ముంబై: భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు న్యూజిలాండ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ పేర్కొన్నాడు. ఈ ప్రదర్శన తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్నాడు. అంతేగాక మరికొంత కాలం పాటు న్యూజిలాండ్ తరఫున ఆడే అవకాశం దొరుకుతుందనే నమ్మకం కలిగిందన్నాడు. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టినా జట్టు ఓటమి పాలు కావడం ఎంతో నిరాశకు గురయ్యానన్నాడు. ఈ ఒక్క రికార్డుతో జీవితం ఏం మారిపోదన్నాడు. అయితే కివీస్ తరఫున మరిన్ని టెస్టులు ఆడేందుకు ఇది దోహదపడొచ్చని అభిప్రాయపడ్డాడు. ఇక భారత్ వంటి బలమైన జట్టుపై ఇలాంటి అరుదైన ఘనత సాధించడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ క్రమంలో కుంబ్లే, జిమ్ లేకర్ వంటి దిగ్గజాల సరసన నిలువడం ఆనందం కలిగిస్తుందన్నాడు. కాగా, తొమ్మిదో వికెట్ తీసేంత వరకు కూడా రికార్డుల గురించి ఆలోచించలేదన్నాడు. అప్పటికే చాలా ఓవర్లు బౌలింగ్ చేయడంతో పూర్తిగా అలసి పోయానన్నాడు. అయితే అదృష్టవశాత్తు పదో వికెట్ కూడా తనకే లభించడంతో అరుదైన మైలురాయిని అందుకోగలిగానని పటేల్ పేర్కొన్నాడు.