న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం(ఈసి) త్రిపుర వ్యాప్తంగా 929 పోలింగ్ బూత్‌లపై దృష్టి సారించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 92 శాతం ఓటింగ్‌ను లక్షంగా పెట్టుకుంది. ఈ బూత్‌లలో 2018లో 89 శాతం కంటే తక్కువ ఓటింగ్ నమోదైంది. ఇది 2018 అసెంబ్లీ ఎన్నికలలో 3328 బూత్‌లలో సగటు. అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ‘మిషన్ జీరో పోల్ వాయలెన్స్’పై కూడా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ‘జాగరూకత ప్రచారం’(అవేర్‌నెస్ క్యాంపైన్)ను ఆరంభించాలని కూడా చూస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల అధికారులు సీనియర్ సిటిజన్లను, వికలాంగులను కలుసుకుని ఓటేయమని వారికి నచ్చజెబుతారు. ప్రతి పోలింగ్ స్టేషను వద్ద సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు ఉపయోగకరంగా ఉండేందుకు భారత ఎన్నికల సంఘం ర్యాంప్స్, వీల్ చైర్స్, ప్రత్యేక క్యూలు ఏర్పాటుచేయనున్నది. ఓటర్లు ఈ విధంగా ప్రశాంతంగా ఓటేయ వీలవుతుందంటున్నారు. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదే(2023)లో జరుగనున్నాయి. త్రిపుర అసెంబ్లీలో 60 సీట్లున్నాయి. త్రిపుర 12 లెజిస్లేటివ్ అసెంబ్లీ పదవీ కాలం 22 మార్చి 2023తో ముగియనున్నది. త్రిపురలో 2018లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బిజెపి) 36 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీ(సింగిల్ లార్జెస్ట్ పార్టీ)గా నిలవడమేకాక, త్రిపురలో మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.