Wednesday, December 25, 2024

బిజెపి, షిండే శివసేన కుమ్ములాట!

- Advertisement -
- Advertisement -

మరాఠీ పత్రిక సకాల్ ఇటీవల ప్రకటించిన సర్వే ప్రకారం మహారాష్ర్టలో నరేంద్ర మోడీని ప్రధానిగా కోరుకుంటున్నవారు 42.1 శాతంగా కాగా, వద్దన్నవారు 41.5% ఉన్నారు. మిగిలిన వారు చెప్పేందుకు నిరాకరించటం లేదా తెలియదని చెప్పారు. దాదాపు 70 శాతం మంది ఆర్థిక రంగంలో మోడీ విఫలం చెందినట్లు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ తరువాత ఎక్కువ 48 స్థానాలున్న ఇక్కడ మోడీ పట్ల అనుకూలత ఎంతో ప్రతికూలత కూడా అంతే ఉంది. కోర్టులో శివసేన పేరు, గుర్తును షిండే వర్గం దక్కించుకోవచ్చుగానీ ఈ సర్వే ప్రకారం ఓటర్లు 12.5 శాతం మంది ఉద్ధవ్ థాక్రే శివసేనకు మద్దతు ప్రకటిస్తే కేవలం 5.5 శాతమే షిండేకు అనుకూలమని చెప్పారు. బిజెపికి 33.7% మొగ్గు చూపారు. బిజెపి కూటమికి 39.2 శాతం మద్దతు పలకగా ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్‌సిపి, ఉద్ధవ్ శివసేన కూటమికి 48% మంది అనుకూలం అన్నారు. అరమరికలు లేకుండా ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు, ఓటు బదిలీ చేసుకుంటే బిజెపి శంకరగిరి మాన్యాలు పడుతుందని అంకెలు చెబుతున్నాయి.

మహారాష్ర్టలో అసలు సిసలు మహత్తర హిందూత్వ శక్తులం, హిందు మత ఉద్ధారకులం తామే అంటున్న బిజెపి, షిండే శివసేన నేతలు ఎంతవారలైనా అధికార కాంత దాసులే అన్నట్లుగా వచ్చే ఎన్నికల్లో సిఎం కుర్చీ కోసం కొట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది. “ఢిల్లీలో నరేంద్ర మోడీ రాష్ర్టంలో ఫడ్నవీస్‌” అంటూ బిజెపి ఒక నినాదాన్ని ముందుకు తెచ్చింది. దానికి పోటీగా “దేశంలో మోడీ మహారాష్ర్టలో షిండే” అంటూ తాజాగా షిండే శివసేన సోమవారం నాటి పత్రికల్లో ఇచ్చిన ప్రకటన రెండు పార్టీల మధ్య కాక పుట్టించింది. మంగళవారం కొల్హాపూర్‌లో సిఎం ఏకనాథ్ షిండే పాల్గొన్న కార్యక్రమాలను దేవేంద్ర ఫడ్నవీస్ బహిష్కరించారు. అనారోగ్య సాకు చెప్పినట్లు వార్తలు. దాంతో రెండు పార్టీలు నష్ట నివారణకు పూనుకొని బుధవారం నాటి పత్రికల్లో ఐక్యంగా ఉన్నట్లు కనిపించేందుకు శివసేన మరొక ప్రకటన ఇచ్చింది. “అందరూ ప్రేమించిన అద్భుతమైన బృందం” అనే శీర్షికతో నష్ట నివారణకు గాను శివసేన మరొక ప్రకటన జారీ చేసింది.

దానిలో నరేంద్ర మోడీ, అమిత్ షా, బాలాసాహెబ్ థాకరే, ఆనంద దిఘేల బొమ్మలతోపాటు ఏకనాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరూ జట్టుగా చేతులూపుతున్న చిత్రాన్ని ప్రదర్శించారు. వాటితో పాటు శివసేన ఎన్నికల గుర్తు బాణం, బిజెపి గుర్తు కమలం కూడా చోటు చేసుకుంది. తొలి ప్రకటనలో షిండేకు 26.1 శాతం, ఫడ్నవీస్‌కు 23.2 శాతం మద్దతు అని పేర్కొనగా, తాజా ప్రకటనలో ఇద్దరికీ కలిపి 49.3% మద్దతు అని పేర్కొన్నారు. ఈ పరిణామం మిగతా రాష్ట్రాలలో బిజెపితో చేతు లు కలిపే ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఒక పాఠంగా పనికి వస్తుంది. మరోవైపు కొద్ది రోజుల క్రితం సకాల్ అనే మరాఠీ దినపత్రిక వెల్లడించిన ఒక సర్వే ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్‌సిపి, థాకరే శివసేన పార్టీ (ఎంవిఎ) మెజారిటీ సీట్లను సాధిస్తుంది. నిర్ణీత గడువు ప్రకారమైతే లోక్‌సభ తరువాత వచ్చే ఏడాది అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలు, అలాగాక రెండింటినీ కలుపుతారా అన్నది చెప్పలేము.

