Thursday, December 26, 2024

టిఆర్‌ఎస్ టు బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

మొన్నటి దసరా నాడే పేరు
మార్చుకున్న పార్టీ
గురువారం నాడు
ఆమోదించిన ఇసి
స్వరాష్ట్ర సాధన కోసం 2001లో
టిఆర్‌ఎస్ ఆవిర్భావం
జాతీయ రాజకీయాల్లో మార్పు
కోసమే బిఆర్‌ఎస్‌గా
అవతరణ

హైదరాబాద్ : 21 సంవత్సరాల టిఆర్‌ఎస్ ప్రస్తానంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్యమ పార్టీగా అవతరించిన టిఆర్‌ఎస్…ఇక బిఆర్‌ఎస్‌గా మారింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఆవిర్భవించిన టిఆర్‌ఎస్ పార్టీ పేరు మార్చుకుని జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతోంది. ఇందుకు నాంది అక్టోబర్ 5వ తేదీ (దసరా పండుగ)న మధ్యాహ్నం 1.19 గంటలకు పడింది. ఆ రోజున టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చుతూ దసరా రోజున నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో సిఎం కెసిఆర్ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్మానంపై సిఎంతో పాటు 283 మంది ప్రతినిధులు సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 8 రాష్ట్రాలకు చెందిన నేతలు సైతం హాజరయ్యారు. ఈ తీర్మానం కాపిని దసరా మరుసటి రోజునే కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఆమోదం తెలిపింది.

ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ ఆవిర్భావ సంబురాలను శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేటి మధ్యాహ్నం సరిగ్గా 1:20 గంటలకు దివ్య ముహూర్త సమయాన ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భావం కార్యక్రమాన్ని అట్టహాసంగా జరపనున్నారు. ఇక తెలంగాణ పరిధి నుంచి జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చెందనుంది. ఉద్యమ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీ అధినేతగా మొదలైన కెసిఆర్ ప్రస్థానం జాతీయ పార్టీ అధ్యక్షుడి స్థాయికి చేరనుంది. జాతీయ రాజకీయాల్లో మార్పు తేవడమే లక్ష్యమంటూ దసరా పండుగ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీని ప్రకటించి దేశ రాజకీయాలను కెసిఆర్ ఒక్క కుదుపు కుదిపేశారు. అయితే ప్రస్తుతం టిఆర్‌ఎస్ పార్టీ జెండా ఉన్నట్లుగా బిఆర్‌ఎస్ జెండా కలర్ కూడా గులాబీ రంగులోనే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడున్న జెండానే ఉండనుంది.

పార్టీ గుర్తు కూడా కారే ఉంటుంది. వాస్తవానికి టిఆర్‌ఎస్ పార్టీని 2001లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పార్టీ పరిధిని తెలంగాణ ప్రాంతం వరకే పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా, ఉద్యమ పార్టీగా కెసిఆర్ టిఆర్‌ఎస్‌ను స్థాపించారు. .అయితే మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీ అయిన టిఆర్‌ఎస్….బిఆర్‌ఎస్‌తో శరవేగంగా జాతీయ స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోవడం కూడా తథ్యంగా కనిపిస్తోంది.
అంచెలంచలుగా ఎదిగిన టిఆర్‌ఎస్
2001, ఏప్రిల్ 27వ తేదీన కొంతమంది తెలంగాణ వాదుల సమక్షంలో పురుడు పోసుకున్న టిఆర్‌ఎస్ పార్టీ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక అజెండాగా ముందుకొచ్చింది. ఒక వైపు ఉద్యమం.. మరోవైపు రాజకీయపంథా…! ఇలా దశాబ్ధానికిపైగా ఎన్నో వ్యూహాలు.. ప్రతివ్యూహాలు.. అటుపోటులు ఇలా అన్నింటిని ఎదుర్కొని నిలబడింది. పార్టీ అధినేత కెసిఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి… దేశ రాజకీయ యవనికపై తనకంటూ ఓ చరిత్రను లిఖించుకుంది. అలాంటి పార్టీ జాతీయ స్థాయిలో విస్తరణ దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టిఆర్‌ఎస్ ఏర్పాటు ఓ సంచలనం. ఇందుకోసం హైదరాబాద్ లోని జలదృశ్యం వేదికైంది.

