19న నామినేషన్ల స్వీకరణ
ఎంపీల రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నిక
కొలంబో : ఈ నెల 20న శ్రీలంక కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకోడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్స రాజీనామా చేశారని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహింద యప అబెవర్దన అధికారికంగా ప్రకటించారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ముగిసేవరకు ప్రధాని రణిల్ సింఘెనే తాత్కాలిక అధ్యక్షుడుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈనెల 19న నామినేషన్లు స్వీకరిస్తామని, 20న సభ్యులు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని చెప్పారు. గొటబాయ రాజపక్స రాజీనామాను స్పీకర్ లాంఛనంగా ప్రకటించడంతో రణిల్ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో విక్రమ సింఘెకు మద్దతు తెలపాలని అధికార శ్రీలంక పొదుజన పేరమున (ఎస్‌ఎల్‌పీపీ ) పార్టీ నిర్ణయించింది. గొటబాయ సోదరులైన మాజీ ప్రధాని మహింద రాజపక్స, మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్స జులై 28 దాకా దేశం విడిచి వెళ్లకుండా సుప్రీం కోర్టు నిషేధం విధించింది. ప్రజా తీర్పుతో కాకుండా ఎంపీలు రహస్య ఓటింగ్ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకోవడం 1978 తరువాత ఇదే మొదటిసారి. 20న అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వ్యక్తి పదవీ కాలం 2024 నవంబరు వరకు ఉంటుంది. అధ్యక్ష పదవి రేసులో విక్రమ సింఘెనే ముందంజలో ఉండగా, ఆయనకు పోటీగా తదుపరి స్థానంలో సాజిత్ ప్రేమదాస ఉన్నట్టు సమాచారం.