Wednesday, January 22, 2025

ఇసి నిర్ణయాలు నిష్పాక్షికమేనా?

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొంత మంది ఉన్నత స్థాయి అధికారులను వారి స్థానాల నుంచి తొలగించమని కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇసి వేటుకు గురైన అధికారుల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు, పోలీస్ కమిషనర్లు, కార్యదర్శి స్థాయి అధికారులున్నారు. ఇది అసాధారణ చర్య. ఇసి ఆదేశం విశ్లేషకులకు చాలా విస్మయాన్ని కలిగించింది. మన వ్యవస్థలో ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు పరిపాలనా యంత్రాంగానికి వెన్నెముక లాంటి వారు.పాలనా వ్యవస్థకి వారు కీలకం. ప్రభుత్వ విధి విధానాలను, కార్యక్రమాలను అమలు చేసేది ఐఎఎస్ అధికారులైతే, శాంతి భద్రతల నిర్వహణ, పర్యవేక్షణ, పోలీసు వ్యవస్థకు నాయకత్వం వహించేదీ ఐపిఎస్ అధికారులు.ఈ రెండు సర్వీసుల అధికారులు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపడంలో గురుతర బాధ్యత కలిగిన వ్యక్తులు. అందుకే ఈ సర్వీసులకు చాలా ప్రతిష్ఠ వుంది. కింది స్థాయి ఉద్యోగులకు దిశానిర్దేశం చేసే బాధ్యత కూడా ఈ అధికారులదే. ఎన్నికల్లో వీరి పాత్ర అత్యంత కీలకం.

ప్రజాస్వామ్యానికి ఊపిరి ఎన్నికలైతే, ఆ ఊపిరి ఆగకుండా చూసే బాధ్యత జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు, పోలీసు కమిషనర్ల మీద వుంటుంది. జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి కూడా.అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగు అధికారులు, ఇతర సిబ్బంది జిల్లా కలెక్టరు పర్యవేక్షణలోనే పని చేస్తారు. అటువంటి స్థానాల్లో వున్న అధికారులను ఎన్నికల విధులకు దూరంగా వుంచడం సామాన్యమైన విషయం కాదు. ఇది వారి నిజాయితీని, నిబద్ధతను ప్రశ్నించినట్లే భావించాలి.ముత్తయిదువులను బతుకమ్మ పండగ వేడుకలకూ, పేరంటానికి రావద్దూ అనటం లాంటిదే ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను ఎన్నికల విధులకు దూరంగా వుండండి అనటం గూడా! ఇది ఆయా అధికారులకు వ్యధ కలిగించే చర్య. వారు మౌనం వహించినా మీడియా, అకడెమియా, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం స్పందించాలి.ఈ అధికారులను మార్చమని ఇచ్చిన ఆదేశంలో వీరి మీద వున్న ఆరోపణలు ఏమిటో చెప్పలేదు. కానీ వీరిని ఎన్నికల విధులకు దూరంగా పెట్టమని ఆ ఆదేశాల సారాంశం అనుకోవచ్చు. ఇందులో పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలు, వరంగల్ కమిషనరు, హైదరాబాద్ పోలీస్ కమిషనరు సివి ఆనంద్ కూడా వున్నారు.

ఆనంద్ నిబద్ధతతో, వృత్తి విలువలు పాటించే అధికారిగా గుర్తింపు పొందారు. అది ఎన్నో ఏళ్ల తరబడి వృత్తి పట్ల అంకిత భావంతో, క్రమశిక్షణతో, బాధ్యత గల నడవడితో సంపాదించుకున్న ప్రతిష్ఠాత్మకమైన గుర్తింపు. మరి అటువంటి అధికారులను కారణాలు చెప్పకుండా ఎన్నికలకు దూరంగా పెట్టమని హుకుం జారీ చేయడం దురదృష్టకరం. కేంద్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ. ఈ స్వయం ప్రతిపత్తి ఉద్దేశం ఏమిటంటే ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ జ్యోక్యం లేకుండా నిష్పక్షపాతంగా జరగాలి. దీని కోసం కమిషనుకు విశేషాధికారాలు కట్టబెట్టింది చట్టం. అయితే, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే అధికారులదే ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించే బాధ్యత కూడా. అందువలన, ఎన్నికల నిర్వహణ అధికారుల నిజాయితీ, నిబద్ధతలకు ఒక కొలమానంగా వుంటుంది మన వ్యవస్థలో. అధికారులు కూడా తమ నిజాయితీ, నిష్పాక్షికత, నిబద్ధతలను కాపాడుకోవటానికి వెనకాడరు. ఈ క్రమంలో వివాదాస్పద అధికారులను పక్కనపెట్టే అధికారం ఎన్నికల సంఘానికి వున్నమాట వాస్తవం.

