Friday, December 20, 2024

ఇసికి బంధ విముక్తి!

- Advertisement -
- Advertisement -

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ను, ఎన్నికల కమిషనర్ల (ఇసిలు) ను నియమించడానికి ఒక ప్రత్యేక సమున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికతకు సుప్రీంకోర్టు దుర్భేధ్యమైన రక్షా కవచాన్ని తొడిగింది. ఇందుకోసం ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత లేదా అతిపెద్ద పార్టీ సారథి, భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) లతో కూడిన కమిటీని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నాడు నెలకొల్పింది. ఈ విషయంలో పార్లమెంటు ఒక చట్టం చేసే వరకు ఈ కమిటీ కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధి విధానాలను రాజ్యాంగం 324 అధికరణ నిర్దేశిస్తున్నది. పార్లమెంటు చేసే చట్టం ప్రకారం సిఇసిని, ఇసిలను రాష్ట్రపతి నియమించాలని ఈ అధికరణలోని రెండవ నిబంధన స్పష్టం చేస్తున్నది. అయితే ప్రస్తుతం ప్రధాని నాయకత్వంలో కేంద్ర మంత్రి వర్గం సూచించే వ్యక్తులను సిఇసిగా, ఇసిలుగా నియమిస్తున్నారు. ఇది సహజంగానే పాలక పక్షానికి అనుగుణమైన ఏర్పాటుగా దుర్వినియోగపడుతున్నది. వీరి నియామకానికి ప్రత్యేక చట్టాన్ని చేయాలని కోరుతూ పలు ప్రజాప్రయోజక వ్యాజ్యాలు 2015 నుంచి సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వాటిపై గత నవంబర్‌లో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎన్నికల కమిషనర్‌గా అరుణ గోయెల్‌ను మెరుపు వేగంతో నియమించిన వాస్తవాన్ని గమనించింది.

ఈయనను గత ఏడాది నవంబర్ 18న 24 గం. కంటే తక్కువ వ్యవధిలోనే నియమించవలసిన అవసరం ఎందుకు కలిగిందని కేంద్రాన్ని ప్రశ్నించింది. పార్లమెంటుకు, రాష్ట్రాల శాసన సభలకు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు కూడా ఎన్నికలు జరిపించే కీలక బాధ్యతను చేపట్టే ఎన్నికల కమిషన్ ఎంత నిష్పాక్షికంగా వ్యవహరించాలో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. అందుకు విరుద్ధంగా కొన్ని సార్లు రాష్ట్రాల ఎన్నికల తేదీలను కేంద్రంలోని పాలక పక్ష ప్రయోజనాలకు దోహదపడేలా ఎన్నికల సంఘం నిర్ణయిస్తున్నదనే ఆరోపణ దూసుకు వచ్చిన సందర్భాలున్నాయి. కొత్త ఏర్పాటు చేస్తూ ధర్మాసనం వెలిబుచ్చిన అభిప్రాయాలు ప్రత్యేకించి గమనించదగినవి. అధికారంలో వున్నవారి ముందు మోకరిల్లే వ్యక్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఎంత మాత్రం తగదని, తనను నియమించిన వారికి రుణపడి వున్నట్టు భావించే వ్యక్తి జాతికి ద్రోహం చేస్తాడని న్యాయమూర్తి కెఎం జోసెఫ్ చేసిన వ్యాఖ్యానం ప్రజాస్వామ్య నిష్పాక్షికతకు అభయ ప్రదాత వంటిది.

బ్యాలట్ అనేది తుపాకీ కంటే శక్తివంతమైనదని ధర్మాసనం వెలిబుచ్చిన అభిప్రాయం తిరుగులేనిది. అందుచేత ఎన్నికల పవిత్రతను కాపాడి తీరవలసి వున్నదని లేని పక్షంలో ప్రమాదకరమైన పరిణామాలు తలెత్తుతాయని ధర్మాసనం హెచ్చరించింది. ఎన్నికల కమిషన్ సర్వస్వతంత్రమైనదిగా వుండాలని బయటి శక్తుల ఒత్తిడి నుంచి అంతర్గతమైన విచ్ఛిన వాతావరణం నుంచి అది దూరంగా వుండవలసి వుందని అభిప్రాయపడింది. మితిమించిన డబ్బు ప్రభావం వల్ల, మీడియాలోని కొన్ని శక్తులు తమ అమూల్యమైన పాత్రను మరచిపోయి సిగ్గు విడిచి పాక్షికంగా మారిపోయినందు వల్ల రాజకీయాలు నేరస్థుల పట్టులోకి వెళ్ళిపోయినందున ఇక ఎంత మాత్రం వాయిదా వేయకుండా ఈ కమిటీని నియమించవలసిన వచ్చిందని ధర్మాసనం అభిప్రాయపడడంలో ప్రస్తుత పరిస్థితుల పట్ల అది ఎంతగా ఆవేదన చెంది వున్నదో అర్థమవుతున్నది.

ఎన్నికల సంఘం తీసుకొనే నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని చూరగొనవలసిన అవసరం వుందని అందుకు భిన్నంగా కమిషన్ నిరంకుశ నిర్ణయాలు తీసుకొన్నట్లయితే దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ అవినీతిమయమైపోయిందని ప్రజలు భావిస్తారని జస్టిస్ అజయ్ రస్తోజి తన ప్రత్యేక తీర్పులో పేర్కొన్నారు. ఎన్నికల నిష్పాక్షికత ప్రస్తావన వచ్చినప్పుడల్లా 1990-1996 మధ్య ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా వున్న టిఎన్ శేషన్‌ను గుర్తుకు తెచ్చుకొని ఆయన చండశాసనత్వాన్ని మెచ్చుకోడం జరుగుతుంటుంది. ఇంత సువిశాలమైన దేశంలో ఎన్నికల నిషాక్షికత లేదా నిర్వహణలో కాఠిన్యత కేవలం ఒక వ్యక్తి మీద ఆధారపడి వుండవలసిన పరిస్థితి బాధాకరమైనది.

వ్యక్తులకు బదులు సరైన వ్యవస్థను నెలకొల్పుకోడమే సత్ఫలితాలనిస్తుంది. సుప్రీంకోర్టు ఇప్పుడు చేసిన ఈ ఏర్పాటు ఆ లోటును తీర్చింది. వాస్తవానికి 2012లోనే అప్పటి ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ ఇటువంటి కమిటీ ఏర్పాటును సూచించారు. ప్రధాని, సిజెఐ, కేంద్ర న్యాయశాఖ మంత్రి, పార్లమెంటు ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలతో కూడిన కమిటీని సిఇసి, కాగ్‌ల నియామకానికి ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. దానిని అప్పటి డిఎంకె అధినేత కరుణానిధి సమర్థించారు. అది ఇన్నాళ్ళకు నెరవేరినందుకు ఎంతైనా సంతోషించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News