Wednesday, January 22, 2025

మంచు కొండల రాష్ట్రంలో పీఠం ఎవరిది?

- Advertisement -
- Advertisement -

సిమ్లా: మంచుకొండల్లో ఎన్నికల వేడి రాజుకుంది. కేజ్రీవాల్ ఎంట్రీతో హిమాలయ పర్వత రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఓట్ల వేటలో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి.హోరాహోరీ ప్రచారాలు, అగ్రనేతల పర్యటనలు, బారీ హామీలు, అసంతృప్తి సెగలు.. అన్నింటితో హిమాచల్‌లో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. డబుల్ ఇంజిన్ భరోసాతో బిజెపి, ఆనవాయితీపై ఆశలతో కాంగ్రెస్, మార్పు అంటూ ఆమ్ ఆద్మీపార్టీ ప్రజల్లోకి వెళ్లాయి. రాష్ట్రంలోని 68 నియోజక వర్గాలకు ఆదివారం జరిగే పోలింగ్‌లో 55లక్షలకు పైగా ఓటర్లు 412 మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. వీరిలో ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్, రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు సత్పాల్ సింగ్ సత్తి లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు.

హిమాచల్‌ప్రదేశ్ స్వింగ్ స్టేట్‌గా గుర్తింపు పొందింది. 1985నుంచి ఇక్కడ వరసగా రెండో సారి ఒకే పార్టీకి అధికారం దక్కిన దాఖలాలు లేవు. అయితే ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టి 2017 ఫలితాలను పునరావృతం చేయాలని భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. 2021లో హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో బిజెపి వ్యూహం మార్చింది. హిమాచల్‌పై పూర్తి దృష్టి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బిజెపి చీఫ్ జెపి నడ్డా వరస పర్యటనలతో ప్రచారం హోరెత్తించారు. ‘ మీరు బిజెపి గుర్తు కమలంపై వేసే ప్రతి ఓటూ నా బలాన్ని మరింత పెంచుతుంది’ అన్న సెంటిమెంట్ పిలుపు ద్వారా ప్రధాని రాష్ట్ర ఓటర్లను పార్టీ వైపు మొగ్గేలా చేయడానికి చివరి ప్రయత్నం చేశారు.

ప్రియాంక ప్రయత్నాలు

మరో వైపు ప్రభుత్వ వ్యతిరేకత, మూడు దశాబ్దాల ఆనవాయితీని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్‌లు విస్తృతంగా ప్రచారం చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను బలంగా లేవనెత్తారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే దిగ్గజ నేత వీరభద్ర సింగ్ మరణం పార్టీకి పెద్ద లోటుగా మారింది. శక్తివంతమైన నాయకుడు లేకపోవడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయి. పెద్ద సంఖ్యలో నేతలు కమలం గూటికి చేరిపోయారు. సిఎం కుర్చీ కోసం పోటీ పడుతున్న నేతలు పార్టీ విజయంపై దృష్టిపెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చీపురు తెచ్చిన త్రిముఖం

సంప్రదాయంగా హిమాచల్‌లో ఎన్నికలు అనేవి కాంగ్రెస్, బిజెపి మధ్యనే పోటీగా ఉండేవి. అయితే ఈ సారి ఆమ్‌ఆద్మీ పార్టీ రంగంలోకి దిగింది. దీంతో సమీకరణాలు మారాయి. అనూహ్యంగా సత్యేంద్ర జైన్ జైలు పాలు కావడంతో ఆప్ పార్టీ ప్రచారం జోరుతగ్గింది. కేజ్రీవాల్, సిసోడియా, రాఘవ్ చద్దా లాంటి నేతలు గుజరాత్‌పై ఫోకస్ పెట్టారు. 67 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టినా హిమాచల్‌లో ఆప్ పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే కేజ్రీవాల్ పార్టీ చీల్చే ఓట్లు ఎవరికి నష్టం చేస్తాయనేదే అసలైన సవాలు. హిమాచల్‌లో ఆప్ ఎవరికి షాక్ ఇస్తుందో తేలాలంటే ఫలితాలు వెల్లడయ్యే డిసెంబర్ 8 వరకు ఆగాల్సిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News