Saturday, January 4, 2025

రూ.3.35 కోట్ల హవాలా నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నగదు, మద్యం, డ్రగ్స్, ఇతరత్రా ప్రలోభాల విషయమై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో తనిఖీలు షురూ చేసింది.. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. రోడ్ నెంబర్ 3 వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న కియా కారును తనిఖీ చేయగా భారీగా నగదు రూ. 3 కోట్ల 35 లక్షల నగదు పట్టుబడింది.

ఈ నగదుకు సంబంధించిన లెక్కలు చూపించకపోవడంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన నగదు హవాలా మనీగా గుర్తించామని వెస్ట్‌జోన్ డిసిపి జోయల్ డెవిస్ తెలిపారు. హనుమంతరెడ్డి, బచ్చల ప్రభాకర్, మండల శ్రీరాములురెడ్డి, ఉదయ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు. హనుమంత్‌రెడ్డి సూచన మేరకు ప్రభాకర్, శ్రీరాములు, ఉదయ్ కుమార్ హవాలా మనీ సేకరిస్తూ ఉంటారన్నారు. ఇందు నిమిత్తం అరోరా కాలనీలో సాయికృప బిల్డింగ్ ప్లాట్ నెం.583ని తమ కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నారు. సేకరించిన హవాలా డబ్బును తమ కార్యాలయానికి తీసుకెళ్తున్న సమయంలో సీజ్ చేశామని వెల్లడించారు. కోటి హవాలా మనీకి రూ.25,000 కమిషన్‌గా తీసుకుంటారన్నారు. మంగళవారం ఉదయం రూ.3.35 కోట్లు వసూలు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును కోర్టులకు అప్పగిస్తామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాహనాల తనిఖీలు మరింత విస్తృతం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ షురూ అయిన సోమవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండిని స్వాధీనం చేసుకోవడం ఈ సందర్భంగా గమనార్హం. మరోవైపు గుర్తింపు పత్రాలు లేకుండా నగదు కనబడితే వెంటనే సీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా హైవేపై వెళ్తున్న వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు.

పోలీసుల సూచనలు
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. రూ. 50 వేలకు మించి నగదుతో వెళ్తే అందుకు సంబంధించిన పత్రాలు, రశీదులు, డాక్యుమెంట్లు కచ్చితంగా వెంట ఉంచుకోవాలని సూచించారు. అలా లేని క్రమంలో నగదు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల నాయకులు సైతం ప్రభుత్వ సొమ్ముతో పార్టీలు, తమ నివాసాల వద్ద ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని పేర్కొన్నారు. సొంత ఖర్చుతో మాత్రం ఈ కార్యక్రమాలు చేసుకునేందుకు అనుమతి ఉందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News