Sunday, January 19, 2025

లోపాలు లేకుండా ఎన్నికల ఏర్పాట్లు చేయాలి

- Advertisement -
- Advertisement -

అవరాన్ని బట్టి జిల్లా గ్రీవెన్సెస్ కమిటీ సమావేశం జరిపాలి
వీడియో కాన్పరెన్స్‌లోజిల్లా అధికారులకు సిఈవో వికాస్‌రాజ్ సూచనలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్ తేదీ సమీపిస్తున్నందున, జిల్లాల్లో ఎన్నికల విధుల్లో ఉన్న ఈఆర్‌ఓలు, ఆర్‌ఓలతో ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల ఏర్పాట్లు ఎంతో పకడ్బందీగా చేయడంలో అందరం నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ అక్కడక్కడ ఇంకా అసంపూర్తి ఛాయలు కనిపిస్తున్నాయని, చిన్నవే అయినా ప్రజల నుండి, రాజకీయ పార్టీల నుండి అక్కడక్కడా వస్తున్న ఫిర్యాదులను వారి దృష్టికి తెచ్చారు. జిల్లా గ్రీవెన్సెస్ కమిటీని అవసరాన్నిబట్టి సమావేశ పరుస్తూ అన్ని నియమనిబంధనలను పరిగణనలోకి తీసుకునిహేతుబద్ధమైన కేసులను వెంటనే పరిష్కరించేలా చూడాలని కోరారు.

జిల్లా ఫిర్యాదుల కమిటీ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి జప్తు చేయబడిన అంశంలో రశీదు తప్పనిసరిగా ఇవ్వాలని, ఒక వేళ అట్టి పార్టీ ఇంకనూ జప్తుకు సంబంధించి అసంతృప్తితో ఉన్నట్లయితే ఎవరికి అప్పీలు చేసుకోవాలో వివరించాలని ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. ఓటర్లలో విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని డిజిపి అంజనీ కుమార్ సూచించారు. పోలీసు నిఘా, పనితీరు ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఫ్లాగ్ మార్చ్, డ్రోన్లతో చిత్రీకరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలని మహేశ్ భగవత్ పేర్కొన్నారు.

నగదు, మద్యం, బంగారం వంటివి పట్టుబడ్డప్పుడు తప్పకుండా రసీదులు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు అసంపూర్తి నివేదికలు కాకుండా, స్పష్టమైన తీర్మానాలతో పంపాలని లోకేష్ కుమార్ కోరారు. వివిధ ఫారమ్‌ల వినియోగాన్ని సర్ఫరాజ్ తెలియజేశారు. పోస్టల్ బ్యాలట్ అవసరమైన వారి కోసం 12 డి ఫారమ్‌ను తమ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయాలని సత్యవాణి జిల్లా సీనియర్ అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో జరిగిన ఇంటరాక్టివ్ వీడియో కాన్ఫరెన్స్‌లో దాదాపు అన్ని జిల్లాల నుండి ఇఆర్‌ఓలు, ఆర్‌ఓలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News