Thursday, November 21, 2024

ఎపి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

ఎపిలోని ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జులై 2 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జులై 3న నామినేషన్లు పరిశీలిస్తారు. జులై 5 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. కూటమికే 2 స్థానాలు దక్కే ఛాన్సుంది. వైసిపి పోటీ చేస్తే జులై 12న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీకు చెందిన ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో సి. రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్ ల రాజీనామాలతో ఖాళీ అయిన రెండు స్థానాలకు శాసనసభ్యుల కోటా నుంచి త్వరలోనే భర్తీ కానున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడ జారీ చేసింది. ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓటమి చెందడంతో ఎమ్మెల్సీ స్థానాలు టిడిపికి సునాయాసంగా లభించే అవకాశాలున్నాయి.

కాపు, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు సభ్యులు ను తిరిగి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తుందా, లేదా వీరి స్థానంలో పార్టీని కష్టకాలంలో అంటిపెట్టుకుని ఉన్న వారికి అవకాశం లభిస్తుందా? అనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గానికి బిజెపితో పొత్తు ఉండటంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలను కేటాయించిన టిడిపి ఒక ఎమ్మెల్సీ స్థానం ముస్లింలకు ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాపు సామాజిక వర్గం నుండి కూడ పలువురు ఆశిస్తున్నట్లు సమాచారం. ముస్లిం సామాజిక వర్గం నుండి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు ముందు టిడిపిలో చేరిన మహమ్మద్ ఇక్బాల్ తో పాటు శాసనమండలి మాజీ చైర్మన్ ఎం ఏ షరీఫ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ తోపాటు పలువురు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు కేటాయించిన స్థానంలో టిడిపి కూడ ముస్లిం సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తుందా! లేదా పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి ప్రాధాన్యత కల్పిస్తుందా? అనే మీమాంసలో మైనార్టీ నాయకులు ఉన్నారు. ఎమ్ ఏ షరీఫ్ శాసనమండలి సభ్యునిగా, మండలి ఛైర్మన్ గా గతంలో బాధ్యతలు నిర్వహించి ఉన్నారు. ప్రస్తుతం శాసనమండలిలో వైసిపికి బలం ఉండటంతో మండలిలో ధీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నందున సున్నిత మనస్కుడైన ఎం ఏ షరీఫ్ కు అవకాశం లభిస్తుందా అనేది కొంతవరకు అనుమానమే. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ లో కార్యకర్త స్థాయి నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు అనుబంధ విభాగాల ఇన్చార్జి గా పనిచేసి తన రాజకీయ జీవిత కాలంలో పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయిన పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసి ఇప్పటివరకు పార్టీ పదవులకు మాత్రమే పరిమితమైన మహమ్మద్ నజీర్ కు ఎటువంటి అధికార పదవిని పార్టీ ఇవ్వకపోయినా పార్టీ పదవుల బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి పార్టీ అధికారంలో లేకపోయినా నిత్యం పార్టీ కార్యక్రమాలకు,

పార్టీ కార్యాలయానికి అందుబాటులో ఉంటూ అప్పగించిన ప్రతి కార్యక్రమాన్ని, కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి పార్టీ అధిష్టానంతోపాటు మైనారిటీల్లోనే కాక అన్ని వర్గాల నాయకులలో ప్రత్యేక అభిమానాన్ని చూరగొన్న మహమ్మద్ నజీర్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ఒక మైనార్టీ నాయకుడుకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని భావిస్తున్నారు. గత 30 సంవత్సరాల క్రితం మైనార్టీలకు చట్టసభలో టిడిపి అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఇంతవరకు ఎవరికీ అవకాశం కల్పించనందున ఆ దిశగా కూడ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం లభించవచ్చని పలువురు టిడిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News