రేపే పోలింగ్, సమయం ఉ.7 నుంచి రాత్రి 7గం.వరకు
346 కేంద్రాల్లో ఏర్పాట్లు సాయంత్రం 6 తర్వాత కొవిడ్ రోగులకు అనుమతి ఎడమ చేయి
మధ్యవేలికి సిరా గుర్తు 2,20,300మంది ఓటర్లు శానిటైజర్లు, ఓటర్లు భౌతికదూరం
పాటించేలా ఏర్పాట్లు : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్
మనతెలంగాణ/హైదరాబాద్: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం గురువారం రాత్రి 7 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ తెలిపారు.కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 17న(శనివారం) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు.సాధారణంగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుందని, కొవిడ్ నేపథ్యంలో 2 గంటలు అదనంగా పోలింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు గంటపాటు కొవిడ్ పాజిటివ్ రోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతిస్తామని తెలిపారు. పిపిఇ కిట్లు ధరించి వారు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఇందుకోసం ఆరోగ్య శాఖ అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. ఓటర్లు అందరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఓటర్లు కూడా కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ ఓటేయాలని పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో సిఇఒ శశాంక్ గోయల్ మీడియాతో మాట్లాడారు. గురువారం రాత్రి 7 గంటలకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసిందని, ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు, కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని తెలిపారు. శుక్రవారం హోలియాలో సిబ్బందికి ఇవిఎంలు, ఇతర సామాగ్రిని అందజేస్తామని చెప్పారు. సిబ్బంది ఎన్నికల సామాగ్రిని తీసుకుని సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు తరలివెళతారని పేర్కొన్నారు.
అదనంగా 53 పోలింగ్ కేంద్రాలు
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సిఇఒ శశాంక్ గోయల్ వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో రెగ్యులర్‌గా 293 పోలింగ్ కేంద్రాలు ఉండేవని, కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని అదనంగా 53 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాలలో శానిటైజర్లు అందుబాటులో ఉంచడంతో పాటు ఓటర్లు భౌతికదూరం పాటించేలా కేంద్రాలలో ఓటర్లు నిల్చునేందుకు బాక్సులు గీస్తున్నట్లు చెప్పారు. ఓటర్లు అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి పోలింగ్ కేంద్రాలకు రావాలని, పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు డిస్పోజబుల్ గ్లౌజులను అందజేయనున్నట్లు తెలిపారు.
రూ.46 లక్షల నగదు,7,424 లీటర్ల మద్యం స్వాధీనం
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద 13 కేసులు, నిబంధనల ఉల్లంఘనల కింద 116 కేసులు నమోదు చేశామని శశాంక్ గోయల్ అన్నారు. తనిఖీల్లో రూ.46.79 లక్షల నగదు, 7,424 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు 71 కేసులు నమోదు చేసి 8 మందిని ఆబ్కారీ శాఖ అరెస్టు చేసిందని సిఇఒ వెల్లడించారు.
వారికి మధ్య వేలికి సిరా గుర్తు
నాగార్జున సాగర్ నియోజకవర్గం ఓటర్లలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లకు ఈ ఉప ఎన్నికలో ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు వేయనున్నట్లు సిఇఒ శశాంక్ గోయల్ తెలిపారు. ఎంఎల్‌సి ఎన్నికల సందర్భంగా ఓటర్లకు చూపుడు వేలుకు సిరా గుర్తు వేశారని, చాలామందికి ఆ గుర్తు అలాగే ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు వేయనున్నట్లు వెల్లడించారు.ఈ మేరకు కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశామని అన్నారు.
2,20,300 మంది ఓటర్లు
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటర్లు ఉన్నారని సిఇఒ శశాంక్ గోయల్ వెల్లడించారు. అందులో 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. నాగార్జన సాగర్ ఉప ఎన్నికలో మొత్తం 41 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో 8,151 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోనున్నారని వెల్లడించారు. అందులో ఇప్పటికే 1,433 మందికి పోస్టల్ బ్యాలెట్ పంపిణీ చేసినట్లు తెలిపారు.పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, కొవిడ్ రోగులు, ఇతరులు ఉన్నారని చెప్పారు.ఇందుకోసం అవసరమైన ఇవిఎంలతో పాటు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఇవిఎంను మార్చేలా అదనపు ఇవిఎంలను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. 346 పోలింగ్ కేంద్రాలలో ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుందని, పోలింగ్ కేంద్రాలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే దానిని పరిష్కరించేలా సాంకేతిక నిపుణులను అందుబాటులో ఉంచుతున్నారని పేర్కొన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్, సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షిస్తామని తెలిపారు.
5,535 మంది సిబ్బంది
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సజావుగా నిర్వహించేలా మొత్తం 5,535 ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు శశాంక్ గోయల్ వెల్లడించారు.అందులో 2,390 పోలిసులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. 1,622 మంది పోలింగ్ సిబ్బంది, 130 మైక్రో అబ్జర్వర్లు, 210 మంది వెబ్‌క్యాస్టింగ్ సిబ్బంది, 44 మంది సెక్టార్ ఆఫీసర్లు, 293 మంది బిఎల్‌ఒలు, 710 మంది ఆరోగ్య శాఖ సిబ్బంది, 95 మంది డ్రైవర్లు సాగర్ ఉప ఎన్నికలలో విధులు నిర్వహిస్తారని అన్నారు.
Election Campaign ends for Nagarjuna Sagar bypolls