Sunday, January 5, 2025

ఎన్నికల కోడ్ కూసింది

- Advertisement -
- Advertisement -

తనిఖీలు ప్రారంభించిన పోలీసులు
ఎన్నికల నిబంధనలు పాటించాలని అధికారుల సూచనలు
అభ్యర్థుల ఎన్నికల వ్యయం రూ. 40 లక్షలు

మన తెలంగాణ/ హైదరాబాద్:  కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలుల్లోకి వచ్చింది. సోమవారం మధ్యాహ్నం నుంచే పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. కోడ్ అమలులోకి వచ్చిన నేపధ్యంలో ఈ క్రింది నిబంధనలను అధికారులు, వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులు, పాటించాల్సి ఉంటుంది.

1. అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలన యంత్రాగాన్ని వినియోగించుకోకూడదు.
2. అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండకూడదు.
3. ముఖ్యమంత్రితో సహా ఎవరైనా సరే హెలికాప్టర్‌తోపాటు ఇతర ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు.
4. సెక్యూరిటీ వాహనాల్లోనూ మూడు కంటే ఎక్కువ వాడితే దానిని ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీ చూపించాలి.
5. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది.
6. ప్రభుత్వ వసతి గృహాలు, సభాస్థలిలు, హెలిప్యాడ్‌లు తదితర సౌకర్యాలను కేవలం అధికారపార్టీ వారి వినియోగానికే కాకుండా ఇతర పార్టీలకూ అవకాశం కల్పించాలి.
7. పత్రికల్లో, టివిల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు.
8. టివిల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి, అనుమతి పొందాలి.
9. ఎన్నికల నియమావళి వెలువడ్డాక ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు.కొత్త పథకాలు ప్రకటించకూడదు.
శంకుస్థాపనలు చేయకూడదు.రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు.

అభ్యర్థుల ఎన్నికల వ్యయం: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి రూ. 40లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఈఖర్చులు అభ్యర్థుల రోజు వారీ ప్రచార కోసం ఉపయోగించే సామాగ్రి, వాహనాల ఖర్చు, ప్రచారం చేసే అనుచరులకు రోజు ఆహారం వంటి వాటికి ఖర్చు చేయాలి. జిల్లా ఎన్నికల అధికారి వారికి అందజేసే ప్రత్యేక బుక్‌లెట్‌లో రోజు వారి వ్యయాలు నమోదు చేయాలి. 2018 ఎన్నికల్లో అభ్యర్థులు రూ. 28 లక్షలు ఎన్నికల వ్యయం ఉండేది. మునుగోడు ఎన్నికల తరువాత పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల వ్యయం పరిశీలించేందుకు జిల్లా ఎన్నికల ఆధ్వర్యంలో షోడో టీమ్‌లు పర్యవేక్షిస్తుంటాయి. వారి లెక్కలకు, అభ్యర్థుల ఆడిటర్ లెక్కలకు సమానం ఉండాలి.

రూ. 50వేల కంటే ఎక్కువ ఉంటే ఆధారాలు చూపించాలి ః నోటిఫికేషన్ రావడంతో ఎన్నికల కోడ్ అమలుల్లోకి వచ్చింది. ప్రజలు రూ. 50వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లాంటే ఆధారాలు చూపించాలి. ఆసుపత్రిలో వైద్య ఖర్చులకు కోసం అయితే రోగి వైద్యుల రిపోర్టులు, శుభకార్యాలైతే సంబంధిత పత్రాలు తప్పనిసరి చూపాలి. ధాన్యం, భూమి అమ్మకాలు చేస్తే బిల్లులు, డాక్యుమెంట్లు చూపాలి లేకుంటే పోలీసులు సీజ్ చేస్తారు. ఎన్నికల ముగిసిన తరువాత ఆధారాలు చూపిస్తే తిరిగి ఇస్తారు.

ఎన్నికల కోడ్ పోలీసుల విస్తృత తనిఖీలు: రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పివి మార్గ్, ఐమ్యాక్స్ వద్ద వాహనాలను క్షుణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేకుండా భారీ డబ్బు పట్టుపడితే సీజ్ చేస్తున్నారు. వనస్దలిపురంలో రూ. 4లక్షలు పట్టుకున్నారు. గచ్చిబౌలిలో కుక్కర్లు పంపిణీ చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు.

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్..
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శంకుస్థాపనలు, ఆవిష్కరణలు ఆగిపోయాయి. సోమవారం మధ్యాహ్నం ట్రైబల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవం, రాంజీగోండు స్మారక ట్రైబల్ మ్యూజియంకు శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో అవి నిలిచిపోయాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News