Monday, January 20, 2025

ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎన్నిక జరిగింది.. అధ్యక్షా..!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ లోక్‌సభ స్పీకర్ పదవికి తాజాగా ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ఇలాంటి అరుదైన సందర్భం భారత పార్లమెంటరీ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా.. లేకపోతే అన్నిసార్లు ఏకగ్రీవంగానే సభాపతి ఎన్నిక అవుతూ వస్తున్నారా? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే లోక్‌సభ చరిత్రను చూస్తే గతంలో మూడు సార్లు స్పీకర్ పదవి కోసం ఎన్నికల ప్రక్రియ సాగినట్లు స్పష్టమవుతోంది.

1952 : జివి మౌలాంకర్ వర్సెస్ శంకర్ శాంతారామ్ మోరె
పార్లమెంట్ తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ లోక్‌సభలో గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ సభ్యుడు జివి మాల్వంకర్ పేరును స్పీకర్ పేరుకు ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. జివి మౌలాంకర్ స్వాతంత్య్ర సమరయోధుడు, రాజ్యాంగ సభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉన్నందున ఈ పదవికి సరియైన వ్యక్తిగా అభివర్ణించారు. నెహ్రూ ప్రతిపాదించిన తీర్మానాన్ని అప్పటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సత్యనారాయణ సిన్హా, దర్భాంగ ఎంపి ఎస్‌ఎన్ దాస్, గుర్గావ్ సభ్యుడు పండిట్ ఠాకూర్ సమర్ధించారు.

అయితే భారత కమ్యూనిస్టు విప్లవోద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరైన కన్ననూర్ ఎంపి ఎకె గోపాలన్ అనూహ్యంగా విపక్షం నుంచి శంకర్ శాంతారామ్ మోరె పేరును స్పీకర్‌గా ప్రతిపాదించారు. సిపిఐ సహా ఆర్‌ఎస్‌పి, వర్కర్స్ పార్టీ, మార్కిస్ట్ పొలిటికల్ పార్టీ తదితర పార్టీల సభ్యులు ఆయన ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. 394 ఓట్లతో జివి మౌలాంకర్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి మోరెకు 55మంది ఎంపిలు మాత్రమే మద్దతు తెలిపారు.

1967 : విశ్వనాథం వర్సెస్ నీలం సంజీవరెడ్డి
కాంగ్రెస్ ప్రతిపాదించిన నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా తెన్నేటి విశ్వనాథం స్పీకర్ బరిలో నిలిచారు. అయితే నీలం సంజీవరెడ్డికి 278 ఓట్లు రాగా, విశ్వనాథానికి 207 ఓట్లు వచ్చాయి. దీంతో స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి ఎన్నికయ్యారు.

1976 : బిఆర్ భగత్ వర్సెస్ జగన్నాథ్‌రావు జోషి
ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత 1975లో ఐదో లోక్‌సభ ఐదో సమావేశాలను ఏడాదిపాటు పొడిగించారు. అప్పటి స్పీకర్ జిఎస్ థిల్లాన్ డిసెంబర్ 1,1975లో రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. జనవరి 5, 1976లో అప్పటి ప్రధాని ఇందిర బలిరామ్ భగత్ పేరును స్పీకర్ పదవికి ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే కాంగ్రెస్(ఓ)కు చెందిన ప్రసన్నభాయ్ మెహతా జనసంఘ్ నేత జగన్నాథరావు జోషి పేరును ప్రతిపాదించారు. దీంతో జరిగిన ఎన్నికల్లో భగత్‌కు 344 ఓట్లు రాగా… జోషికి కేవలం 58 మంది మాత్రమే మద్దతుగా నిలిచారు.

ఇప్పటి వరకు ఎంఎ అయ్యంగార్, జిఎస్ థిల్లాన్, బలరాం జాఖడ్, జిఎంసి బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా రెండు సార్లు బాధ్యతలు చేపట్టిన వారిలో ఉన్నారు. ఓం బిర్లా కూడా బుధవారంనాడు జరగనున్న ఎన్నికల్లో గెలిస్తే రెండు సార్లు ఆ పదవి చేపట్టిన వారి సరసన చేరుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News