కానీ మూకుమ్మడిగా అనేక మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించమని ఆదేశించడంలో ఆంతర్యమేమిటో పరిశీలకులకు అర్ధంకావటం లేదు. ఒక రాజ్యాంగ సంస్థగా ఎన్నికల సంఘం నిర్ణయాలు, ముఖ్యంగా 2014 తరువాత పారదర్శకం గా లేవు అన్నభావన వున్నది. దాని నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి ఆధారాలు లేకపోలేదు. 2016లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యా దు అందింది. దీనిని త్రిసభ్య సంఘం విచారించగా అందులో ఇద్దరు సభ్యులు ఉల్లంఘన ఏమీ లేదని తేల్చారు. మరో సభ్యుడు అశోక్ లావాసా ఉల్లంఘన వుంది అని అభిప్రాయపడ్డారు. మెజారిటీ అభిప్రాయమే నిలుస్తుంది గనక ప్రధాన మంత్రి మీద వచ్చిన ఫిర్యాదును కొట్టివేశారు. ఆ తదుపరి అశోక్ లావాసా భార్య నిర్వహించే స్వచ్ఛంద సంస్ధ మీద ఆదాయం పన్ను శాఖ దాడి చేసింది.

అది అశోక్ లావాసా ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయానికి చెల్లించుకున్న మూల్యంగా భావించారు. మరి కొంత కాలం తరువాత ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఎన్నికల సంఘానికి ఒక వర్తమానం వచ్చింది. ప్రధాన మంత్రి కార్యదర్శి నిర్వహించే సమావేశానికి ఎన్నికల కమిషన్ అధికారులు హాజరు కావాలని దాని సారాంశం. అప్పట్లో ఇది చాలా వివాదానికి దారితీసింది.దీన్ని ఎన్నికల సంఘాన్ని కంట్రోల్ చేసే చర్యగా చూశారు విశ్లేషకులు.ఈ ప్రహసనం అంతటితో ఆగలేదు. ఎన్నికల సంఘం నిర్ణయాలు అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నవనే అభిప్రాయం బలంగా వున్నది. నిప్పులేనిదే పొగ రాదు కదా! ఇప్పుడు తెలంగాణ అధికారుల విషయంలో ఎన్నికల సంఘం రాజకీయ ఒత్తిడులకు తలవంచిందన్న అనుమానం వుంది. తెలంగాణలో అధికారంలో వున్న బిఆర్‌ఎస్‌కి బిజెపికి మధ్య తీవ్ర రాజకీయ వైరం వున్న విషయం తెలిసిందే. అది బండి సంజయ్‌ను వరంగల్‌లో అరెస్ట్ చెయడం గానీ, బిజెపి నేతలు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను తమ వైపుకు తిప్పుకోడానికి కుట్ర చేశారన్న ఆరోపణల విషయంలోగానీ. ఈ రెండు సంఘటనల్లో వరంగల్ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వున్నారు.

వారు చట్టబద్ధమైన విధులే నిర్వహించారనుకోవాలి. పోలీస్ అధికారులకు రాజకీయాలేమి ఉంటాయి? ప్రభుత్వ ఆదేశాల మేరకు చట్టం పరిధిలో వ్యవహరించటం అధికారుల వృత్తిధర్మం. ఆ ప్రకారం విధులు నిర్వహించడం తప్పవుతుందా? రాష్ట్ర బిజెపి నేతలు కేంద్ర పెద్దల సాయంతో ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తెచ్చి వారికి నచ్చని అధికారులకు స్థానచలనం కలిగించారా అన్నఅనుమానం వుంది. ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల వృత్తి ధర్మం కత్తిమీద సాములాంటిది. అదేమి చిత్రమో గానీ అధికారంలో వున్న నాయకులకు అధికారుల తీరుతో ఏ ఇబ్బంది లేదు. సమస్యంతా ప్రతిపక్ష నాయకులకే. ఇక్కడ అధికారుల తప్పిదం లేదని చెప్పలేం. కొన్ని సందర్భాలలో అత్యుత్సాహం చూయించటం జరుగుతుంది; ముఖ్యంగా పోలీస్ అధికారులు. దానితో వారు వివాదాలలో చిక్కుకోవడం చూస్తుంటాము. రాజకీయ నాయకులకు తన వర్గం ప్రామాణికం అయితే అధికారులకు నియోజకవర్గం ప్రామాణికం. ఇరువురి మధ్య ఘర్షణకు ఇదొక ప్రధాన కారణం. పథకాల అమలులో తమ వర్గానికి మేలు జరిగేలా ఐఎఎస్‌లపై నేతలు ఒత్తిడి పెడుతుంటారు.

