ఛత్తీస్‌గఢ్‌లో దారుణం
బిలాస్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన ఆస్తి తగాదా ఇద్దరి హత్యకు దారితీసింది. సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని జర్హాభాటా ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. మృతులను దీప్ గఢేవాల్(42), ఆయన భార్య పుష్ప(40)గా పోలీసులు గుర్తించారు. బిలాస్‌పూర్ సమీపంలోని పాండ్ గ్రామంలో పూర్వీకులకు చెందిన ఏడు ఎకరాల భూమిపై దీపక్, అతని తమ్ముడు ఓంప్రకాశ్(40) మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. మంగళవారం ఉదయం దీపక్, తన భార్యతో కలసి పొలంలో ఉండగా అన్నదమ్ముల మధ్య గొడవ జరిగిందని పోలీసులు చెప్పారు. అయితే..కొద్ది సేపటి తర్వాత వారంతా ఇళ్లకు తిరిగి వచ్చారని, తిరిగి సాయంత్రం ఓంప్రకాశ్, అతని భార్య సంగీత, వారి ఇద్దరు మైనర్ కుమార్తెలు కలసి దీపక్ కుటుంబ సభ్యులపై గొడ్డలి, ఇనుప రాడ్లతో దాడి చేశారని వారు చెప్పారు. ఈ దాడిలో దీపక్, అతని భార్య అక్కడికక్కడే మరణించగా వారి ఇద్దరు కుమార్తెలు రోషిణి(22), హర్షిత(20) గాయపడ్డారని పోలీసులు చెప్పారు. వారిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించినట్లు వారు తెలిపారు. ఓంప్రకాశ్, అతని భార్యతోపాటు ఇద్దరు మైనర్ కుమార్తెలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.