న్యూఢిల్లీ : రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన ద్రౌపదీ ముర్ముకు ఎన్నికల సంఘం ఎన్నికైనట్లు తెలిపే నమోదు పత్రం (ఎలక్షన్ సర్టిఫికెట్)ను శుక్రవారం అందించింది. ఎన్‌డిఎ అభ్యర్థిగా నిలిచిన గిరిజన మహిళ ద్రౌపది ఈ ఎన్నికలలో విపక్ష ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఓడించారు. ఎన్నికల సంఘానికి రిటర్నింగ్ అధికారి పిసి మోడీ ఎన్నికల ఫలితాన్ని అధికారికంగా అందించిన తరువాత ఈ సిఒఇని ముర్ముకు జారీ చేసింది. 64 సంవత్సరాల ముర్ము దేశానికి 15వ రాష్ట్రపతి అయ్యారు. ఆమె ఎన్నికైనట్లు ధృవీకరించే అధికార పత్రాన్ని భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే సంయుక్త సంతకాలతో పంపించిందని ఎన్నికల సంఘం ట్వీటు వెలువరించింది. ఈ సర్టిఫికెట్‌ను ఇక కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పంపిస్తారు. దీనిని ఈ నెల 25వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగే కొత్త రాష్ట్రపతి ప్రమాణస్వీకార ఘట్టం ముందు అధికారులు చదివి విన్పిస్తారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24తో ముగుస్తుంది.