Sunday, January 12, 2025

కేంద్రం గుప్పెట్లో ఎన్నికల కమిషన్!

- Advertisement -
- Advertisement -

కేంద్ర ఎన్నికల నిర్వహణ కమిషన్ ఎన్నిక కమిటీ బిల్లును ప్రతిపక్షాల నిరసనల మధ్య 11- ఆగస్టు 2023న న్యాయశాఖ మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై ఎటువంటి చర్చకు అవకాశం ఇవ్వకుండా రాజ్యసభ వాయిదా పడింది. ఈ బిల్లులో ప్రధాన ఎన్నికల కమిషన్ మరియు ఇతర కమిషన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ, సేవా నిబంధనల, కార్యాచరణ విధానాలకు నియంత్రణ తీసుకు రావాలని లక్షంగా పేర్కొంది. బిల్లులో పేర్కొన్న ఎన్నిక విధానాల ప్రకారం కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ఇద్దరు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ ఎన్నికల కమిషనర్లగా నియామకానికి అర్హులైన ఐదుగురు సభ్యుల జాబితాను సిద్ధం చేస్తున్నది. ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ ప్రధాన ఎన్నికల కమిషన్‌ని, ఇతర ఇసి సభ్యులను ఎన్నిక చేసి రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపుతుంది. వారి జీతభత్యాలను కూడా నిర్ణయిస్తుంది. ప్రస్తుతం వారి వేతనం సుప్రీంకోర్టు న్యాయమూర్తు వేతనాలతో సమానంగా ఉండగా, బిల్లులో కేబినెట్ కార్యదర్శుల వేతనాలతో సమానంగా మార్చింది.

1989 వరకు ఎన్నికల కమిషనర్ మాత్రమే ఉన్నారు. 1990లో దినేష్ గోస్వామి కమిటీ సిఇసిని నియమించటానికి సెలక్షన్ కమిటీ లేదా ఫ్యానల్ అవసరమని సూచించినప్పుడు, కమిషన్ డిమాండ్ మొదట ముందుకు వచ్చింది. ఈ సిఫార్సు ఆధారంగా 70వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడింది. ఈ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ప్రిసైడింగ్ అధికారులు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడితో కూడిన ఎంపిక కమిటీని సూచించింది. దీనిలో కేంద ప్రభుత్వ పాత్ర లేకపోవటంతో ఆమోదించబడలేదు. రాజ్యాం గం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, ఇతర కమిషన్ సభ్యుల నియామకానికి ఒక విధానమంటూ లేదు. 1952 నుంచి ప్రధాన మంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి కమిషనర్‌ని నియమిస్తూ వస్తున్నారు. ఆర్టికల్ 342(5) ప్రకారం ఇసి సభ్యుల సర్వీస్ షరతులు, పదవీ కాలం నిబంధనలను నియంత్రించే అధికారం పార్లమెంటుకు ఉంది. రాజ్యాంగ సభల్లో ఈ అంశంపై చర్చ జరిగిన తర్వాత ఎన్నికల కమిషన్ నియామకాలు నిర్ణయించే బాధ్యత 1991లో ప్రభుత్వానికి ఏర్పడింది.

అప్పటి నుండి ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ ఎన్నిక జరుగుతున్నది.అధికార మార్పిడి చేసుకున్న దేశీయ బడా బూర్జువా, భూస్వామ్య వర్గాలు బ్రిటన్, అమెరికా రాజ్యాంగాలను కాపీ కొట్టి ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించామని, ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య రాజ్యాంగమని ప్రచారం చేసుకొంటున్నారు. దీన్ని విప్పి చూస్తే మేడి పండు రాజ్యాంగం బయటపడుతుంది. ప్రజలకు హక్కు లు ఇచ్చినట్లే ఇచ్చి వాటిని ఎలా హరించాలో కూడా చెప్పింది. రాజ్యాంగంలోని వ్యవస్థలన్నీ స్వతంత్రమైనవని చెబుతూ అవన్నీ కేంద్ర ప్రభుత్వానికి లోబడి ఉండాలని పేర్కొంది. అలాంటి వ్యవస్థల్లో ఎన్నికల వ్యవస్థ ఒకటి. రాజ్యాంగంలో పేర్కొన్న ఎన్నికల వ్యవస్థ స్వతంత్రమైందని, ఎన్నికల నిర్వహణ పూర్తిగా కమిషన్ నిర్ణయాల ప్రకారమే జరుగుతున్నదనే బూటకపు ప్రచారం అధికార మార్పిడి దగ్గర నుండి జరుగుతూనే ఉంది. ఎన్నికలను నిర్వహించే కమిషన్ ఏర్పాటును గమనిస్తే ఆ బూటకం బట్టబయలవుతుంది.