శివసేనను చీల్చి బిజెపి మద్దతుతో బిజెపి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏదో ఒక అంశం రెండు పార్టీల మధ్య అనుమానాలను పెంచింది. రెండు సార్లు సిఎంగా పని చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉప ముఖ్యమంత్రిగాపెట్టి అసలు కథ నడిపించాలన్నది బిజెపి పన్నాగం. ఏకనాథ్ షిండే తాత్కాలికమే, సిఎం పదవి తనదే అన్నట్లుగా ఫడ్నవీస్ “ఢిల్లీలో నరేంద్రమోడీ రాష్ర్టంలో ఫడ్నవీస్‌” అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. దానికి పోటీగా ఏకనాథ్ షిండే రంగంలోకి దిగారు. ఒక టివి ఛానల్ ఒక ఏజన్సీ నిర్వహించిన సర్వేలో తిరిగి సిఎంగా షిండేను కోరుతున్నవారు 26.1%, ఫడ్నవీస్‌ను కోరుతున్నవారు 23.2% అని తేలిందని పేర్కొంటూ శివసేన పేరుతో ఒక ప్రకటన జారీ చేశారు. అంతేకాదు బిజెపికి 30.2%, షిండే సేనకు 16.2% ఓటర్ల మద్దతు ఉందని, కేంద్రంలో మోడీ, రాష్ర్టంలో షిండే అమలు జరుపుతున్న పథకాల వలన ప్రజా మద్దతు పెరిగిందని కూడా పేర్కొనటం గమనించాల్సిన అంశం.

బాలా సాహెబ్ థాకరే ఫోటో లేకుండా ఆ ప్రకటన జారీ చేయటం అంటే మోడీ, అమిత్ షాలను చూసి షిండే భయపడుతున్నారని తేలిందని ఉద్ధవ్ థాక్రే సేన నేత సంజయ రౌత్ ధ్వజమెత్తారు. ఈ ప్రకటనను బట్టి ఏకనాథ్ షిండేను సిఎంగా అంగీకరించినట్లేనని ఫడ్నవీస్‌కు ఇది విచారకరమైన రోజని ఎన్‌సిపి స్పందించింది. ఈ ప్రకటన గురించి బిజెపి పెద్దలకు తెలిపామని, వారి అంగీకారంతోనే విడుదల చేసినట్లు షిండే వర్గం చెప్పుకుంది. సిఎంను పొగడటం వరకు ఓకే, ఇద్దరికీ కలిపి ఉన్న బలం గురించి ప్రతిపక్షాలకు చెప్పాలి మనలో ఎవరికి ఎంత బలం ఉందో, తమ నేత ఫడ్నవీస్‌కు జనంలో ఆదరణ లేదని చెప్పటాన్ని అంగీకరించేది లేదని బిజెపి నేతలు మండిపడ్డారు. షిండే తనతో పాటు తీసుకు వచ్చిన 40 మంది ఎంఎల్‌ఎల కారణంగానే బిజెపికి అధికారం దక్కిందని గుర్తించాలని షిండే వర్గం తిప్పి కొట్టింది. ఇలాంటి ప్రకటనల రాజకీయాలు కొత్త కాదు. 2019 ఎన్నికల్లో మోడీ దేశానికి దేవేంద్ర రాష్ట్రానికి అంటూ బిజెపి ప్రకటనలు జారీ చేసింది.
షిండే సేన ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని లోక్‌సభ నియోజకవర్గాలు తమవే అని బిజెపి చెబుతోందని, అదే విధంగా షిండే వర్గానికి చెందిన ఐదుగురు మంత్రులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మంత్రులు ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు. వారి ప్రవర్తనతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని ఫడ్నవీస్ ఇటీవల అమిత్ షా వద్ద మొరపెట్టుకున్నారని వార్తలు.

