దేశానికి ఒనగూడిన ప్రయోజనం ఏమిటో ప్రధాన మంత్రి నేటికీ చెప్పలేదు! నాటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కాలం చేశారు గనుక ఆయన చెబుతారన్న ఆశలేదు. ఇంతపెద్ద సంచలన నిర్ణయం, కోట్ల మంది ప్రజల జీవితాలను తారుమారు చేసిన నిర్ణయం గురించి మీడియా గానీ, అకాడెమియా గానీ, రాజకీయ పార్టీలు గానీ, పౌర సంఘాలు గానీ ఏ విధమైన విశ్లేషణ చేయలేదు. అవినీతి అంతమొందిందా? నల్లధనం నశించిందా? ఉగ్రవాదం అదుపులోకి వచ్చిందా? ఏవీ ఈ ప్రశ్నలకు సమాధానాలు? కనీసం ఎన్నికల ప్రచారంలో కూడా దాని ప్రస్తావన రావడం లేదు.

గుమ్మడిదల
రంగారావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News