న్యూఢిల్లీ : దేశంలో ఇక రెండు నెలల నుంచి ఎన్నికల కాలం సమీపిస్తున్న దశలో ఎన్నికల సంఘం ప్రజల ఓటింగ్‌పై దృష్టి సారించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ఎన్నికల సంఘం (ఇసి) తమ సంస్థ తరఫున ‘నేషనల్ ఐకాన్’గా నియమించింది. మూడేళ్ల వరకూ సచిన్ ఈ బాధ్యతల్లో ఉంటారు. క్రికెట్‌లో శిఖరయమాన స్థాయికి చేరిన సచిన్‌ను ఇప్పుడు పౌరుల ఓటుకు ప్రతీకగా ఎన్నికల సంఘం మల్చుకుంది.
ఎన్నికల ప్రక్రియలో మరింతగా , మరీ ప్రత్యేకించి యువత ప్రాతినిధ్యం అన్ని స్థాయిల్లో ఉండేందుకు సచిన్‌ను ఐకాన్‌గా ఎంచుకున్నారు. ఓటుకు సచిన్‌ను నేషనల్ ఐకాన్‌గా నియమించే ప్రక్రియకు సంబంధించి బుధవారం (నేడు) టెండూల్కర్‌కు ఎన్నికల సంఘానికి మధ్య కీలకమైన అవగావహన ఒప్పందం (ఎంఒయు) కుదరనుంది. మూడేళ్ల ఈ బాధ్యతల దశలో సచిన్ తన పిలుపు ద్వారా, సందేశాల రూపంలో ఎప్పటికప్పుడు ఓటర్లలో చైతన్యం , స్ఫూర్తిని కల్పించేందుకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాల్సి ఉంటుంది.
కేవలం ఓటేయడమే కాకుండా , ఎన్నికల ప్రక్రియలోని ప్రతి విషయంలోనూ ఓటరు సముచిత బాధ్యత కీలకమని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఓటర్ల చైతన్యం ద్వారా ఓటు మరింత విలువైనది, బాధ్యతాయుతమైనదిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన రంగం సిద్ధం చేస్తారు. సచిన్ పట్ల యువతలో ఉన్న తిరుగులేని అభిమానం, ఆయన ప్రభావం జగద్విదితమే. దీనిని సరైన విధంగా వినియోగించుకుని ఓటర్లను, ప్రత్యేకించి యువతను ఎన్నికలలో మరింతగా ప్రాతినిధ్యం వహించేలా చేయడం తమ ఆలోచన అని ఎన్నికల సంఘం సోమవారం ఓ ప్రకటన వెలువరించింది.
రాబోయే ఎన్నికలు, ప్రత్యేకించి 2024 సార్వత్రిక ఎన్నికలకు సచిన్ ఇమేజ్‌ను వినియోగించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల దశలో పట్టణ, యువజన ఓటర్లు పెద్దగా ఆసక్తి కనబర్చని వైనం ఎన్నికల సంఘానికి ఆందోళన కల్గిస్తోంది. దీనితో పలుసార్లు ఎన్నికలలో తక్కువ శాతం పోలింగ్ రికార్డు అవుతోంది. ఈ ఓటు దుస్థితిని నివారించేందుకు ఎన్నికల సంఘం కొంతకాలంగా పలు విధాలుగా ప్రయత్నిస్తోంది.
ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల ప్రాతినిధ్యం పెంచేందుకు, వారిని ఓటేసేందుకు రప్పించేందుకు ఇంతకు ముందు పలువురు ప్రముఖ భారతీయులను ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్స్‌గా తీసుకుంది. గత ఏడాది ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠీ ఈ బాధ్యతలు తీసుకున్నారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల దశలో ఎంఎస్ ధోనీ, అమీర్ ఖాన్, మేరీ కోమ్ వంటి వారిని ఎన్నికల సంఘం ఈ గురుతర బాధ్యతలకు ఎంచుకుంది.