Thursday, January 23, 2025

నారీ కటాక్షం ఎవరికి ప్రాప్తం

- Advertisement -
- Advertisement -

(మనతెలంగాణ/హైదరాబాద్): తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు వనితలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎన్నికల హామీలు గుప్పిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి కోటికి పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు సగం మంది మహిళా ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు చెందిన మహిళా ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పార్టీలు హామీలు ఇస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో దాదాపు సగం మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1.04 కోట్ల ఓటర్లలో 50.74 లక్షల మంది మహిళలు ఉన్నారు. మూడు జిల్లాల్లోని 28 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య స్వల్పంగా తక్కువగా ఉన్నా ప్రతి ఎన్నికల్లో పోలయ్యే ఓట్ల శాతం మహిళలదే అధికంగా ఉండటం విశేషం. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వీరి ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని అన్ని పార్టీలు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇప్పటికే మహిళల కోసం బిఆర్‌ఎస్ పలు పథకాలు…
గతంలో మహిళలు సొంత నిర్ణయాలు కాకుండా వారి ఇంట్లో భర్త, తండ్రి, పిల్లలు చెప్పిన వారికే ఓటేసేవారు. ప్రస్తుత సమాజంలో స్వతంత్రంగా ఆలోచించి ఓటేసే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పైగా రాజధానిలో అత్యధికులు విద్యావంతులు. వారే నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉన్నారు. ఈ పరిణామాలను గమనించే అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే మహిళల పేరుతోనే పలు పథకాలను మంజూరు చేసింది. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించే హామీలలో మహిళలకు మరిన్ని పథకాలు ఉంటాయన్న సంకేతాలను ఆ పార్టీ నేతలు ఇస్తున్నారు.

వలసల నేపథ్యంలో అధికంగా ఓటర్లు…
నగరానికి వలసలు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఎక్కువగా జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతుంటారు. దీంతో ఎక్కువ మంది ఇక్కడే నివాసం ఉంటూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకుంటున్నారు. దీంతో అన్ని జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ప్రతి నియోజకవర్గంలో పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ నుంచి ఉపాధి రీత్యా విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వారి కుటుంబం మాత్రం ఇక్కడే ఉంటున్నారు. దీంతో మహిళల ఓటింగ్ శాతం నగరంలో ఎక్కువగా నమోదవుతోంది. ఎక్కువ సంఖ్యలో మహిళలు ఎన్నికల ఓటింగ్లో పాల్గొని తమ నేతలు ఎవరో నిర్ణయిస్తున్నారు.

మహిళలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పలు హామీలు…
ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ మహిళలే లక్ష్యంగా పలు పథకాలను ప్రకటించింది. వాటిని కాంగ్రెస్ గ్యారంటీ పేరుతో మహిళల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరో ప్రధాన పార్టీ బిజెపి సైతం నగరంలో పాగా వేయాలని చూస్తోంది. హైదరాబాద్ నియోజకవర్గాలలోని ఓటింగ్‌లో కీలకమైన మహిళలను ఆకట్టుకునేలా ఇప్పటికే వంట గ్యాస్ రాయితీని పెంచింది. ఎన్నికల ప్రణాళికలో వీరి కోసం పథకాలు రచిస్తోంది. మహిళల్ని ఆకట్టుకోగ లిగితే గెలుపు ఖాయమైనట్టేనని పార్టీల నేతలంతా భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News