పోలీసుల విషయానికి వస్తే చట్టం పరిధిలోనే వ్యవహరిస్తున్నారా లేక చట్టం పరిధిని దాటారా అనేది ఇదమిత్థ్దంగా చెప్పడం కష్టం. పోలీస్ చర్యల వలన ఇబ్బందిపడిన వాళ్ళు పోలీస్ అధికారులమీద ఆరోపణలు చేస్తుంటారు. పోలీసుల మీద అనేక రాజకీయ ఒత్తిడులు వుంటాయి. పోలీస్ చర్యల వల్ల ఇబ్బంది పడినోళ్లు ఆరోపణలు చేయడం సహజం. వాటిని ప్రభుత్వం అంతగా పట్టించుకోకపోవటం కూడా సహజమే. కొంతమంది అధికారులు అతిగా ప్రవర్తించిన సందర్భాలు లేకపోలేదు. కింది స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే సిబ్బందికి కొదవే లేదు. ఇది జటిలమైన సమస్య. దీనికి విరుగుడేంటి?
పరిపాలనా సంస్కరణలు లేకపోవడం, పోస్టింగుల్లో పారదర్శకత లేకపోవడం, పోస్టింగులు రాజకీయ నేతల చేతుల్లో ఉండడం ఇటువంటి పరిస్థితులకు, ఆరోపణలకు తావిస్తుంటాయి. ఉన్నతాధికారులు ఏ సీటులో ఎన్ని రోజులుంటారు అనేది వారికీ రాజకీయం నాయకత్వానికి మధ్య వున్న ఈక్వేషను బట్టి ఉంటుంది. మాట వినని అధికారులను కీలక స్థానాల్లో ఉంచకపోవడం మనం చూస్తుంటాము.

ఏ అధికారీ అదే పనిగా ట్రాన్స్‌ఫర్ కావాలని కోరుకోరుకదా. అఖిల భారత సర్వీసు అధికారుల ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన భద్రత వున్నప్పటికీ, మంత్రి మండలి నిర్ణయాలకు, మంత్రుల నిర్ణయాలకు లోబడి పనిచేయాలి. ఈ ప్రక్రియలో కొంతమంది అధికారులు అసంబద్ధ ఆదేశాలకు ఎదురు తిరగకుండా లొంగిపోతారు. లోబడటానికి లొంగిపోవటానికి తేడావుంటుంది. అయితే ఈ ప్రక్రియలో గుర్రాన్నీ గాడిదనూ ఒకే గాట కట్టేయకూడదు కదా! చాలా మంది అధికారులు ధర్మబద్ధంగానే వ్యవహరిస్తారు. అయినప్పటికీ, వారుకూడా రాజకీయాలకు బలి అవుతుంటారు. సివి ఆనంద్ లాంటి అధికారి కూడా రాజకీయాలకు బలి అవడం ఇందుకు ఒక ఉదాహరణ. అధికారులుగా ఈ పరిణామం వారికి తీవ్ర మనోవ్యథను మిగిల్చేది అనుకోవడం సహజం. ఈ అధికారుల విషయాన్ని న్యాయస్థానం సుమోటోగా తీసుకొని, వారు చేసిన తప్పిదమేంటని ఎన్నికల సంఘాన్ని నిలదీస్తే బాగుండేది. కానీ అలా జరగలేదు. రాజ్యాంగంలో చెక్స్, బ్యాలెన్స్ అనే వ్యవస్థను పొందుపరిచారు కదా.

ఏ వ్యవస్థ అయినా పరిధి దాటి వ్యవహరిస్తే దాన్ని నియంత్రించవలసినది న్యాయస్థానమే కదా! ఎన్ని విషయాల్లో న్యాయస్థానం సుమోటోగా స్పందించటం లేదూ? ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థే అయినా దానికి అపరిమిత అధికారాలు లేవు కదా! ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత ఎన్నికల సంఘానికుందా? ఇది న్యాయస్థానం తనంతట తానే పరిశీలించతగిన అంశం. జిల్లా కలెక్టరుకు ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి వచ్చే బాధ్యత. జిల్లా స్థాయి పరిపాలనా యంత్రాంగాన్ని నడపడం నిరంతర బాధ్యత. అంటే ఎన్నికల నిర్వహణ వారి విధుల్లో ఒక భాగమేగానీ అదొక్కటే కాదు గదా వారి విధి? ఈ అధికారులను పట్టించుకునేవారు లేరా? ఈ అధికారుల తరఫున ఎవరు మాట్లాడతారు? వారి మనోగతాన్ని ఎవరు వింటారు? వారి హక్కులకు భంగం కలగలేదా? ఆ స్థాయి అధికారులను ఎన్నికల విధులకు పనికిరారు అంటే వారి ఆత్మస్థైర్యం దెబ్బ తినదా? రవాణా శాఖ కార్యదర్శికి ఎన్నికలకు ఏమి సంబంధం? పాపం ఆయన్ను కూడా తప్పించారు. అయితే ఈ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోవడం వారి హుందాతనాన్ని తెలియచేస్తుంది. కత్తికి లేని దురద కందగడ్డకు ఎందుకు అనుకున్నారేమో! కానీ, వారి వాదన కూడా వినాలికదా! అధికారులను ఎన్నికల విధులకు దూరంగా పెట్టడం విచారకర పరిణామంగా మిగులుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News