ఇటీవల ఎవరికి వారు తమ ఎంఎల్‌ఎలతో విడివిడి సమావేశాలు జరపటం, నిధులు సరిగా కేటాయించటం లేదని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నట్లు షిండే కుమారుడు, ఎంపి డాక్టర్ శ్రీకాంత్ షిండేపై బిజెపి నేతలు ధ్వజమెత్తారు. శ్రీకాంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కల్యాణ్ లోక్‌సభ సీటు తమదే అని కూడా వారు బహిరంగంగా చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో బలపరచకూడదని తీర్మానాలు కూడా చేశారు. ఈ పూర్వరంగంలో అవసరమైతే తాను రాజీనామా చేస్తానని శ్రీకాంత్ గతవారంలో ప్రకటించారు. సిఎంగా తండ్రి తీసుకొనే నిర్ణయాల వెనుక కుమారుడి ప్రభావం ఉందన్న పేరుంది. ఏకనాథ్ షిండేను అదుపులో ఉంచేందుకు, అవసరమైతే తప్పించేందుకు ఎన్‌సిపి నేత అజిత్ పవార్‌కు బిజెపి గాలం వేసింది. రాష్ర్ట రాజకీయాలలో అధికారం కోసం అర్రులు చాస్తారన్న పేరున్న అజిత్ బిజెపిలో చేరటం లాంఛనమే అన్న వార్తలు కూడా వచ్చాయి. అదే జరిగితే తాము కూటమి నుంచి తప్పుకుంటామని బిజెపిని షిండేసేన హెచ్చరించింది. అజిత్ పవార్ గతంలో బిజెపితో చేతులు కలిపి దొంగచాటుగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 80 గంటల తరువాత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష కూటమి నేతగా ఉన్నారు.

మరాఠీ పత్రిక సకాల్ ఇటీవల ప్రకటించిన సర్వే ప్రకారం మహారాష్ర్టలో నరేంద్ర మోడీని ప్రధానిగా కోరుకుంటున్నవారు 42.1 శాతంగా కాగా, వద్దన్నవారు 41.5% ఉన్నారు. మిగిలిన వారు చెప్పేందుకు నిరాకరించటం లేదా తెలియదని చెప్పారు. దాదాపు 70 శాతం మంది ఆర్థిక రంగంలో మోడీ విఫలం చెందినట్లు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ తరువాత ఎక్కువ 48 స్థానాలున్న ఇక్కడ మోడీ పట్ల అనుకూలత ఎంతో ప్రతికూలత కూడా అంతే ఉంది. కోర్టులో శివసేన పేరు, గుర్తును షిండే వర్గం దక్కించుకోవచ్చుగానీ ఈ సర్వే ప్రకారం ఓటర్లు 12.5 శాతం మంది ఉద్ధవ్ థాక్రే శివసేనకు మద్దతు ప్రకటిస్తే కేవలం 5.5 శాతమే షిండేకు అనుకూలమని చెప్పారు. బిజెపికి 33.7% మొగ్గు చూపారు. బిజెపి కూటమికి 39.2 శాతం మద్దతు పలకగా ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్‌సిపి, ఉద్ధవ్ శివసేన కూటమికి 48% మంది అనుకూలం అన్నారు. అరమరికలు లేకుండా ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు, ఓటు బదిలీ చేసుకుంటే బిజెపి శంకరగిరి మాన్యాలు పడుతుందని అంకెలు చెబుతున్నాయి.

2019 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి, శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్, ఎన్‌సిపి ఒక కూటమిగా పోటీ చేశాయి. బిజెపికి 27.84, శివసేనకు 23.5, కూటమికి 51.34 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్, ఎన్‌సిపిలకు 16.41, 15.66 మొత్తం 32.07 శాతం రాగా, 47 చోట్ల బరిలోకి దిగిన వంచిత్ బహుజన్ అగాధీకి 6.92 శాతం, దానితో కలసి ఒక చోట పోటీ చేసి దాన్ని గెలుచుకున్న మజ్లిస్‌కు 0.73 ఓట్లు వచ్చాయి. వంచిత్ బహుజన్ అగాధీ ప్రస్తుతం ఉద్ధవ్ శివసేనకు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. 2019 అక్టోబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, శివసేన కూటమికి 25.75, 16.41 చొప్పున మొత్తం 42.16 శాతం మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్, ఎన్‌సిపి కూటమికి 15.87, 16.71 చొప్పున, మొత్తం 32.58 శాతం వచ్చాయి. ఇక కుమ్ములాటలు, ముద్దులాటలుగా ఉన్న బిజెపి, షిండే సేన కూటమి తాత్కాలికంగా కలసి ఉన్నట్లు కనిపించేందుకు పూనుకున్నప్పటికీ అధికార కుమ్ములాటలు, పరిణామాలు ఏ రూపం తీసుకొనేది చెప్పలేము. కలసి ఉన్నా ఎంవిఎ కూటమిని ఎంత మేరకు ఎదుర్కొనేది ప్రశ్నార్ధకమే.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News