అస్సాం ప్రజలకు మన్మోహన్ పిలుపు
న్యూఢిల్లీ /గువాహటి: మతం, సంస్కృతి, భాష ప్రాతిపదికన సమాజాన్ని చీలుస్తున్నారని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక సిద్ధాంతాలను పరిరక్షించే ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకోవాలని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్సాం ప్రజలకు పిలుపునిచ్చారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తొలి విడత పోలింగ్ మార్చి 27న(శనివారం) జరగనున్నది. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ అస్సాం ప్రజలనుద్దేశించి ఒక వీడియో సందేశం విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అస్సాంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) అమలు చేయబోదని ఆయన హామీ ఇచ్చారు. అస్సాంలో ఉద్రిక్త వాతావరణం, భయాందోళన పరిస్థితి నెలకొని ఉందని, ప్రజలు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వివేకంతో ఓటు వేయాలని ఆయన కోరారు. అస్సాంలో మూడు విడతలుగా 126 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది. మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6 తేదీలలో పోలింగ్ జరగనున్నది. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.