70 సంవత్సరాలుగా కమిషనర్‌ని ప్రధాన మంత్రి మాత్రమే ఎన్నిక చేసే ప్రక్రియను తప్పుబడుతూ 2015 నుండి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేస్తూనే ఉన్నారు. అనూష్ బరన్యాల్ వేసిన ప్రజా ప్రయోజనాల పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రిమ్ ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అధికార పగ్గాలు అందిపుచ్చుకున్న రాజకీయ వ్యవస్థ ఎన్నికల కమిషన్‌పై ఎలాంటి చట్టం చేయకుండా 70 సంవత్సరాలు గడిచిపోయాయని ఇప్పటికైనా మారాలని, అయితే అది ఇప్పుడున్న నామ్‌కే వాస్తే నియామకంలా, కార్యనిర్వాహక వ్యవస్థకే మొత్తం కట్టబెట్టేలా ఉంటే ఉపయోగం లేదని స్పష్టం చేసింది. కమిషన్ నియామకాన్ని కార్యనిర్వాహక (ప్రభుత్వ) శాఖ జోక్యం లేకుండా తప్పనిసరిగా నిరోధించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ప్రధాన మంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి నియామకాలు చేపట్టాలని జస్టిస్ కెయం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెప్పింది.

పార్లమెంటరీ చట్టం అమలులోకి వచ్చే వరకు ఈ సూత్రం అమలులో ఉంటుందని పేర్కొంది. ఎన్నికల కమిషన్ ఎలా ఏర్పడాలని చెప్పటమే కాకుండా, దానిపై వ్యాఖ్యలు కూడా చెప్పింది. ప్రధానిపై కూడా చర్యలు తీసుకోగలిగే ఎన్నికల ప్రధాన కమిషనర్ ఉండాలి. ప్రభుత్వాలు శాశ్వతంగా అధికారంలో ఉండడానికి తాము చెప్పినట్లు వినే కీలుబొమ్మలను ప్రధాన అధికారిగా నియమిస్తున్నాయి. ఎన్నికల సంఘం రాజకీయ ప్రలోభాలకు దూరంగా స్వతంత్రంగా ఉండాలి. నీతి, నిజాయితీ ఉన్న వారినే ఆ పదవిలో నియమించాలి. టియన్ శేషన్ లాంటి అధికారులు మళ్ళీ ఎన్నికల సంఘానికి ఎందుకు దొరకలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రధాన అధికారి అరుణ్ గోయల్ నియామక ప్రక్రియ ఫైలును సుప్రీంకోర్టుకు సమర్పించాలి. ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, సభ్యుల నియామకాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా భాగస్వామ్యం చేయాలి. మోడీ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ఉంది.

ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన మంత్రి సిఫార్సు చేసిన కేంద్ర మంత్రి కలసి ప్రధాన ఎన్నికల అధికారిని , ఇతర ఇసి సభ్యులను ఎంపిక చేసి ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపబడుతుంది. ఎంపిక విధానంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి బిల్లులో అవకాశం కల్పించలేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించడమే. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి ఉండాల్సిన అవసరం లేదని చెప్పకనే చెప్పింది.2012 జూన 2 నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అద్వానీకి లేఖ రాస్తూ ఎన్నికల కమిషన్‌ను ప్రకటించే హక్కు ప్రధానికి, ప్రతిపక్ష నాయకునికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండాలని చెప్పారు. అందుకు భిన్నంగా బిజెపి నాయకత్వాన ఉన్న మోడీ ప్రభుత్వం నేడు వ్యవహరిస్తున్నది. గత ప్రభుత్వాలు రాజ్యాంగపరమైన సంస్థలను తమకు అనుకూలంగా ఉండే విధంగా మలచుకునే విధానాలు అమలు జరిపాయి. మోడీ ప్రభుత్వం మరింత నిరంకుశంగా వ్యవహరిస్తూ చట్టబద్ధ సంస్థలన్నీ తన చెప్పుచేతుల్లో ఉండాలని, తాను చెప్పిందే అమలు చేయాలనే విధానాలను అమలులోకి తెస్తున్నది.

