Friday, December 20, 2024

ఢిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే
ప్రభుత్వ నిర్ణయాలకు ఎల్‌జి కట్టుబడి ఉండాల్సిందే
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు
గత తీర్పును పక్కన పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణాధికారం ఎవరిది ఉండాలనేవివాదంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది. ప్రభుత్వాధికారులపై ఎన్నికైన ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఏకగ్రీవ తీర్మానం వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టెనెంట్ గవర్నర్ (ఎల్‌జి) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అధికారాలకు సంబంధించి రెండో జాబితాలో ప్రత్యేకంగా మినహాయించిన పబ్లిక్ ఆర్డర్, సోలీసు, భూమి మినహా మిగతా రెండు జాబితాల్లో (రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు)పేర్కొన్న అన్నింటిపైనా ఢిల్లీ చట్టసభకు పూర్తి అధికారాలు ఉండాలని అని తన 105 పేజిల తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది.

‘ప్రజాస్వామ్యం, ఫెడరల్ విధానాలు రాజ్యాంగ మూల స్వరూపంలో భాగమే. ప్రజాస్వామ్యంలో అసలైన అధికారాలు ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉండాలి. పాలనా వ్యవహారాలపై నియంత్రణ కూడా వారిదే. ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాలకు లెఫ్టెనెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలి. అధికారులు మంత్రులకు నివేదించకపోతే.. వారి ఆదేశాలను పాటించకపోతే.. అప్పుడు సమగ్రపాలనా విధానాలపై అది తీవ్ర ప్రభావం చూసిస్తుంది’ అని సుప్రీంకోర్టు తెలిపింది. ‘ఢిల్లీ.. దేశంలోని ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లాగా ఉండదు. దేశ రాజధాని అయినందున దీనికి ప్రత్యేక స్వరూపం ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ ఆర్డర్, భూమి,పోలీసు వ్యవస్థపై కార్యనిర్వాహక అధికారాలు కేంద్రానికే ఉంటాయి. అయితే , ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఢిల్లీలో కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది.అందువల్ల పాలనా సర్వీసులపై అసలైన అధికారాలు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వానికే ఉంటాయి’ అని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది.

ఈ ధర్మాసనంలో చంద్రచూడ్‌తో పాటుగా న్యాయమూర్తులు ఎంఆర్ షా, కృష్ణమురళి, హిమాకోహ్లీ, పిఎస్ నరసింహ కూడా ఉన్నారు. ఢిల్లీలోని అన్ని పాలనా సర్వీసులపై కేంద్రానికే నియంత్రణ ఉంటుందంటూ 2015లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ సానుకూల ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దీనిపై సర్వోన్నత న్యాయస్థానం నాలుగున్నర రోజులపాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఆ క్రమంలోనే జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎకె సిక్రిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం 2019 ఫిబ్రవరి 14న ఈ వివాదంపై భిన్నాభిప్రాయ తీర్పును వెలువరించింది.పాలనా సర్వీసలుపై ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవని జస్టిస్ భూషణ్ పేర్కొనగా, జస్టిస్ సిక్రి దాన్ని వ్యతిరేకించారు. కాగా ఢిల్లీలోని పాలనాధికారుల నియంత్రణ కు సంబంధించిన శాసన, కార్యనిర్వాహక అధికారం కేంద్రానిదా,ఆ రాష్ట్రప్రభుత్వానిదా అనే వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేస్తున్నట్లు గత ఏడాది మే 6న సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే జస్టిస్ అశోక్ భూషణ్ ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం తోసిపుచ్చింది.

ప్రజాస్వామ్యం గెలిచింది: కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీలో పాలనా సర్వీసులపై అధికారాలు స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటాయంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పే ర్కొంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలకు న్యాయం జరిగిందంటూ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.తాజా తీర్పుతో దేశ రాజధానిలో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. రాష్ట్రప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు. మరో వైపు అధికారుల నియామకాలు, బదిలీల అధికారం ఇప్పుడు రాష్ట్రప్రభుత్వానికి దక్కిందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.

తాజా తీర్పును కీలకమైనదిగా ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా అభివర్ణించారు.‘సత్యమేవ జయతే. ఢిల్లీ గెలిచింది. ఇక్కడి అధికారులు స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవలందించాలని, పాలనను స్తంభింపజేసేందుకు కేంద్రం నియమించిన, ప్రజలు ఎన్నుకోని వ్యక్తుల( ఎల్‌జి)ద్వారా కాదన్న కఠిన సందేశాన్ని తాజా తీర్పు పంపుతోంది’ అని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు తమ ప్రభుత్వానికి దాని హక్కును కట్టబెట్టిందని ఆప్ సీనియర్ నేత, మంత్రి అతిశీ వ్యాఖ్యానించారు.‘సిఎం కేజ్రీవాల్ ల్లీ ప్రజలకోసం ఎనిమిదేళ్లు సుదీర్ఘన్యాయపోరాటం చేశారు. ఈ రోజు ప్రజలు గెలిచారు’ అని మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News