న్యూఢిల్లీ : ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని పనౌతి (అపశకునం), పిక్‌పాకెట్, రుణమాఫీ తదితర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ గురువారం నోటీస్‌లు జారీ చేసింది. దీనిపై శనివారం స్పందించి వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. రాజస్థాన్‌లో ఇటీవల ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై పనౌతి, పిక్‌పాకెట్ వంటి పదాలతో విమర్శలు గుప్పించారు.
క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ చూసేందుకు మోడీ వెళ్లడం వల్లనే టీమ్ ఇండియా ఓటమి పాలైందని, పీఎం అంటే పనౌతీ మోడీ అని విమర్శించారు. మోడీ ప్రజల దృష్టిని మళ్లిస్తుంటే వారి జేబులను అదానీ దోచుకుంటున్నారని, పిక్‌పాకెట్ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ అదేపనిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ కోరింది. మరోవైపు రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ స్పందించింది. తమకు వచ్చే ఎటువంటి నోటీస్‌లనైనా ఎదుర్కొంటామని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.