Monday, December 23, 2024

శాపగ్రస్త వృద్ధాప్యం

- Advertisement -
- Advertisement -

పిల్లలను కని, పెంచి, పెద్ద చేసి, వారికో జీవితాన్ని ప్రసాదించే తల్లిదండ్రులు అదే పిల్లల చేతిలో నిర్లక్ష్యానికి గురవుతున్న సంఘటనల గురించి వింటూనే ఉన్నాం. తమ హక్కుల పరిరక్షణ కోసం పటుతరమైన చట్టాలు ఉన్నా, వయో భారం కారణంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ, న్యాయస్థానాల చుట్టూ తిరగలేక నిస్సహాయ స్థితిలో మిన్నకుండిపోతున్న వృద్ధులు ఎక్కువ మందే ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులను ఆశించే పిల్లలు వారి బాగోగుల పట్ల శ్రద్ధ వహించడం లేదనడానికి ఉదాహరణలు కోకొల్లలు.

ఈ నేపథ్యంలో వృద్ధులు తమ పిల్లల సంరక్షణలో ఉండేలా చూడటమే సీనియర్ సిటిజన్ యాక్ట్ పరమోద్దేశమంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు… జీవనయాత్రలో చివరి అంకానికి చేరుకున్న వృద్ధులకు ఊరట కలిగించేదే. ముంబయికి చెందిన ఓ వృద్ధుడిని సరిగ్గా చూసుకోవడం లేదనే కారణంతో ఆయన తన కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ లను రద్దు చేస్తూ మెయింటెనెన్స్ ట్రైబ్యునల్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు కొట్టివేస్తూ.. పిల్లలకు తాము బహుమతిగా ఇచ్చిన ఇంట్లో వారి వృద్ధ తల్లిదండ్రులు ఉండేలా చూడటమే ఈ చట్టం ప్రధానోద్దేశమంటూ స్పష్టం చేసింది. శాంతి, సహనం, సమభావం అనే త్రిసూత్రం భారతీయతకు నిర్వచనం. పిన్నలు, పెద్దల పట్ల ప్రేమాభిమానాలు కనబరచాలంటూ మన సమాజం ఉగ్గుపాలతోనే నేర్పుతుంది.

జన్మనిచ్చే తల్లిదండ్రులు దైవ సమానులని పేర్కొంటూ మాతృదేవోభవ, పితృదేవోభవ అని వేదాలు సైతం చెబుతున్నాయి. అయితే పాశ్చాత్య పోకడలకు అలవాటు పడిన నేటి యువతరం కుటుంబంలో తల్లిదండ్రులూ భాగమనే మౌలిక సూత్రాన్ని విస్మరించి, న్యూక్లియర్ ఫ్యామిలీ అనే సరికొత్త దుస్సంప్రదాయాలకు తెరతీసింది. ఫలితంగా పిల్లలు, మనుమలు, మనుమరాళ్ల మధ్య సంతోషంగా శేష జీవితాన్ని గడపవలసిన తల్లిదండ్రులు విధిలేని పరిస్థితుల్లో వృద్ధాశ్రమాలను ఆశ్రయించవలసివస్తోంది. నానాటికీ తీసికట్టుగా తయారవుతున్న వృద్ధుల స్థితిగతులను గమనించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం 1999లో వృద్ధుల సంక్షేమం కోసం ఒక జాతీయ ప్రణాళికను రూపొందించింది. ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, వసతి వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దిన ఈ ప్రణాళిక ఆచరణలో నీరుగారిపోయింది. దరిమిలా 2007లో వృద్ధుల సంరక్షణే ధ్యేయంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ రూపుదిద్దుకుంది. అయితే న్యాయం జరగాలంటే ఏళ్లూపూళ్లూ పడుతుందనే భయంతో చాలామంది వృద్ధులు న్యాయస్థానాల జోలికి పోవడం లేదు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నాలుగు నుంచి ఆరు శాతం మంది వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. కొంతమంది తమ కన్నబిడ్డలు, కోడళ్లు, అల్లుళ్ల చేతిలో వేధింపులకు గురవుతున్నారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు తీసుకుని వారిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి వెళ్లగొట్టే ప్రబుద్ధులు కూడా లేకపోలేదు. వేధింపులు తాళలేక బయటకొచ్చి, శరీరం సహకరించకపోయినా జీవనోపాధి కోసం కూలీనాలీ చేసుకునే వృద్ధుల్ని సమాజంలో గమనిస్తూనే ఉన్నాం. పైపెచ్చు ఇళ్లలో వేధింపులకు గురవుతున్న వృద్ధుల గురించి సమాజానికి తెలియడం లేదు. ఇక అసంఘటిత రంగంలో దినసరి కూలీలుగాను, చేతివృత్తులు చేపట్టి జీవితాలు గడిపినవారు వృద్ధాప్యం వచ్చేసరికి బిడ్డల నిరాదరణకు గురై, ఆలనాపాలనా చూసేవారు లేక వీధులపాలవుతున్నారు. ప్రపంచంలో వృద్ధుల జనాభా 2030 నాటికి 1.4 బిలియన్లకు చేరుతుందని అంచనా. భారతదేశంలోనూ 60 ఏళ్లు దాటినవారు 11 కోట్లమంది వరకూ ఉన్నారు. రానున్న ఇరవై ఏళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని వివిధ సర్వేలు చెబుతున్నాయి.

వృద్ధులను గుదిబండలుగా భావిస్తున్న కుటుంబ సభ్యులకు.. వారి అపారమైన అనుభవం కుటుంబ నిర్వహణకు తోడ్పడుతుందన్న ఇంగితజ్ఞానం లోపించడం విచారకరం. ప్రభుత్వాలు సైతం వృద్ధుల అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందించడం లేదు. దీంతో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ ఏం చేయాలో పాలుపోక ఎందరో ఇంటికే పరిమితమవుతున్నారు. వృద్ధులకు జీవితంపై భరోసా కల్పించే విధంగా వారికి ప్రభుత్వాలు ప్రత్యేక హక్కులు కల్పించవలసిన అవసరం ఉంది. చట్టాలు చేసినంతమాత్రాన సరిపోదు, వాటిని పటిష్టంగా అమలయ్యేలా చూడటం పాలకుల కర్తవ్యం. వృద్ధుల సంక్షేమానికి ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అలాగే వారికి ఉచిత న్యాయసహాయం అందుబాటులో ఉండేలా చూడటమూ అత్యంత ఆవశ్యకం. అత్తా ఒకింటి కోడలే అన్నట్లు నేటి పిల్లలూ రేపటి వృద్ధులే అనే విషయాన్ని ఇప్పటి యువతరం గుర్తెరిగి మసలు కోవడం అందరికీ శ్రేయోదాయకం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News