చివరికి ధర్మానిదే విజయం
సిఎం కెసిఆర్ హ్యాట్రిక్ ఖాయం
ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మే పరిస్థితి లేదు
కాళేశ్వరంతో నిండుకుండల్లా చెరువులు, కుంటలు
మత్స్యకారులకు చేతినిండా పని.. అందినంత ఆదాయం
ఏడో విడత ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో నిజాలు మాట్లాడే బిఆర్‌ఎస్‌కు, అబద్ధాలు మాట్లాడే బిజెపి, కాంగ్రెస్‌కు మధ్య పోటీ ఉంటుందని, సిఎం కెసిఆర్ కృషితో యావత్తు దేశానికే అ ద్భుత విజయాలకు దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మం త్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. 7వ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రితో కలిసి ఆదివారం జిల్లా కేంద్రంలోని చింతల్ చెరువులో చేప పిల్లలను వదిలారు. అనంతరం పత్తి మార్కెట్ యార్డు లో ఏర్పాటు చేసిన మత్సకారుల గుర్తింపు కార్డు ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఎన్నిక లు రాగానే ఢిల్ల్లీ నాయకులు హైదరాబాద్‌లో మ కాం వేసి అబద్ధపు ప్రచారాలు చేసి కుట్రలు పన్నుతున్నారన్నారు. కాంగ్రెసోళ్లు తెలంగాణలో హామీ ల మీద హామీలు ఇస్తున్నారని అదే వారి పాలిత ప్రాంతాలలో ముందు అమలు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెసోళ్లు 60 ఏండ్లు పాలించినప్పుడు తెలంగాణను అభివృద్ధ్ది చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. అదే సిఎం కెసిఆర్ 60 ఏండ్లలో జరగని అభివృద్ధ్దిని ఆరేండ్లలో చేసి చూపించారన్నారు. ఏది ఎమైనా మూడవ సారి కెసిఆరే సిఎం కావాలని రాష్ట్ర ప్రజలు స్పష్టం చేస్తున్నారన్నారు. ఎట్లున్న తెలంగాణను ఎలా మార్చామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. మత్సకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.
కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలో నాలుగైదు చెరువులల్లో మాత్రమే చేప పిల్లలను వదిలేవారని అదే సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి చెరువులో చేప పిల్లలను ఉచితంగా వదులుతున్నామన్నారు. ఈ మృగశిరకు తెలంగాణ నుండే ఇతర రాష్ట్రాలకు లారీల కొద్ది చేపలు ఎగుమతి అయ్యాయన్నారు. మండు టెండల్లో మత్తడులు దూకడం కాంగ్రెసోళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అబద్ధ్దాలను ప్రచారం చేస్తున్నవారిని ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కురుక్షేత్రంలో అంతిమంగా విజయం ధర్మముదేనని ఈ ఎన్నికలలో సైతం కేసీఆర్ సర్కార్ దే విజయం ఖాయమన్నారు. సిఎం కెసిఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 100శాతం సబ్సిడీపై చేపపిల్లలను అందిస్తున్న ఏకైక సీఎం కెసిఆరే నన్నారు. మత్సకారులకు అండగా నిలువడంతో పాటు వాహానాలు, సామగ్రి కొనుగోలు కోసం సబ్సిడిని అందిస్తున్నామన్నారు. ఒకప్పుడు చేపలు తినాలంటే ఇతర రాష్ట్రాల నుంచి లారీల కొద్ది దిగుమతి చేసుకునే వారమని కాళేశ్వరం నిర్మాణంతో ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు తెలంగాణ చేపలు ఎగుమతి అవుతున్నాయన్నారు. కెసిఆర్ కృషితోనే మత్స సంపద గణనీయంగా పెరిగిందన్నారు.
బలోపేతమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ : మంత్రి తలసాని
సిఎం కెసిఆర్ పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్ధ బలోపేతమైందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 100 శాతం సబ్సిడీపై రోయ్యలు, చేపలు, గొర్రెలను అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనన్నారు. మత్సకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం సిద్దిపేట నుంచే ప్రారంభించుకున్నామన్నారు. మత్సకారులకు అన్ని విధాలుగా నిలుస్తూ సబ్సిడీపై సామగ్రి అందిస్తున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సిఎం కావడంతోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. హరీశ్‌రావు లాంటి నాయకుడు సిద్దిపేట ప్రాంతంలో ఉండడం ఇక్కడి ప్రజల ఆదృష్టకరమన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించడంతో పాటు సబ్సిడీ రుణాలను అందిస్తున్నామన్నారు. సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని చూసి తామంతా నేర్చుకుంటున్నామన్నారు. సిద్దిపేటమార్గం వైపు రాగానే ఇతర దేశాలకు వెలుతున్న భావన కలుగుతుందన్నారు. హైదరాబాద్‌లో ఉండే భూమి రేట్లు సిద్దిపేటలో ఉన్నాయని ఇందుకు ఇక్కడ జరిగిన అభివృద్దే నిదర్శనమన్నారు. పట్టుదల, కృషి తో పని చేసే నాయకుడు హరీశ్‌రావు అని కొనియాడారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ గరిమా ఆగ్రవాల్, జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజారాదాకృష్ణ శర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, ప్రజాప్రతినిదులు, నాయకులు వేలేటి రాదాకృష్ణశర్మ, బక్కి వెంకటయ్య, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, జంగిటి కనకరాజు, బాల్ రంగం, శ్రీహరి యాదవ్, ఖాత కనకరాజు తదితరులు ఉన్నారు.