బలనిరూపణకు ఆగస్టు 8 వరకు గడువు
న్యూఢిల్లీ : బలాన్ని నిరూపించుకునేందుకు శివసేన లోని ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే వర్గాలకు ఎన్నికల కమిషన్ వచ్చేనెల 8 వరకు గడువు విధించింది. తమకు మాత్రమే ఆధిక్యత ఉందని నిరూపించేందుకు దస్తావేజుల రూపం లోని సాక్షాధారాలను సమర్పించాలని తెలిపింది. పార్టీ లోని శాసన, సంస్థాగత విభాగాల్లో ఎవరికెంత మద్దతు ఉందో తెలుసుకునేందుకు వీలుగా సంతకాలతో కూడిన లేఖలను సమర్పించాలని చెప్పింది. ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే శివసేన లెజిస్లేటివ్, ఆర్గనైజేషనల్ విభాగాల్లోని తమ మద్దతుదారుల సంతకాలతో కూడిన లేఖలను ఆగస్టు 8 మధ్యాహ్నం ఒంటిగంటకు సమర్పించాలని తెలిపింది.
జూన్ 30న షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత శివసేన లోని మెజారిటీ ఎమ్‌ఎల్‌ఎలు తనతోనే ఉన్నారని షిండే చెబుతున్నారు. తన నేతృత్వం లోనే అసలైన శివసేన ఉందని చెబుతూ ఎన్నికల కమిషన్‌ను కూడా ఆశ్రయించారు. ఇటీవల షిండే వర్గం శాసన సభా పతిని ఎన్నుకుంది. చీఫ్ విప్‌ను ఎంపిక చేసింది. మరోవైపు 19 మంది శివసేన ఎంపీల్లో 12 మంది షిండే వర్గం లోకి చేరారు. ఈ నియామకాలు చెల్లవని ఉద్ధవ్ నేతృత్వం లోని శివసేన చెబుతోంది. శివసేన ఎన్‌సిపికాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కూలిపోడానికి ముందు తిరుగుబాటు చేసిన ఎమ్‌ఎల్‌ఎలకు జారీ చేసిన అనర్హత నోటీసులపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడే వరకు ఈ నియామకాలు చట్టవిరుద్ధమని పేర్కొంది.