బెంగళూరు: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సర్ కార్యవాహ్(ప్రధాన కార్యదర్శి)గా కర్నాటకకు చెందిన దత్తాత్రేయ హోసబలె శనివారం ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నిక కాక ముందు వరకు ఆయన ఆర్‌ఎస్‌ఎస్ సహ సర్ కార్యవాహ్(సంయుక్త ప్రధాన కార్యదర్శి)గా ఉన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన అత్యున్నత నిర్ణాయక సంస్థ అఖిల భారతీయ ప్రతినిధి సభ(ఎబిపిఎస్) రెండు రోజుల వార్షిక సమావేశం శుక్రవారం నాడిక్కడ ప్రారంభమైంది. ఈ సమావేశంలో రెండవ రోజున ప్రధాన కార్యదర్శి ఎన్నిక జరిగింది. ఈ విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్ ట్వీట్ చేసింది. 2009 నుంచి సహ సర్ కార్యవాహ్‌గా దత్తాత్రేయ హొసబలె కొనసాగుతున్నారని ఆర్‌ఎస్‌ఎస్ తెలిపింది. సర్ కార్యవాహ్ పదవీకాలం మూడేళ్లపాటు ఉంటుంది. నాలుగు పర్యాయాలు ఈ పదవిలో కొనసాగిన 73 సురేష్ ‘భయ్యాజీ’ జోసి స్థానంలో హోసబలె ఎన్నికయ్యారు. సర్ సంఘ్‌చాలక్(ఆర్‌ఎస్‌ఎస్ అధినేత) తర్వాత రెండవ స్థానంగా సర్ కార్యవాహ్‌ను పరిగణిస్తారు. ప్రస్తుతం సర్ సంఘ్‌చాలక్‌గా మోహన్ భగవత్ కొనసాగుతున్నారు.
కర్నాటకలోని శివమొగ్గలోని సోరబ్‌లో జన్మించిన 65 సంవత్సరాల హోసబలె ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 1968లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన ఆయన తొలుత ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషద్(ఎబివిపి)లో పనిచేశారు. అనంతర కాలంలో ఆయన ఆర్‌ఎస్‌ఎస్ నిర్వాహకునిగా పనిచేశారు.