Wednesday, January 22, 2025

పర్యావరణానికి ఎల్‌నినో ముప్పు

- Advertisement -
- Advertisement -

సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రతలు కనీసం ఐదు రుతువుల్లో వరుసగా 0.5 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైతే ఎల్‌నినోకు సంకేతంగా భావిస్తారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో పరిస్థితులు తరచుగా ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పిలిప్పీన్స్, మలేసియా, న్యూగినియా వంటి దీవులలో కలుగుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, అర్జెంటీనా, న్యూజిలాండ్, బ్రెజిల్, భారత్ లాంటి దేశాలలో సాధారణంగా కనిపిస్తాయి. మానవుడు తన స్వార్థపూరిత ప్రయోజనాల కోసం విచక్షణా రహితంగా ప్రకృతి వనరుల వినాశనం, పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతుండటం తో భూఉష్ణోగ్రతలతో పాటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి ఎల్‌నినో ప్రభావం తీవ్రతరమవుతున్నది. దీనికి తోడు అసాధారణ వాతావరణ మార్పులు కూడా ఎల్ నినో ఏర్పడటానికి కారణమవుతున్నవి.

ఎల్‌నినో అనేది ఒక సహజమైన కాలానుగుణమైన అసాధారణ వాతావరణ మార్పు. ఇది తాత్కాలికమైనదే అయినప్పటికీ పర్యావరణంపై పిడుగులా విరుచుకపడుతూ నేడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న సమస్య. ఎల్‌నినో అనే పదానికి స్పానిష్ భాషలో ‘లిటిల్ బాయ్’ అని అర్థం ఉంది. ఈ దృగ్విషయాన్ని మొదట 19 వ శతాబ్దంలో పెరూ, ఈక్వెడార్‌లోని మత్స్యకారులు పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించారు.ఇది దక్షిణ అమెరికా సమీపంలో ని పసిఫిక్ మహాసముద్రంలో అభివృద్ధి చెందుతున్న వెచ్చని సముద్రపు నీటి ప్రవాహంతో సంబంధం ఉన్న నీటి వ్యవస్థ.

ఈ మహాసముద్రంలోని ఉపరితల నీరు సగటు ఉష్ణోగ్రతకంటే వెచ్చగా మారినపుడు, తూర్పుగాలులు సాధారణం కంటే బలహీనంగా వీచినపుడు ఎల్‌నినో పరిస్థితి ఏర్పడుతుంది. సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రతలు కనీసం ఐదు రుతువుల్లో వరుసగా 0.5 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైతే ఎల్‌నినోకు సంకేతంగా భావిస్తారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో పరిస్థితులు తరచుగా ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పిలిప్పీన్స్, మలేసియా, న్యూగినియా వంటి దీవులలో కలుగుతున్నాయి.
యునైటెడ్ స్టేట్స్‌ఆఫ్ అమెరికా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, అర్జెంటీనా, న్యూజిలాండ్, బ్రెజిల్, భారత్ లాంటి దేశాలలో సాధారణంగా కనిపిస్తాయి.

మానవుడు తన స్వార్థపూరిత ప్రయోజనాల కోసం విచక్షణా రహితంగా ప్రకృతి వనరుల వినాశనం, పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతుండటంతో భూఉష్ణోగ్రతలతో పాటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి ఎల్‌నినో ప్రభావం తీవ్రతరమవుతున్నది. దీనికి తోడు అసాధారణ వాతావరణ మార్పులు కూడా ఎల్ నినో ఏర్పడటానికి కారణమవుతున్నవి. సాధారణంగా సముద్రం పైభాగంలో నీళ్ళు వేడెక్కడం (ఎల్‌నినో) చల్లబడటం (లానినా) అనే ఈ రెండు దృగ్విషయాలు ప్రతి 3 నుండి 5 సంవత్సరములకు ఒకసారి సంభవిస్తూ ఉంటాయి. ఏర్పడిన ప్రతి సంఘటన సాధారణంగా 9-12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వరకు కొనసాగవచ్చు. ఎల్‌నినో వల్ల శీతాకాలం వెచ్చగా ఉంటుం ది.

వేసవి కాలం మరింత వేడిగా ఉంటుంది. రుతుపవనాలు కూడా బలహీనంగా ఉంటాయి. ఎల్‌నినో కారణంగా తీవ్రమైన కరువు, సంబంధిత ఆహార అభద్రత, సముద్రజీవుల మూకుమ్మడి మరణం వర్షాలు, వరదలు, ఉష్ణోగ్రతల పెరుగుదల, వ్యాధులవ్యాప్తి పోషకాహార లోపం, శ్వాసకోశ వ్యాధులతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. గత 20 సంవత్సరాలలో సంభవించిన కరువు కాటకాలన్నీ కూడా ఎల్‌నినో కారణంగానే సంభవించాయని తాజాగా యంకే గ్లోబల్ పరిశోధనా నివేదిక పేర్కొనడం గమనార్హం. యాంటీ- ఎల్‌నినోగా పిలువబడే లానినా (అధిక వర్షస్థితి) పరిస్థితి అనంతరం ఎల్‌నినో పునరావృతం అవుతుంది. సాధారణంగా లానినాల కంటే ఎల్‌నినోలు తరచుగా ఏర్పడుతుంటాయి

