యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రములో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామిఅమ్మవారులకు వైభవంగా లక్ష పుష్పార్చన పూజను నిర్వహించారు. బుధవారం ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, అభిషేకం, సుదర్శన నారసింహ హోమం పూజలతో భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు. ఏకాదశి పురస్కరించుకొని ఆలయ ముఖమండపంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారికి అలంకరించి రంగు రంగుల పరిమళముగల వివిధ రకాల పుష్పాలతో వైభవంగా లక్ష పుష్పార్చన పూజలను అర్చకులు నిర్వహించారు. శ్రీస్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగిన నిత్యకల్యాణం, పుష్పార్చన, వెండి జోడి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడి బుధవారం రోజున రూ.24,74,736 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో జరుగు అర్జిత సేవలు, ప్రసాద విక్రయం, ప్రధాన బూకింగ్, పాతగుట్ట ఆలయం, కొండపైకి వాహనాల అనుమతి ఇతర శాఖల నుండి శ్రీవారి నిత్యరాబడి సమకురినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న ఐఏఎస్ అధికారి..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని బుధవారం ఐఏఎస్, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో జరిగే స్వామివారి సుదర్శన హోమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వాకాటి కరుణకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు.