Tuesday, April 8, 2025

‘ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాథలు’

- Advertisement -
- Advertisement -

చదవాల్సిన పుస్తకం

‘పుట్టుకతోనే నేరస్తుల’ జాబితాలోకి, సాటి ఆధునిక సమా జం నుంచి దొంగలుగా ముద్రపడిన ఎరుకల జీవ న నేపథ్యాల్ని, అవమానాల్ని, దుఃఖాల్ని, ఓటము ల్ని, కన్నీళ్లను అత్యంత స్వాభావికంగా, హృదయవిదారకంగా అక్షర బద్ధం చేసిన రచన ’ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాథలు’.అదే సామాజిక నే పథ్యం నుంచి వచ్చిన పలమనేరు బాలాజీ రాసిన ఈ కథలు ఆత్మగౌరవానికి పెద్దపీట వేశాయి.

చేయని నేరానికి జీవితకాల శిక్ష అనుభవిస్తున్న ’మా కులస్తుల తప్పు ఏంది స్వామి’ అని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. యువతలో చైతన్యాన్ని ప్రోదిచేసి ఉనికిని కాపాడుకోవాలనే కర్తవ్యాన్ని గుర్తుచేస్తున్నాయి. కేవలం ఎరుకల కులం కారణంగా పోలీసులు చేతుల్లో దెబ్బలు తిని ఊరు విడిచి వెళ్లిపోయిన అశోక్, బతుకులు బాగుపడాలంటే చదువు ఒకటే మార్గమని చెప్పే మొగిలప్ప, కులానికి ఎరుకలోడైతే అందరూ దొంగలేనా అంటూ చొక్కా పట్టుకుని ఉద్యోగం పోగొట్టుకున్న పోలీసు మునిరత్నం, గుడి కట్టడం కంటే లైబ్రరీ కట్టి పుస్తకాలు పెట్టడం ఎరుకల పిల్లల చదువుకు ఎంతో ఉపకరిస్తుందని గొడవ చేసిన ఉడుకోడు.

పేరుకి సర్పంచిగా ఉంటూ ఊరికి నీళ్లు తెచ్చుకోలేని అశక్తత నుంచి దళిత, గిరిజన, కుల విమోచన సంఘాల మాటలతో చైతన్యం పొందిన శీను, ఏ ఎరికలోడైనా ఒక్క పూట అన్నం పెట్టిన వాళ్ళని ప్రాణం పోయినా కడదాకా మర్చిపోడని చెప్పి కబాబ్ కబాలి, ఎలాంటి పరిస్థితులనైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలని సందేశం ఇచ్చే మంజుల… ఇలా ఈ కథల్లో కనిపించే పాత్రలు ఎరుకల జీవన వైవిధ్యంలోని సంఘర్షణల్ని మన కళ్ళముందు నిలుపుతారు. మరుగునపడుతున్న సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తెరిగిన ‘పర్స్పెక్టివ్స్’ ప్రచురించిన ఈ పుస్తకం మీద విస్తృత అధ్యయనం, పరిశోధనలు జరగవలసిన అవసరం ఉంది. ఏకలవ్య కాలనీ కథా సంపుటి. 165 పేజీలు. ధర 220/పుస్తకం నవోదయ బుక్ హౌస్ , కాచిగూడ, హైదరాబాదులో లభ్యం
డా.జడా సుబ్బారావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News