న్యూఢిల్లీ: త్రిపురలోని 60 నియోజకవర్గాలకు 13వ అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) శనివారం ప్రకటన విడుదలచేసిందని ఓ అధికారి తెలిపారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జనవరి 30వరకు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోడానికి ఫిబ్రవరి 2 చివరి తేదీ. షెడ్యూల్ ప్రకారం 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 16న పోలింగ్ జరుగుతుందని, మార్చి 2న కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల అదనపు ప్రధానాధికారి(ఎసిఈవో) సుభాశీష్ బందోపాధ్యాయ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.
త్రిపురలో మొత్తం 2813478 మంది ఓటర్లు తదుపరి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తుది ఓటర్ల జాబితాలో కొత్తగా 65044 మంది ఓటర్లు చేరారు. స్వేచ్ఛగా, సిష్ఫక్షపాతంగా ఎన్నికలు జరిగేలా, మొత్తం 3328 పోలింగ్ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ ఉంటుంది. ‘అన్ని పోలింగ్ బూత్‌లలో కనీస వసతులు..అంటే, తాగునీరు, విద్యుత్, టాయిలెట్లు, ర్యాంపులు అందుబాటులో ఉంటాయి’ అన్ని అక్కడి ఎన్నికల అదనపు ప్రధానాధికారి తెలిపారు.
ఓటర్ల విశ్వాసాన్ని పెంచేందుకు కేంద్ర పారామిలిటరీ బలగాలు కసరత్తు చేయడంతో ఈశాన్య రాష్ట్రవ్యాప్తంగా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు ఎసిఈవో తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో త్రిపురలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ముగ్గురు ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులు త్వరలో త్రిపురకు చేరుకోనున్నారు.