Wednesday, January 22, 2025

ఎర్రవల్లిలో ప్రశాంత్‌కిశోర్

- Advertisement -
- Advertisement -

Election strategist Prashant Kishor team meets CM KCR

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పికె) బృందం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చాంశనీయంగా మారింది. రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు సిఎం అడుగులు వేస్తున్న సమయంలో ఈ భేటికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం ఇదే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో వాడివేడి చర్చ సాగుతోంది. జాతీయ స్థాయిలో నెలకొన్న రాజకీయ పరిణామాలు….రాష్ట్ర రాజకీయాలపై కూడా వారిద్ధరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

ఆదివారం ఎరవెల్లిలోని ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రంలో కెసిఆర్‌ను కలిసి పికె బృందం సుదీర్ఘంగా చర్చలు జరపడం పలు రకాల ఊహాగానాలు, వివిధ రకాల చర్చలకు దారి తీస్తోంది. పైగా ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఘాటు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో… పలువురు ముఖ్యమంత్రులు సిఎం కెసిఆర్‌కు బాసటగా నిలుస్తుండడం వంటి అంశాలు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, కెసిఆర్ వ్యాఖ్యలపై పికె బృందం వివిధ రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ అభిప్రాయాలను సైతం సేకరిలించినట్లుగా తెలుస్తోంది. వాటిపై కూడా సిఎం కెసిఆర్‌తో పికె బృందం చర్చించినట్లుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే ఈ భేటీ చూస్తుంటే పికె బృందం టిఆర్‌ఎస్‌తో జతకట్టిందన్న సందేహాలు తలెత్తుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో ముఖ్యభూమిక పోషించే పనిలో ఉన్న కెసిఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రశాంత్ కిషోర్‌తో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ, జాతీయ రాజకీయాల్లో కెసిఆర్ వ్యూహం… ఎన్నికలలో అనుసరించాల్సిన విధానంపై పికె నేరుగా పర్యవేక్షించనున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల నుంచి రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ పర్యటన మొదలైందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో భాగంగా సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి పికె బృందం మల్లన్న సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించారని తెలుస్తోంది.

10వ తేదీ తరువాత నేరుగా రంగంలోకి దిగనున్న పికె?

వచ్చే నెల 10వ తేదీ నాటితో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత పికె తన వ్యూహాలకు మరింత పదును పెట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ఒక దశ ప్రాథమిక సర్వే కూడా ఐప్యాక్ బృందం సభ్యులు పూర్తి చేసినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై కూడా పికెతో సిఎం కెసిఆర్ సమాలోచనలు చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం జరగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే గోవాలో ఉన్న పికె ఫుల్ టీం రాష్ట్రంలో దిగబోతునట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయినట్టు సమాచారం. దీనికి పికె టీం పక్షాన రిషి తెలంగాణ బాధ్యతలు వహించబోతున్నట్టుగా ప్రదానంగా వినిపిస్తోంది తెలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News