ఏ సంస్థ అయినా తనకు అనుకూలంగా వ్యవహరించకపోతే రాజ్యాంగ సవరణ ద్వారా దాని హక్కులను హరిస్తున్నది. అటవీ హక్కుల చట్టంలో తనకు అనుకూలమైన మార్పులు చేసింది. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను, ఇతర కమిషన్ సభ్యుల ఎన్నిక ప్రధాని సూచనల ప్రకారం కాకుండా, అయనతో పాటు ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి ఎన్నిక చేయాలని సుప్రీంకోర్టు చెప్పడం మోడీ ప్రభుత్వానికి సంకటంగా మారింది. అలా జరిగితే ఎన్నికల కమిషన్ తన చెప్పుచేతుల్లో ఉండదని మోడీ ప్రభుత్వం భావించింది. సుప్రీంకోర్టు అధికారాలను కుదించేందుకు నిర్ణయించిన ఫలితమే హడావుడిగా ఎన్నికల కమిషన్ ఎన్నిక కమిటీ సభ్యుల నిర్ణయ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం, అందులో కమిటీ సభ్యుల నుంచి ప్రధాన న్యాయమూర్తిని తొలగించటం, ఆయన స్థానంలో కేంద్ర మంత్రిని ప్రతిపాదించడం జరిగింది. ముగ్గరు కమిటీ సభ్యుల్లో ప్రభుత్వం నుంచి ఇద్దరు ఉంటారు కాబట్టి తనకిష్టమైన వారిని నియమించుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అలా నియమించే ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి కీలుబొమ్మగా ఉంటుంది.

ఈ బిల్లు ద్వారా కమిటీ ఎన్నికలో సుప్రీం పాత్ర లేకుండా చేయనుంది. దేశంలో అమలులో ఉన్న పార్లమెంటీ విధానమే ఆర్థిక స్థోమతతో కూడుకొని ఉంది. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతున్నది. అధికారంలో ఉన్న ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడుతున్నది. రిగ్గింగులకు, దొంగ ఓట్లకు యధేచ్ఛగా పాల్పడుతున్నది, రౌడీలను ఉపయోగిస్తున్నది. ఇందుకు పరోక్షంగా ఎన్నికల సంఘం ప్రభుత్వానికి సహకరిస్తున్నది. పాలక ప్రభుత్వానికి ప్రయోజనకరంగా ఓటర్ల పేర్లను తొలగిస్తున్నది. ఎన్నికల వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నది. ఎన్నికల ప్రకటన తేదీలు కూడా పాలక ప్రభుత్వం చెప్పినట్లు చేస్తున్నది. ఎలెక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి వద్దని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నా దాన్నే కొనసాగిస్తున్నది. అందుకు కారణం ప్రభుత్వం నియమించిన ఎన్నికల కమిషన్ కావటమే. తన మాట వినకపోతే ఎన్నికల కమిషన్‌ను రాష్ట్రపతి చేత రద్దు చేయిస్తుంది. ఆ భయం కమిషన్ సభ్యులకు ఉంది. రాజ్యాంగంలో ప్రజలకు నామ మాత్రంగా ఉన్న హక్కులను హరించటమే కాకుండా చట్టబద్ధ సంస్థలను కూడా మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం గమనిస్తే పాలక వర్గాలు గొప్పగా చెప్పే ‘రాజ్యాంగం’ ఎడల మోడీ ప్రభుత్వానికి విశ్వాసం లేదని వెల్లడవుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News