దూసుకొస్తున్నఎల్‌నినో ముప్పు

భూమిపై ఎల్‌నినోలకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని పర్యావరణవేత్తలు విశ్వసిస్తున్నారు. క్రీ.శ 1525లో పెరూలో సంభవించిన ఎల్‌నినో పరిస్థితి మొట్టమొదటి లిఖితపూర్వక రికార్డుగా ప్రసిద్ధి కెక్కింది. ఆధునిక పరిశోధనల ప్రకారం క్రీ.శ. 1900 నుండి 2021 వరకు కనీసం 15 ఎల్‌నినో సంఘటనలు కనుగొనబడ్డాయి. వీటిలో 1972, 1982, 1987, 1997, 2004, 2015 సంవత్సరాలలో రికార్డు స్థాయిలో అత్యంత బలమైన ఎల్‌నినో సంఘటనలుగా గమనించబడ్డాయి. 2015-16లో వచ్చిన ఎల్‌నినో సమయాలలో ప్రపంచ వ్యాప్తంగా వర్షాభావ స్థితి వల్ల కరువు కాటకాలు కలిగాయని, సుమారు 75% పగడపు దీవులు నశించాయని, మత్స్య సంక్షోభం, కార్చిచ్చులు చెలరేగడం కూడా ఎక్కువైందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం జూన్ 2023లో ప్రారంభమైన ఎల్‌నినో సెప్టెంబర్ 2024 వరకు కొనసాగనుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

2023 రెండవ భాగంలో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడటానికి 90% పైగా అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుయంఒ) తో పాటు స్కైమెట్ వాతావరణ సంస్థ తాజాగా అంచనా వేసింది. ఈ సందర్భంగా ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత 16.95 సెల్సియస్ డిగ్రీలుగా నమోదైన జులై- 2023 మాసాన్ని వరల్డ్ హాటెస్ట్ మంత్‌గా డబ్లుయంఒ ప్రకటించడం గమనార్హం. బలమైన ఎల్‌నినో తొలి సంకేతాలు ఇప్పటికే మొదలయ్యాయని అమెరికా- యూరప్ ఉపగ్రహం సెంటినెల్- 6 ఇటీవల గుర్తించింది. జూన్- డిసెంబర్ 2023 మాసాల్లో ఎల్ నినో కలిగే సంభావ్యత 55 -60 శాతం ఉంటుందని అమెరికాలోని నేషనల్ ఓషీయానిక్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (యన్‌ఒఎఎ)సంస్థ తాజాగా తన పరిశోధనలో తెలిపింది. మానవుని కార్యకలాపాల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్‌తో భూమి వేడెక్కడంతో పాటు సముద్ర జలాలు కూడా వేడెక్కుతున్నాయని ఇటీవలి పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఎల్‌నినో ప్రభావం వల్ల ఇప్పుడిక పసిఫిక్ మహాసముద్రంపై మూత తీసేసినట్లే అయ్యిందని, దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా 2024 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 సెంటీగ్రేడ్ డిగ్రీలు ఎక్కువయ్యే ఛాన్స్ నిండుగా ఉందని యన్‌ఒఎఎ పరిశోధకులు మైఖేల్ హెచ్చరించారు.

ప్రతి ఎల్‌నినో సంఘటన ఫలితాలు ఆ సంఘటన తీవ్రత, అభివృద్ధి చెందుతున్న సంవత్సరం, సమయం, ఇతర వాతావరణ నమూనాలతో పరస్పర చర్యలపై ఆధారపడి ఉంటాయి. దీని మూలంగా సంభవించే వర్షాభావ పరిస్థితి, కరువులు, వరదలు, తుఫానులు, ఉత్పాతాలు, వేడిగాలులు వంటి అసాధారణ వాతావరణ మార్పులు ఒక్కొక్కప్పుడు ఊహించిన దాని కంటే ఎక్కువ కాలం కొనసాగవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ. 281 లక్షల కోట్ల నష్టం సంభవించొచ్చని తాజాగా అమెరికాకు చెందిన డార్ట్ మౌత్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం నివేదిక -2023 తెలిపింది.

మన దేశంలో 2001- 2020 మధ్య కాలంలో 9 ఎల్‌నినో సంఘటనలు ఏర్పడ్డాయి. వీటిలో 4 ఎల్‌నినో సంవత్సరాలలో కరువు ఏర్పడింది.ఈ కాలంలో దీర్ఘకాల సగటు వర్షపాతంలో 90% తక్కువగా వర్షాలు కురిసాయి. తద్వారా ఖరీఫ్‌లో పంట దిగుబడి తగ్గి ద్రవ్యోల్బణానికి దారితీసింది.ఇండియన్ ఓషన్ డైపోల్ ఎఫెక్ట్ (ఇండియన్ నినో) కారణంగా 2023 సంవత్సరంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తాజాగా భారత వాతావరణ శాఖ (ఐయండి) అంచనా వేసింది.

