Thursday, December 19, 2024

మోగిన ఎన్నికల నగారా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. తెలంగాణ,మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ సోమవారం మధ్యాహ్నం విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు. ఒకే విడతలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నామినేషన్ల దాఖలకు నవంబర్ 10చివరి తేదీ వెల్లడించారు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15 అని ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3వ తేదీ(ఆదివారం) జరుగుతుందని చెప్పారు. ఇక , మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 23న, మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్ జరుగుతుంది.

కాగా, చత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశలో నవంబర్ 7న, రెండో దశలో నవంబర్ 17నఎన్నికలు జరుగనున్నాయి. ఇక అన్ని రాష్ట్రాల్లో డిసెంబర్ 3ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. సోమవారంనుంచే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు సిఇసి తెలిపారు.అన్ని రాష్ట్రాల్లో 40 రోజులపాటు పర్యటించి రాజకీయ పార్టీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజన్సీలు సహా భాగస్వాములందరితోను విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాత ఎన్నికల తేదీలను ఖరారు చేసినట్లు ఆయన చెప్పారు.తెలంగాణలో 3.17 కోట్ల ఓటర్లు ఉండగా, రాజస్థాన్‌లో 5.25 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్లు, చత్తీస్‌గఢ్‌లో2.03 కోట్లు, మిజోరాంలో 8.52 లక్షల ఓటర్లు ఉన్నారు. అయిదు రాష్ట్రాల్లో మొత్తం 16.14 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో కొత్తగా చేరిన ఓటర్లు 60 లక్షల మంది ఉన్నారు.

ఐదు రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల ఓటర్లు ఉండగా, ఇందులో పురుష ఓటర్లు 1.58 కోట్లు, మహిళా ఓటర్లు 1.58 కోట్లు ఉన్నారు. తొలిసారి ఓటు హక్కు వచ్చిన వారు 8.11 లక్షలు ఉన్నారు. ఈ సారి కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్య 17,01,087గా ఉంది. రాష్ట్రంలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందులో వెబ్ క్యాస్టింగ్ సౌకర్యం ఉండే కేంద్రాలు 27798 (78 శాతం),597 మహిళా పోలింగ్ కేంద్రాలు,644 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 120 దివ్యాంగ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ప్రతి 879 మంది ఓటర్లకు ఓ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

నగదు, మద్యం, ఉచితాల స్వాధీనాలు ఎప్పటికప్పుడు రికార్డు చేసేందుకు కొత్త ప్లాట్‌ఫామ్
కాగా ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకుపంపిణీ చేసే ఉచిత తాయిలాలు, నగదు, డ్రగ్స్, మద్యంలాంటి వాటి స్వాధీనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు రికార్డు చేయడానికి తొలిసారిగా టెక్నాలజీ ఆధారిత యంత్రాగాన్ని ఉపయోగించబోతున్నట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ఏజన్సీలు స్వాధీనం చేసుకున్న వాటిని ఎప్పటికప్పుడు రికార్డు చేసేందుకు ‘ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్’గా పిలవబడే ఈ సరికొత్త టెక్నాలజీ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోనున్నట్లు ఆయన చెప్పారు.

తాము స్వాధీనం చేసుకున్న వాటిని ఈ వ్యవస్థలోఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాల్సిందిగా వివిధ ఏజన్సీలను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు లేకుండా చేయడానికి ఉపయోగించే కొన్ని సాధనాల్లో ధన బలం,డ్రగ్స్, ఉచిత తాయిలాలులాంటి వాటిని గుర్తించినట్లు చెప్పారు. అక్రమ నగదు, డ్రగ్స్, చీరలు, మద్యంలాంటి ఉచిత తాయిలాల తరలింపును అడ్డుకోవడం కోసం అయిదు రాష్ట్రాల్లో వివిధ ఏజన్సీలకు చెందిన మొత్తం 940 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News