2001 ఏడాదిలో అప్పటి అధికార పార్టీ టిడిపికి రాజీనామా కెసిఆర్ రాజీనామా చేశారు. టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో కీలక ప్రసంగం చేశారు. పార్టీ ఏర్పడిన కొద్దిరోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఇందులో పోటీ చేసిన టిఆర్‌ఎస్… పలు స్థానాల్లో విజయం సాధించింది. ఇదే క్రమంలో తెలంగాణలోని పది జిల్లాల్లోనూ సభలు.. పాదయాత్రల పేరుతో రాష్ట్ర ఏర్పాటు విషయంలో భావజాలవ్యాప్తికి ఎంతో కృషి చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళుతూనే.. మరోవైపు రాజకీయంగా ఎదిగేలా పావులు కదిపింది. ఇందులో భాగంగా 2004లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది. ఈ ఎన్నికల్లో 42 స్థానాల్లో పోటీ చేసి.. 26 స్థానాల్లో విజయం సాధించింది ది.

6 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన టిఆర్‌ఎస్… ఐదింట్లో గెలిచి విజయబావుటా ఎగరవేసింది. ఇలా మొదలైన ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ మొండిచేయి చూపటంతో బయటికి వచ్చిన కెసిఆర్ ఉప ఎన్నికలకు వెళ్లారు. గతంలో కంటే కొన్ని స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇక కరీంనగర్ ఉప ఎన్నికల్లో కెసిఆర్ గెలుపు ఓ చరిత్ర సృష్టించింది. ఇక 2009లో మహాకూటమితో జట్టుకట్టిన కెసిఆర్, టిడిపితో పాటు కమ్యూనిస్టులతో జై తెలంగాణ అనిపించగలిగారు. అయితే ఈ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. ఒక దశలో టిఆర్‌ఎస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఆ తర్వాత 14 ఎఫ్‌పై సుప్రీంతీర్పుతో కెసిఆర్ దీక్షకు దిగడంతో టిటీఆర్‌ఎస్ మళ్లీ ఫామ్ లో కి వచ్చేసింది. తిరుగులేని ఆదిపత్యాన్ని సాధించింది. ఆరోజు నుంచి 2014 వరకు ఉద్యమాన్ని నడిపించటంలో అగ్రభాగాన నిలించింది.

చాలా మంది చరిత్ర నుంచి ప్రభావితమవుతారు. కొందరే చరిత్రను ప్రభావితం చేస్తారు. అలాంటి వారిలో కెసిఆర్ ఒకరుగా మిగిలారు. తెలంగాణ సమాజాన్ని ఊగించి, ఉరికించి, శాసించి విజయతీరాలకు చేర్చారు. ఆయన ఉక్కు సంకల్పం, వ్యూహ చతురత ముందు ఆ విధి సైతం తలవంచింది. తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా అవతరించింది. సబ్బండ వర్గాలందరికీ గులాబీ జెండా నీడైంది. వాస్తవానికి టిఆర్‌ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవడమంటే… కెసిఆర్ జీవిత చరిత్ర గురించి చెప్పుకోవడమే. గులాబీ జెండాను, కెసిఆర్‌ను వేరు చేసి చూడలేం. తెలంగాణలో 1969 వరకూ ఒక చరిత్ర. ఆ తర్వాత ఒక చరిత్ర. ఆంధ్ర వలసవాదం సుడిగాలిలో తెలంగాణ అస్తిత్వ స్పృహ ఆరిపోకుండా ఉండటానికి ఎందరో నాయకులు కృషి చేశారు.

1969 ఉద్యమం అణగారిపోయిన తర్వాత ఆ ఆశలు సన్నగిల్లాయి. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించగల మరో నాయకుడు ఉద్భవించగలడా? అని జనం ఆశగా ఎదురు చూశారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. గులాబీ జెండాను చేత పూని కెసిఆర్ బయల్దేరారు. చినుకుగా మొదలైన ఆ ఉద్యమ ప్రస్థానం అనతి కాలంలోనే తుఫాన్గా మారింది. రాష్ట్ర రాజకీయాలనే మార్చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News