ముంబై : ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి డెత్ వారంట్ జారీ అయిందని, మరో 15 లేదా 20 రోజుల్లో ఆ ప్రభుత్వం కుప్పకూలిపోబోతోందని శివసేన (యుబిటీ)నేత సంజయ్‌రౌత్ చెప్పారు. మీడియాతో ఆయన ఆదివారం మాట్లాడారు. ఉద్ధవ్ థాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన 16 మంది ఎమ్‌ఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తీర్పులు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, ఈ తీర్పుకోసం తాము ఎదురు చూస్తున్నామని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని రౌత్ చెప్పారు. షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరిలో కుప్ప కూలిపోతుందని గతంలో కూడా సంజయ్‌రౌత్ వ్యాఖ్యానించారు. గత ఏడాది జూన్‌లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని 39 మంది శివసేన ఎమ్‌ఎల్‌ఎలు థాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో సిఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయవలసి వచ్చింది. దీంతో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న మహావికాస్ అఘాది (ఎంవిఎ) ప్రభుత్వం పడిపోయింది. గత ఏడాది జూన్ 30న షిండే ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైంది. షిండే వర్గం ఎమ్‌ఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలని ధాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. మరో 1520 రోజుల్లో ఈ తీర్పులను సుప్రీం కోర్టు వెల్లడించనున్నది. ఈ నేపథ్యంలో ఆ 16 మంది ఎమ్‌ఎల్‌ఎలపై అనర్హత వేటు పడుతుందని, అప్పుడు ప్రభుత్వం కూలిపోతుందని ఉద్ధవ్ థాక్రే వర్గం భావిస్తోంది.