జూన్- సెప్టెంబర్ కాలంలో ఎల్ నినో వాతావరణం 90% ఏర్పడొచ్చునని పేర్కొంది. కనుక వర్షపాతం తక్కువగానే ఉండొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. గత మూడు నెలలుగా దేశంలో కేరళ, బీహార్, జార్ఖండ్, మిజోరాం రాష్ట్రాలలో వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఈ రాష్ట్రాలలో 60% వర్షపాతం నమోదయిందని, ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో రుతుపవనాలకు బ్రేక్‌పడి ఎల్‌నినో బలపడే సూచనలు ఉన్నాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాలలో తీవ్ర వర్షాభావం, కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షస్థితి ఏర్పడుతుందని శాస్త్రజ్ఞుల అంచనా. రుతుపవనాలపై ఎల్‌నినో, లానినో ప్రభావం గురించి పుణెకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియాలజీ (ఐఐటియం) శాస్త్రవేత్తల బృందం తాజాగా అధ్యయనం చేసింది. వర్షపాతంపై ఎల్‌నినో, లానినోల ప్రభావం 1901 నుండి 1940 వరకు గణనీయంగా పెరిగిందని, 1941-80ల మధ్య నిలకడగా ఉందని, 1981 తర్వాత వాటి ప్రభావం బలహీనపడిందని ఐఐటియం తన అధ్యయన నివేదిక -2023 పేర్కొంది.అయితే భారత్ అంతటా ఈ పరిస్థితి ఒకేలా లేదు. ఉత్తర భారత్‌లో ఎల్‌నినో, -లానినో ప్రభావం బలంగా ఉండి అధిక వర్షపాతమను కలిగి ఉటుందని, ఈ ప్రాంతాన్నే కోర్ మాన్సూన్ జోన్ అంటారని, మధ్య భారత్‌లో వానల రాకను అంతగా ప్రభావితం చేయవని, దక్షిణ భారత్‌లో ఎల్‌నినో ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదని ఆ సంస్థ అధ్యయన బృందం నాయకుడు, క్లైమేట్ సైంటిస్ట్ డాక్టర్ రాక్సి మాథ్యూ కోల్ పేర్కొన్నాడు.

ఎల్‌నినో సవాళ్ళను ఎదుర్కొందాం

సాధారణంగా ఎల్‌నినో కారణంగా వరదలు, కరవులు ఏర్పడటమే కాకుండా వాతావరణం వేడెక్కడం కూడా మరో సమస్య. ప్రతి ఎల్‌నినో పరిస్థితి ఎన్నడూ ఒకేలా ఉండదు. దీని వల్ల నష్టాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సార్లు ఆఫ్రికాలోని కరవు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. దాంతో పంటలు పండి ప్రజలకు తిండి గింజలు అందుబాటులోకి వస్తాయి. ఎల్‌నినో,- లానినో వాతావరణ సంఘటనలను కొన్ని నెలల ముందుగానే అంచనా వేయడానికి మనకు అందుబాటులో ఉన్న శాస్త్ర సాంకేతిక సాధనాలను, సూపర్ కంప్యూటర్లను భారీ నిధులతో మరింతగా అభివృద్ధి చేయాలి.

ఈ విపత్కర కాలంలో ఎలాంటి పంటలు వేయాలి, ఎంత మేర ఆహార నిల్వలు సిద్ధంగా ఉంచకోవాలో ముందుగానే అంచనా వేసుకోవాలి. మన దేశంలో హీట్ హాట్ స్పాట్లను గుర్తించి ‘ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్’ను రూపొందించి అమలు పరచాలి. తగ్గిపోతున్న అడవులు, చిత్తడి నేలలు మాన్ గ్రూవ్ అడవులు లాంటి సహజ ఆవరణ వ్యవస్థలను పునరుద్ధరించాలి. రుతు పవనాల వైవిధ్యం వల్ల కలిగే ఆర్థిక-, సామాజిక అసమానతలను, లాస్ అండ్ డ్యామేజిలను తగ్గించుటకు మిశ్రమ ఆర్థిక వ్యూహాలను సమన్వయపరుచాలి. వ్యవసాయం, ఆహార భద్రత నీటి నిర్వాహణ ఆరోగ్యం విపత్తుల నుండి ప్రమాదాలను తగ్గించడం, శక్తి రంగాలలో వినియోగదారుల కోసం కాలానుగుణ అంచనాలు ఈ సంఘటనల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. కనుక ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవడానికి వాతావరణ ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, వాతావరణం వేడెక్కకుండా ఉండడానికి ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా సమన్వయంతో చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.

డా. భారత రవీందర్
9912536316

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News